Friday, January 10, 2025

ప్రభుత్వ తప్పిదంతోనే తొక్కిసలాట:వై.ఎస్ జగన్

- Advertisement -
- Advertisement -

తిరుపతిలో ఎప్పుడూ తొక్కిసలాట ఘటన జరగలేదని, లక్షల మంది భక్తులు వస్తారని ముందే తెలిసినా భద్రతా ప్రొటోకాల్స్ ఎందుకు పాటించలేదని వైసీపీ అధినేత, మాజీ సీఎం వై.ఎస్ జగన్ మోహన్‌రెడ్డి ప్రశ్నించారు. అందరూ చంద్రబాబు పర్యటనలో నిమగ్నమయ్యారని, ఎలాంటి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయలేదని విమర్శించారు. ఒక్కసారిగా గేట్లుతెరవడంతో తొక్కిసలాట జరిగిందని, ఘటనకు అధికారులతో పాటు చంద్రబాబు కూడా బాధ్యులే-నని అన్నారు. ప్రభుత్వ తప్పిదంతోనే తొక్కిసలాట జరిగిందని, ఘటనకు ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. మృతుల కుటుంబాలకు రూ.50లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు. క్షతగాత్రులకు రూ.5 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని, బాధ్యులందరిపైనా చర్యలు తీసుకోవాలని కోరారు. గురువారం తిరుపతిలో తొక్కిసలాట ఘటనా స్థలాన్ని వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మోహన్‌రెడ్డి పరిశీలించారు. అనంతరం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించి ధైర్యం చెప్పారు.

ఆసుపత్రి ఎదుట మీడియాతో మాట్లాడుతూ ఇది ప్రభుత్వం చేసిన తప్పు అని మండిపడ్డారు. వైసీపీ అధికారంలో ఉన్న గత ఐదేళ్లు గొప్పగా నిర్వహించామని తెలిపారు. ఒకచోటే తొక్కిసలాట జరిగిందని చంద్రబాబు అబద్ధాలు ఆడుతున్నారన్నారు. విష్ణునివాసంలో ఒకరు చనిపోయారని ఎఫ్‌ఐఆర్ కాపీలో ఉందని, బైరాగిపట్టెడలో ఐదుగురు చనిపోయారని ఎఫ్‌ఐఆర్‌లో ఉందన్నారు. తొక్కిసలాట ఘటనలో ఆరుగురు చనిపోయారని, స్విమ్స్ ఆసుపత్రిలో మొత్తం 35 మంది చికిత్స పొందుతున్నారని స్పష్టం చేశారు. మొత్తం 50 నుంచి 60 మందికి గాయాలైనట్టు తెలుస్తోందని, ఇంత దారుణంగా వ్యవస్థను నడుపుతున్నారని మండిపడ్డారు. టీటీడీ అధికారులు గానీ, పోలీసులు గానీ ఎవరూ పట్టించుకోలేదని జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుపతిలో ఘటన రాష్ట్ర చరిత్రలోనే ఎప్పడూ జరగలేదని అన్నారు. ఈ ఘటన వెనుక ఆశ్చర్యకరమైన విషయాలు బయటకు వస్తున్నాయని తెలిపారు. లక్షలాది మంది వస్తారని తెలిసినా భద్రత కల్పించలేదని, టీటీడీ అధికారుల నుంచి ఎస్పీ, కలెక్టర్ అందరూ ఇందులో భాగస్వాములేనని జగన్ అన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News