నిన్న ప్రధాన మంత్రి అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం పూడిమడకలో ఎన్‌టిపిసి ఇంటిగ్రేటెడ్ గ్రీన్ హైడ్రోజన్ హబ్ శంకుస్థాపన చేశారు. ఈ ప్రాజెక్టులో భాగంగా ప్రభుత్వరంగ సంస్థ మూడు దశల్లో రూ. 65,370 కోట్లు పెట్టుబడి పెట్టనుంది. మొదటి దశలో 2,500 ఎకరాల భూమిలో రూ. 1,518 కోట్ల ప్రాజెక్టు అయిన కృష్ణపట్నం ఇండస్ట్రియల్ హబ్‌ను ప్రధానమంత్రి వర్చువల్‌గా ప్రారంభిచారు. ఇది 50,000 మందికి ఉపాధి అవకాశాలను సృష్టిస్తుందని భావిస్తున్నారు. నక్కపల్లిలో రూ.1,877 కోట్లతో బల్క్‌డ్రగ్స్ పార్కును కూడా మోడీ శంకుస్థాపన చేయనున్నారు. రూ. 11,542 కోట్ల పెట్టుబడితో 2,002 ఎకరాల్లో బల్క్ డ్రగ్స్ పార్క్ 54,000 మందికి ఉపాధిని కల్పిస్తుందని అంచనా. దేశప్రధాని రాష్ట్ర ఆర్థిక రాజధాని విశాఖ వచ్చి వెళ్లారు. భారీ బహిరంగ సభలో మాట్లాడారు.
ఆయన ప్రసంగంలో రాష్ట్రాన్ని వేధిస్తున్న సమస్యలపై స్పందించకపోవడం తీవ్ర నిరాశకు గురిచేసింది. ఈ ప్రాంతం, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు గత నాలుగేళ్లుగా పోరాడుతున్న విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మాట మాత్రం కనీసంగా కూడా ఎత్తలేదు. పక్కనే ఉన్న సిఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కనీసంగా కూడా అడగలేదు సరికదా, ఆయనను ప్రసన్నం చేసుకోవడానికే ఇద్దరూ పోటీపడ్డారు. ముచ్చటగా ముగ్గురూ కలిపి ఈ సభా వేదికగా ఆంధ్ర రాష్ట్రానికి మోసం చేశారు. సభఅంతా ఒకరినొకరు పొగుడుకోవడంతోనే సరిపోయింది. ప్రధాని సభలో పదేపదే ప్రస్తావించిన గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టు నిర్మాణం, ఆయన విధానపరంగానే ద్వేషించే, ఒక ప్రభుత్వ రంగ పరిశ్రమ అయిన ఎన్‌టిపిసి ద్వారా జరగడం ప్రభుత్వరంగ ప్రాధాన్యత తెలుస్తోంది. మరోవైపు కడపలోని ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్ ప్రధాన కార్యాలయాన్ని అమరావతికి తరలించుకుపోవాలని ప్రభుత్వ పెద్దలు కృత నిశ్చయంతో ఉన్నారు. సంప్రదాయాన్ని, మార్గదర్శకాల్ని పక్కకుతోసి తమ పంతం నెగ్గించుకోవాలని చూస్తున్నారు. పాలకులు, పాలక పార్టీలు ఏవైనాసరే దశాబ్దాల తరబడి రాయలసీమ నిర్లక్ష్యానికి గురవుతుందనడానికి తిరుగులేని సత్యమిది. మళ్ళీమళ్ళీ పునరావృతం అవుతున్న విషాదమిది.
ఇప్పటికే కొప్పర్తి ఇండస్ట్రియల్ హబ్‌లో భాగమైన ఎంఎస్‌ఎంఇ టెక్నాలజీ సెంటర్ అమరావతికి తీసుకుపోయారు. తాజాగా, రాయలసీమ నుంచి లోకాయుక్త, మానవ హక్కుల కమిషన్, ఎపిఇఆర్‌సి, వక్ఫ్ ట్రిబ్యునల్, సిబిఐకోర్టు అమరావతికి తరలిస్తున్నారన్న వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. ఎపిజిబి ప్రధాన కార్యాలయాన్ని అమరావతికి తరలించడం అంటే రాయలసీమ ప్రజలంటే పాలకులకు లెక్కలేనితనమే కారణం. గ్రామీణ బ్యాంకింగ్ కార్యకలాపాలు నిర్ణయించబడే ప్రధాన కార్యాలయం వెనకబడిన జిల్లాలకే అవసరం ఎక్కువ. అంతేకాక ప్రధాన కార్యాలయం ప్రత్యక్ష పరోక్ష ఉపాధి అవకాశాలకు కూడా వీలు కల్పిస్తుంది. పేద, మధ్యతరగతి, చిన్న, సన్నకారు రైతులకు, చిన్నచిన్న వ్యాపారులకు, డ్వాక్రా సంఘాలు, చేతివృత్తులు, చిన్నపరిశ్రమలు, స్వయం ఉపాధి సంఘాలకు, ఎదిగొచ్చే ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు -ఇలా అనేక రకాల వారికి రుణాలను ఇచ్చే బ్యాంకు ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్.
రాయలసీమకు జరిగిన అనేక అన్యాయాల కొనసాగింపుగానే అన్ని సంస్థల తరలింపు జరుగుతున్నది. ఆంధ్రప్రదేశ్‌లో ప్రాంతీయ వృద్ధి నమూనాలు వేతనాలలో సర్దుబాట్లు లేదా మూలధనానికి రాబడికి సంబంధించిన అంచనాలకు అనుగుణంగా లేవు. ఇది చివరికి ప్రాంతీయ ఆర్థిక కలయికకు దారితీస్తుంది. ఆంధ్రప్రదేశ్‌లో ప్రాంతీయ అసమతుల్యతలను తగ్గించడంలో ఏరకమైన జోక్యం సహాయపడుతుందనేది ప్రశ్నగా మిగిలిపోయింది. కడప ఉక్కు ఫ్యాక్టరీ, దుగ్గరాజపట్నం పోర్టు సాధ్యం కాదని కేంద్ర ప్రభుత్వం చేతులెత్తేసింది. రాష్ట్ర విభజన చట్టం ప్రకారం ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాలకు రావలసిన ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీలను కేంద్ర ప్రభుత్వం ఒక ప్రహసనంలా మార్చేసింది. వీటిపై కూడా కూటమి నేతలు నోరు మెదపడం లేదు. డబుల్ ఇంజన్ సర్కార్ వస్తే రాష్ట్రానికి ఏదో న్యాయం జరుగుతుందని కొంతమందికైనా వున్న భ్రమలు ఇప్పుడు క్రమేణా కరిగిపోతున్నాయి. విద్యుత్ చార్జీలు, ఇతర బాదుళ్లతో సామాన్యుల నడ్డి విరుస్తున్నాయి. స్టీల్‌ప్లాంట్‌ను కాపాడు కోవాలన్నా, విభజన చట్టం అమలు కావాలన్నా, ఎడాపెడా వేస్తున్న భారాలను తిప్పికొట్టాలన్నా, చట్టపర హక్కులను నిలబెట్టుకోవాలన్నా ప్రజా పోరాటమే శరణ్యం.
డా. ముచ్చుకోట సురేష్ బాబు
99899 88912