Friday, January 10, 2025

కాంగ్రెస్ ఫోబియా-కానరాని సైన్స్ కాంగ్రెస్

- Advertisement -
- Advertisement -

గతంలో జవహర్ లాల్ నెహ్రూ దగ్గర నుండి కాంగ్రెస్ పార్టీ ‘హిందూ’ ఫోబియాతో భారతీయ సామాజిక జీవనానికి చెప్పలేని విధ్వంసాలు సృష్టిస్తూ వచ్చింది. నాడు స్వాతంత్య్ర పోరాటంలో తిరుగులేని నాయకత్వం వహించిన కాంగ్రెస్ నేతల అవకాశవాద విధానాలను సవాల్ చేస్తూ ప్రజలలో ప్రాబల్యం పెంచుకుంటున్న హిందూ మహాసభపట్ల చెలరేగిన అభద్రతా భావమే అటువంటి ఫోబియాకు దారితీసిందని చెప్పవచ్చు. ఆ తర్వాత దేశవిభజన సమయంలో కాంగ్రెస్ నిస్తేజంగా మారడం, హిందువుల రక్షణ కోసం రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) అగ్రగామిగా నిలబడడంతో ఆ సంస్థ పట్ల అభద్రతా భావం చెలరేగింది. ముందుగా సర్దార్ పటేల్ ద్వారా కాంగ్రెస్ అనుబంధ స్వచ్ఛంద సంస్థగా ఆర్‌ఎస్‌ఎస్ ను చేరమని అధికారికంగా కాంగ్రెస్ ఆహ్వానించింది.

అందుకు ఆ సంస్థ విముఖత వ్యక్తం చేయడంతో ఆ పటేల్ ద్వారానే గాంధీజీ హత్యను సాకుగా తీసుకొని ఆ సంస్థపై నిషేధం విధించింది. ఆ తర్వాత జనతా ప్రభుత్వంలోని సోషలిస్టులలో సైతం ఆర్‌ఎస్‌ఎస్‌పట్ల అభద్రతా భావం ఏర్పడింది. ముందుగా ఆర్‌ఎస్‌ఎస్ సైతం జనతా పార్టీలో అనుబంధ సంస్థగా విలీనం కావాలన్నారు. అందుకు ఒప్పుకోకపోవడంతో ‘ద్వంద సభ్యత్వం’ వివాదంతో నాటి జనతా ప్రభుత్వాన్నే కూల్చివేశారు. కాంగ్రెస్ మొత్తం మీద మూడు సార్లు ఆర్‌ఎస్‌ఎస్‌పై నిషేధం విధించింది. కానీ సాధించింది ఏమీ లేదు. ఎమర్జెన్సీ సమయంలో స్వయంగా ఇందిరా గాంధీ నిషేధ సమయంలో ఆర్‌ఎస్‌ఎస్ ప్రతి మూలకు విస్తరించింది అంటూ చెప్పుకురావడం గమనార్హం. హిందూ అనే పదం హిందూ మహాసభ లేదా ఆర్‌ఎస్‌ఎస్ తీసుకొచ్చింది కాదనే స్పృహ లేకపోవడంతో కాంగ్రెస్ పార్టీ ఎంతో నష్టపోయి నేడు తన అస్తిత్వంకోసం పోరాడాల్సిన పరిస్థితి తెచ్చుకుంది. ఈ సంస్థలకన్నా ముందు చెన్నైలో ‘ది హిందూ’ అనే దినపత్రిక ప్రారంభమైంది.

బెంగళూరులో హిందూస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ అనే రక్షణ ఉత్పత్తుల సంస్థ ఏర్పడింది. పలు ప్రభుత్వ రంగ సంస్థలు ‘హిందూ’ పేరుతో వెలిశాయి. ఇప్పుడు నరేంద్ర మోడీ నాయకత్వంలో బిజెపి సైతం ‘నెహ్రూగాంధీ’, ‘కాంగ్రెస్’ ఫోబియాతో సతమతమవుతున్నట్లు కనిపిస్తున్నది. స్వతంత్ర భారత దేశంలో భారత సైన్యం సాంకేతికంగా గెలుపొంది, విదేశీ సైనికులు లొంగుబాటు ప్రదర్శించిన యుద్ధం 1971 మాత్రమే. ఆ ఘనమైన విజయానికి చిహ్నంగా పాక్ సైనికులు మనసైనికుల ముందు లొంగిపోయిన చిత్రాన్ని భారత సైన్యం తన ప్రధాన కార్యాలయంలో గత 50 ఏళ్లుగా ఉంచుతూ వచ్చింది. విదేశీ సైనికాధికారులు ఎవ్వరు వచ్చినా ఈ చిత్రం ముందే మన సైన్యాధిపతులతో భేటీ జరపడం, ఫోటో దిగడం జరుగుతూ వస్తోంది. ఈ చిత్రంలో ఇందిరా గాంధీ లేరు. అయినా దానిని చూడగానే ఆమె సాహసం, వైట్ హౌస్‌కు వెళ్లి ‘కొన్ని వేల కిలోమీటర్ల దూరం నుండి వర్ధమాన దేశాలపై ఆధిపత్యం వహించాలి అంటే కుదరదు’ అని హెచ్చరించిన ఆమె ధైర్యం ప్రజలకు గుర్తుకు వస్తాయనే భయంతో ఆ ఫోటోను మార్చివేశారు. అగ్రరాజ్యాల ప్రాపకం కోసం అర్రులు చేస్తున్న నేటి పాలకులలో ఓ విధమైన వణుకు వచ్చినట్లుంది. తమ ఘనమైన పాలన ద్వారా ప్రజలకు ఎల్లప్పుడూ గుర్తుండే ప్రయత్నం చేయకుండా గత పాలకుల గుర్తులు చెరిపివేసే ప్రయత్నాలు గత పదేళ్లుగా పెద్ద ఎత్తున చేస్తూనే ఉన్నారు.

తాజాగా గత రెండేళ్లుగా ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ వార్షిక సమావేశాలు జరగడంలేదు.జనవరి 3 అంటే దేశంలో ఎక్కడో ఒకచోట సైన్స్ కాంగ్రెస్ సమావేశాలను ప్రధాన మంత్రిగా ఎవ్వరుంటే వారు ప్రారంభించడం ఆనవాయితీగా వస్తోంది. అదే విధంగా ముగింపు సమావేశంలో రాష్ట్రపతి ప్రసంగిస్తారు. దేశంలోని కీలక శాస్త్రవేత్తలకు మాత్రమే కాకుండా, అంతర్జాతీయంగా కూడా సైన్స్‌రంగంలో గుర్తింపు పొందిన సమావేశాలు ఇవి. గత ఏడాది అయితే సమావేశాలను జరపడం లేదనే ప్రకటన చేశారు. ఈ సంవత్సరం అటువంటి ప్రకటన కూడా రాలేదు. ‘కాంగ్రెస్’ అంటే సమూహమని చెప్పొచ్చు. అమెరికాలో ఎన్నికైన ప్రజాప్రతినిధులతో ఏర్పడే సమూహాన్ని ‘కాంగ్రెస్’ అనే అంటారు. అయితే నేటి పాలకులకు కాంగ్రెస్ అనగానే అభద్రతాభావం పెల్లుబుకు వస్తున్నట్లు కనిపిస్తున్నది. కాంగ్రెస్ ప్రభుత్వాలను రాష్ట్రాల్లో కూల్చి వేస్తూ వచ్చారు. ఇప్పుడు కాంగ్రెస్ పేరుతో ఉండే అన్ని రకాల సమావేశాలకు తిలోదకాలిచ్చే ప్రయత్నం చేస్తున్నారా? అనే అనుమానం కలుగుతుంది. ఇటీవల కాలంలో సైన్స్ కాంగ్రెస్ నిర్వహణకు అంతరాయం కలుగుతుంది. సమావేశాల ప్రధాన అంశాన్ని నిర్ణయించే విషయంలో కేంద్ర ప్రభుత్వ శాస్త్రీయ, సాంకేతిక మంత్రిత్వ శాఖకు, సమావేశాలను నిర్వహించే ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ అసోసియేషన్‌లకు మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ఈసమావేశాలు జరగడం లేదని తెలుస్తోంది.

ఈ సమావేశాలకు ఆర్థిక వనరులను సమకూర్చే కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వశాఖ తాము సూచించిన అంశాలపైన చర్చించకపోతే నిధులు ఇవ్వమని స్పష్టం చేయడంతో సైన్స్ కాంగ్రెస్ నిర్వహించలేకపోతున్నట్లు తెలుస్తున్నది. సాధారణంగా కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు కేవలం అధికారంలో ఉన్న నేతల ప్రచారానికి పనికివచ్చే అంశాలను సూచించడం, అందుకు శాస్త్రవేత్తలు అంగీకరించకపోవడంతో వివాదం ఏర్పడినట్లు భావించాల్సి వస్తుంది. 1914లో లక్నోలోని కానింగ్ కాలేజ్ ప్రొఫెసర్ పిఎస్ మాక్ మహన్, మద్రాసులోని రెసిడెన్సి కళాశాల ఆచార్యులు జెఎల్ సిమన్సేన్ సంయుక్తంగా చేసిన ఆలోచన తర్వాత కాలంలో ప్రతి ఏటా సైన్స్ కాంగ్రెస్ పేరున శాస్త్రవేత్తల సమ్మేళనం జరగడానికి కారణమైంది. తొలుత కొన్ని విభాగాలతోనే అది మొదలైనా క్రమంగా విస్తరించడం, దానికి తోడుగా స్వాతంత్య్రోద్యమం కూడా కలవడం వల్ల అది మరింత బలపడింది.

1930 నుంచి ప్రాధాన్యత మరింత స్పష్టంగా పెరుగుతూ వచ్చింది. మరీ ముఖ్యంగా 1937లో జవహర్ లాల్ నెహ్రూ ఈ సమావేశాల్లో పాల్గొని సైన్సు ప్రాధాన్యత ఏమిటో, సమాజ నిర్మాణంలో అది ఎటువంటి పాత్ర పోషించగలదో వివరించిన ప్రసంగానికి చాలా ప్రాధాన్యత ఉంది. 1947 దాకా బ్రిటిష్ వారి ఏలుబడిలో భారతీయ, ఐరోపా శాస్త్రవేత్తల కలయిక వేదికగా కొనసాగుతూ ఉండెడిది. కానీ తర్వాత కాలం లో ఈసమావేశాల్లో చేసిన ప్రతిపాదనల కారణంగానే పర్యావరణం సంబంధించి, సముద్ర వనరుల వినియోగం గురించి ప్రత్యేక దృష్టి సారించిన కారణంగానే తర్వాతి కాలంలో అవి ప్రత్యేక మంత్రిత్వ శాఖలుగా కూడా పరిణమించడం ఓ చరిత్ర. నాలుగు దశాబ్దాల క్రితం విశాఖపట్నంలో జరిగిన సైన్స్ కాంగ్రెస్ సమావేశాల్లో ప్రతి ఏటా ఒక ప్రత్యేక లక్ష్యంతో జరగాలని నిర్ణయం తీసుకోవడంతో దానికి తగ్గట్టుగా జరుగుతున్నాయి.

ఇంత ప్రాధాన్యత ఉన్నా విమర్శలు కూడా క్రమంగా పెరుగుతూ వచ్చాయి. గట్టి కృషి కన్నా వట్టి ప్రచార పటాటోపమే ఎక్కువ అని, ఇంకా ఇది ఒక సైన్స్ కుంభమేళా వంటి సమ్మేళనమని కూడా తరచూ వినపడింది.అవినీతి ఆరోపణలు కూడా బాగానే ఉన్నాయి. అంతర్గత సంస్కరణల గురించి పట్టించుకోవడం లేదు. సైన్స్ కాంగ్రెస్ -2017ను నిర్వహించాల్సిన తమిళనాడులోని యూనివర్శిటీలో జరిగిన ఆర్థికపరమైన అవకతవకల కారణంగా అర్ధాంతరంగా వేదికను తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయానికి మార్చారు. కరోనా 2021, 2022 లలో సైన్స్ కాంగ్రెస్ సమావేశాలు జరగలేదు. గత ఏడాది నాగపూర్‌లో సైన్స్ కాంగ్రెస్ సమావేశాలను ప్రధాని నరేంద్ర మోడీ వర్చ్యువల్‌గా ప్రారంభించారు. జనవరి 2024లో జరిగే సైన్స్ కాంగ్రెస్‌కు ప్రభుత్వం నుండి ఎటువంటి మద్దతు ఉండబోదని కేంద్ర శాస్త్ర, సాంకేతిక మంత్రిత్వ శాఖ గత సెప్టెంబర్‌లో స్పష్టం చేయడంతో తొలుత సైన్స్ కాంగ్రెస్ వేదికగా నిర్ణయమైనా లక్నో యూనివర్శిటీ వెనకడుగు వేసింది.

ఆ తర్వాత ముందుకొచ్చిన లవ్లీ యూనివర్శిటీ సైతం కొద్ది రోజుల ముందే చేతులెత్తేయడంతో మరో వేదిక ఏర్పాటు చేసుకోవడం సాధ్యం కాలేదు. వీలైతే వచ్చే నేల జరిపేందుకు నిర్వహణకు ముందుకు వచ్చే సంస్థలకు విజ్ఞప్తి చేయనున్నట్లు అసోసియేషన్ అధ్యక్షుడు అరవింద్ సక్సేనా ప్రకటించారు. ఐదు రోజుల పాటు సైన్స్ కాంగ్రెస్ జరిపే సంస్థలకు కేంద్ర ప్రభుత్వం రూ 5 కోట్లు ఇస్తుంది. సైన్స్ కాంగ్రెస్ సమావేశాలను నిర్వీర్యం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం 2015 నుండి భారతీయ అంతర్జాతీయ సైన్స్ ఉత్సవాలను జరుపుతుంది. తమ స్వతంత్ర నిర్వహణను కాపాడుకునేందుకు ప్రభుత్వ జోక్యాన్ని నిరసిస్తూ సైన్స్ కాంగ్రెస్ అసోసియేషన్ కోర్టు మెట్లు కూడా ఎక్కాల్సి వచ్చింది. ఏదిఏమైనా రాజకీయ వివాదాల సుడిగుండంలో ప్రతిష్ఠాకరమైన ఇండియా సైన్స్ కాంగ్రెస్ సమావేశాలు అంతరించి పోనున్నాయా?

చలసాని నరేంద్ర
9849569050

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News