మన తెలంగాణ/హైదరాబాద్ : నేడు మ ధ్యాహ్నం 3 గంటలకు జిల్లా కలెక్టర్లతో సి ఎం రేవంత్‌రెడ్డి కీలక సమావేశం నిర్వహించనున్నారు. సచివాలయంలో జరిగే అన్ని జిల్లాల కలెక్టర్లతో మీటింగ్‌లో సిఎం పాల్గొననున్నారు. ఈ సమావేశంలో ముఖ్యంగా రైతు భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించనున్నారు. కా గా, త్వరలో రానున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ప్రజల్లోకి ప్రభుత్వ పథకాల గురించి విస్తృతంగా తీసుకువెళ్లేందుకు నా యకులు, కార్యకర్తలు, అధికారులు పలు కార్యక్రమాలు చేపట్టాలని ఇదివరకే సిఎం రేవంత్ రెడ్డి సూచించారు. ఈ క్రమంలోనే అన్ని జిల్లాల్లో ప్రభుత్వ పథకాలు, అభివృద్ధితో పాటు ఇంకా ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాలన్న అంశాలపై నేడు సిఎం కలెక్టర్లకు దిశానిర్ధేశం చేయనున్నారు.
తిరుమలకు సిఎం
అంతకుముందు సిఎం రేవంత్ రెడ్డి తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు. వైకుంఠ ఏకాదశి సందర్బంగా శుక్రవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుటుంబంతో కలిసి శ్రీవారిని దర్శించుకోనున్నారు. ముందుగానే తిరుమల అధికారులకు సమాచారం అందించడంతో టిటిడి అధికారులు అన్ని రకాల చర్యలు తీసుకున్నారు. బుధవారం రాత్రి తొక్కిసలాట జరిగిన నేపథ్యంలో సిఎం రేవంత్ రెడ్డి తిరుమల దర్శనానికి వస్తుండటంతో అక్కడి అధికారులు సైతం పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు.