Friday, January 10, 2025

కావేరి పాత్ర ఛాలెంజింగ్‌గా అనిపించింది

- Advertisement -
- Advertisement -

వరుస ఘన విజయాలతో దూసుకుపోతున్న గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ ఈ సంక్రాంతికి ’డాకు మహారాజ్’ చిత్రంతో అలరించనున్నారు. బ్లాక్ బస్టర్ దర్శకుడు బాబీ కొల్లి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్ కథానాయికలు. సంక్రాంతి కానుకగా ఆదివారం ’డాకు మహారాజ్’ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా భారీస్థాయిలో విడుదల కానుంది. ఈ సందర్భంగా కథానాయిక ప్రగ్యా జైస్వాల్ మీడియాతో మాట్లాడుతూ “అఖండ, డాకు మహారాజ్, అఖండ -2.. ఈ విధంగా బాలకృష్ణతో వరుసగా సినిమా చేసే అవకాశం రావడం గౌరవంగా భావిస్తున్నాను.

డాకు మహారాజ్ లాంటి మంచి సినిమాలో బాలకృష్ణతో కలిసి నటించడం సంతోషంగా ఉంది. డాకు మహారాజ్ ఘన విజయం సాధిస్తుందని, ఈ చిత్రంలోని నా పాత్రను ప్రేక్షకులు ఆదరిస్తారని నమ్ముతున్నాను. ఇందులో నేను కావేరి పాత్ర పోషించాను. నటనకు ఆస్కారమున్న మంచి పాత్ర ఇది. డీ గ్లామరస్ రోల్ చేశాను. నేను ఇప్పటివరకు పోషించిన పాత్రలకు భిన్నంగా ఉంటుంది. కావేరి పాత్రను బాబీ డిజైన్ చేసిన తీరు బాగుంది. ఈ పాత్ర నాకు నటిగా ఛాలెంజింగ్‌గా అనిపించింది. కావేరి పాత్రతో పాటు ఈ సినిమాలోని ప్రతి పాత్రకు ప్రాధాన్యత ఉంటుంది. బాబీ కథ చెప్పినప్పుడే ఇది మంచి చిత్రం అవుతుందని నమ్మాను. నేను ఊహించిన దానికంటే గొప్పగా ఈ చిత్రాన్ని రూపొందించారు.

బాలకృష్ణని సినిమాలో చాలా కొత్తగా చూపించారు. విజువల్స్ కూడా అద్భుతంగా ఉంటాయి. తెలుగులో అగ్ర నిర్మాణ సంస్థల్లో ఒకటైన సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లో నటించే అవకాశం రావడం ఆనందంగా ఉంది. నాగవంశీ గొప్ప నిర్మాత. దర్శకులను, టీంని ఎంతో నమ్ముతారు. అందరిని స్వేచ్ఛగా పని చేసుకోనిస్తారు. తమన్ ’డాకు మహారాజ్’ చిత్రానికి అద్భుతమైన సంగీతం అందించారు. నాకు ది రేజ్ ఆఫ్ డాకు సాంగ్ ఎంతగానో నచ్చింది. దబిడి దిబిడి, చిన్న సాంగ్స్ కూడా బాగున్నాయి. పాటలతో పాటు ఈ చిత్ర నేపథ్య సంగీతం కూడా బాగుంటుంది. బాలకృష్ణతో కలిసి నేను నటించిన సినిమా నా బర్త్ డేకి విడుదల కావడం నా అదృష్టం. ఇది నా పుట్టినరోజుకి ఒక పెద్ద బహుమతిగా భావిస్తున్నాను. అలాగే నేను నటించిన సినిమా సంక్రాంతి లాంటి పెద్ద పండుగకు విడుదలవుతుండటం కూడా ఎంతో సంతోషంగా ఉంది”అని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News