Friday, January 10, 2025

బాధ్యతలకు ముందే వివాదాల్లో ట్రంప్

- Advertisement -
- Advertisement -

అమెరికా అధ్యక్షునిగా అనూహ్యమైన ఘన విజయం సాధించిన డొనాల్డ్ ట్రంప్, ఈ నెల 20న పదవీ బాధ్యతలు స్వీకరించటానికి ముందే సంచలనాలు సృష్టిస్తున్నారు. పదవి స్వీకరించిన తర్వాత తన కేబినెట్‌లోకి నియమించనున్న వారిపేర్లు ప్రకటించగా, అందులో కొన్ని ఇప్పటికే వివాదాస్పదం అయ్యాయి.అది ఇంకా సద్దుమణగ ముందే తాజాగా గ్రీన్‌ల్యాండ్, పనామా కాలువ, గల్ఫ్ ఆఫ్ మెక్సికో, కెనడాల గురించి చేస్తున్న ప్రకటనలు సరికొత్త వివాదంగా మారియి. అయినప్పటికీ తన వైఖరిని మార్చుకోకపోగా, అవే ప్రకటనలు మళ్లీ మళ్లీ చేస్తుండటం ప్రస్తుతం పాశ్చాత్య ప్రపంచమంతటా తీవ్ర చర్చనీయాంశం అయింది. డెన్మార్క్‌కు చెందిన గ్రీన్‌ల్యాండ్‌ను తాము కొనివేయగలమని, పనామా దేశానికి చెందిన పనామా కాలువను స్వాధీనం చేసుకోగలమని, గల్ఫ్ ఆఫ్ మెక్సికో పేరును గల్ఫ్ ఆఫ్ అమెరికాగా మార్చగలమని, స్వతంత్ర దేశమైన కెనడా అమెరికాలో భాగంగా మారాలన్నది ట్రంప్ చేస్తున్న వాదనలు. ఆయన ఈ వాదనలన్నీ ఒకదాని వెనుక ఒకటిగా చేయటం అయోమయాన్ని తీవ్ర నిరసనలను సృష్టిస్తున్నది.

ఈ వైఖరికి తను చెప్తున్న కారణాలేమిటి, అసలు ఉద్దేశాలేమిటన్నదానిపై చర్చోపచర్చలు సాగుతున్నాయి. ట్రంప్ నిజమైన ఆలోచనలేమిటో, మునుముందు ఏమి జరుగుతుందో తెలియదు గాని, ముఖ్యంగా ఆయా దేశాల నుంచి మాత్రం తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. ఆ వివరాలలోకి వెళ్ళే ముందు, వివిధ పదవులకు తన నామినేషన్ల వివాదమేమిటో చూద్దాం. అమెరికాలోని విధానం ప్రకారం, అధ్యక్షుడైన వ్యక్తి ఆయా కేబినెట్ పదవులకు వ్యక్తులను నామినేట్ చేస్తారు. ఆ నామినేషన్లను సెనేట్ ఆమోదించటం తప్పనిసరి. అప్పుడే వారి నియామకాలు అమలుకు వస్తాయి. ఆ విధంగా ట్రంప్ తన రక్షణ శాఖ కార్యదర్శిగా లేక మంత్రిగా పీట్ హెగ్ సెట్‌ను మొదటి నామినేట్ చేశారు. ఆయన 2017లో జరిగిన రిపబ్లికన్ పార్టీ మహిళల సమావేశం తర్వాత ఒక యువతిపై అత్యాచారం చేసిన ఆరోపణలు ఇపుడు తిరిగి ముందుకు వచ్చాయి. కాని తాను ఏ తప్పు చేయలేదని, ఏదైనా పరస్పర అంగీకారంతోనే జరిగిందన్నది హెగ్‌సెట్ వాదన. ఆ మహిళ మాత్రం, తనకు డబ్బిచ్చి నోరు మూయించారని ఆరోపిస్తున్నది. స్వయంగా ట్రంప్ ఇటువంటి ఆరోపణలు అనేకం ఎదుర్కోవటం తెలిసిందే.
భారతీయ మూలాలు గల తులసి గబ్బార్డ్‌ను ట్రంప్ నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్‌గా నామినేట్ చేయటం రెండవ వివాదం అయింది.

ఆమె ఉక్రెయిన్‌ను విమర్శించి రష్యాకు అనుకూలంగా మాట్లాడారని, సిరియా నియంత అస్సద్‌తో రహస్యంగా సమావేశమయ్యారని, అదిగాక తనకు ఇంటెలిజెన్స్ రంగంలో పనిచేసిన అనుభవమేలేదన్నవి విమర్శలు. వీటిపై తన నుంచి ఇంత వరకు ఎటువంటి స్పందనలులేవు. హోంల్యాండ్ సెక్యూరిటీ మంత్రిగా నామినేట్ అయిన మహిళ క్రిస్టీ నొయెమ్‌పై ఒక 14 నెలల కుక్కను, ఒక మేకను కాల్చి చంపిన కేసులున్నాయి. అది నిజమేనని ఒప్పుకున్న తను అందుకేవో కారణాలు చెప్పారు గాని వాటిని అమెరికన్ సమాజం ఆమోదించలేదు. వివాదాలకు గురైన మూడవ మహిళ లిండా మెక్ మాహన్. ఆమె విద్యశాఖకు నామినేట్ అయ్యారు. ఒక కుస్తీల సంస్థకు మాజీ సిఇఒ అయిన తన భర్త, తనూ కలిసి, తమ వద్ద పని చేసిన ఒక వ్యక్తి అక్కడే పని చేసిన మగ పిల్లల పై అత్యాచారాలు జరిపేందుకు అనుమతించారన్న కేసు ఒకటి ఇటీవలే నమోదైంది. అది నిజం కాదన్నది లిండా వాదన. కేసు మాత్రం ఇంకా నడుస్తున్నది.

అమెరికా రాజుకీయాలలో పేరు బడిన కెన్నెడీ సోదరులలో ఒకరైన రాబర్ట్ ఎఫ్. కెన్నెడీ జూనియర్‌ది ఇంకా చిత్రమైన పరిస్థితి. ఆయనను ట్రంప్ ఆరోగ్యం, మానవ సేవల మంత్రిగా నామినేట్ చేశారు. ఆయన ఒక దశలో స్వయంగా అధ్యక్ష పదవికి పోటీపడ్డారు. ఆయన తనంతట తానే కొన్ని విషయాలు చెప్పారు. ఒక క్రిమి తన మెదడులో ప్రవేశించి కొంత భాగాన్ని తినివేసి తర్వాత చచ్చిపోయిందని, ఆ పరిస్థితిలో తన మెదడు దెబ్బతిందన్నది ఒకటి. ఒక ఎలుగుబంటి పిల్ల చావు, ఇద్దరు మహిళలపై అత్యాచారాలన్నవి ఇతర కేసులు. కొన్నాళ్లు డ్రగ్స్ తీసుకుని తర్వాత కోలుకున్నట్లు కూడా ఆయన చెప్పారు. ఇటీవలే ఉక్రెయిన్‌కు వ్యతిరేకంగా మాట్లాడారు. అటార్నీ జనరల్‌గా నామినేట్ అయిన మాట్ గెట్జ్ అయితే, ఒక మైనర్ బాలికపై అత్యాచారం, డ్రగ్స్ ఉపయోగం కేసులపై విమర్శలు చెలరేగటంతో ఆ నామినేషన్ నుంచి తానే ఉపసంహరించుకున్నాడు.

ఈ విధంగా ఇప్పటికే ఆరు నామినేషన్లు వివాదాస్పదం కావటం, వారిలో ముగ్గురు మహిళలు కావటం, ఆరుగురిలో నలుగురిపై కేసులు అత్యాచార సంబంధమైనవి కావటమన్నది అసాధారణమైన స్థితి. అది చాలదన్నట్లు స్వయంగా ట్రంప్‌పైనే గల ఈ తరహా కేసులు, వాటిలో కొన్ని రుజువు కూడా కావటం తెలిసిందే. ఇటువంటి పరిస్థితులు అమెరికా రాజకీయ చరిత్రలోనే ఎన్నడూ లేనివి. ట్రంప్ మునుముందు ఇంకెవరిని నామినేట్ చేయగలరో, వారిలోనూ ఎవరైనా ఇదే విధమైన సమస్యలను ఎదుర్కొన గలరేమో చూడవలసి ఉంది. చివరగా, వీరిలో సెనేట్ ఎవరికి ఆమోద ముద్ర వేసి, ఎవరిని తిరస్కరించవచ్చునన్నది మరొక ప్రశ్న. ప్రస్తుతం సెనేట్‌లో ట్రంప్ రిపబ్లికన్ పార్టీకి ఆధిక్యత ఉన్న మాట నిజమే. అయితే అమెరికాలో స్వతంత్రంగా ఓటు వేసే సభ్యులు కూడా ఉంటారు. ఇండియాలో వలె విప్ పద్ధతి లేదు.

ఒకవేళ ఎవరి నామినేషన్ అయినా మద్దతు పొందకపోతే అధ్యక్షుడు మరొకరిని నామినేట్ చేస్తారు. ఈ నలుగురు వివాదాస్పదుల విషయంలో ఏమి జరగవచ్చునో చూడవలసి ఉంది. రెండవ తరహా వివాదాలు ఇంతకన్న తీవ్రమైనవి. మొదటివి అమెరికా అంతర్గత రాజకీయాలకు పరిమితమైనవి కాగా, ఇవి అంతర్జాతీయమైనవి. వాటిలో ఒకటి అమెరికాకు అత్యంత సన్నిహిత దేశమైన కెనడాకు సంబంధించినది. అమెరికా ఉత్తర సరిహద్దున గల కెనడా వేరే దేశంగా ఉండనక్కరలేదని, తమకు ఇప్పటికే గల 50 రాష్ట్రాలకు అదనంగా 51వ రాష్టంగా చేరటం మంచిదని ట్రంప్ గతంలోనూ అన్నపుడు అందరూ ఆ మాటను జోక్‌గా తీసుకున్నారు. కాని ఆయన అధ్యక్షునిగా ఎన్నకైనాక తిరిగి అనటం ఆశ్చర్యానికి, వ్యతిరేకతకు దాని తీసింది. తమతో వాణిజ్యంలో అగ్రస్థానంలో గల కెనడాపై సుంకాలు 25 శాతం పెంచగలమని, ఇప్పటికే ఆర్థిక సమస్యలలో గల ఆ దేశం తమలో విలీనం కావటం మంచిదని ట్రంప్ ఇపుడు గట్టిగా వాదిస్తున్నారు. అందుకోసం ఆర్థిక వత్తిడులు తేగలమని కూడా ప్రకటించారు. దానితో పాటు గ్రీన్‌లాండ్ తదితర అంశాలను కూడా ముందుకు తేవటంతో, అదంతా జోక్ కాదని అర్థమైన కెనడా ఇపుడు గట్టిగా వ్యతిరేకిస్తున్నది.

అమెరికా నుంచి వేల మైళ్ల దూరంలో గల గ్రీన్‌లాండ్, డెన్మార్క్‌లో భాగమైన స్వయం ప్రతిపత్తి గల దీవి. అది తమ రక్షణ కోసం అవసరమంటున్న ట్రంప్, దానిని కొనుగోలు చేయగలమంటున్నారు. దానితో కలవరపడిన డెన్మార్క్ అందుకు అంగీకరించబోమని స్పష్టం చేస్తూ, తమ సైన్యపు చిహ్నాలను ఆ విధంగా వేగంగా మార్చివేసింది. కాని ట్రంప్ ఆ వెంటనే తన కుమారుడిని స్వంత విమానంలో గ్రీన్ లాండ్‌కు పంపి ఏవో కార్యక్రమాలు జరిపించారు. అంతకన్న తీవ్రమైనదేమంటే, ఒక విలేఖరి ప్రశ్నకు సమాధానమిస్తూ, గ్రీన్‌లాండ్ విషయంలో అవసరమైతే బలప్రయోగం చేయబోమనే హామీ ఇవ్వలేమన్నారు. దీనిని డెన్మార్క్‌తో పాటు ఫ్రాన్స్, జర్మనీ వంటి ఇతర దేశాలు, యూరోపియన్ యూనియన్ కూడా తీవ్రంగా వ్యతిరేకించాయి.
పనామా కాలువ విషయానికి వస్తే, దాని యజమాని అయిన పనామా దేశం ఆ కాలువ ద్వారా ఓడల రవాణాపై (ఇతర దేశాలతోపాటు) తమ ఓడలపై భారీ సుంకాలు విధిస్తున్నందున తమపై భారం ఎక్కువైందని, అది గాక ఆ కాలువ చైనా సైన్యం నిర్వహణలో ఉందని ట్రంప్ కొద్ది రోజుల క్రితం వాదించటం మొదలుపెట్టారు.

కనుక ఆ కాలువను తమ స్వాధీనం చేయవలసిందేనంటున్నారు. దీనినంతా పనామా వెంటనే బలంగా తిరస్కరించింది. చైనా సైన్యం నిర్వహణ మాట నిజం కాదని అమెరికా పత్రికలే వెల్లడించాయి. అయినా ట్రంప్ తీరులో మార్పులేదు. మధ్య అమెరికాలోని మెక్సికోకు తూర్పున అట్లాంటిక్ సముద్ర తీరాన గల్ఫ్ ఆఫ్ మెక్సికో ఉంది. దానికి ఆ పేరు 1776లో అమెరికా సంయుక్త రాష్ట్రాల స్థాపనకు ముందు నుంచీ ఉందని అమెరికన్ చరిత్ర కారులే చెప్తున్నారు. అయినప్పటికీ ట్రంప్ ఆ పేరును గల్ఫ్ ఆఫ్ అమెరికాగా మార్చగలమని, అది తమ రక్షణకు అవసరమని అంటున్నారు. దీనితో మెక్సికోలోనే గాక మొత్తం మధ్య అమెరికాలో, లాటిన్ అమెరికాలో ఆగ్రహం వ్యక్తమవుతున్నది. పనామా కాల్వ కూడా ఈ ప్రాంతానిదే కావటం గమనించదగ్గది. ఇదంతా చివరకు ఏమికాగలదన్నది అట్లుంచి, ట్రంప్ అకస్మాత్తుగా ఈ వాదనలను లేవనెత్తి వాటిపై ఎందుకు పట్టుదల చూపుతున్నారన్నది ఇంకా స్పష్టంగా తెలియని విషయం.

అయితే, బలంగా వినవస్తున్నది అభిప్రాయాలు మూడున్నాయి. ఒకటి అమెరికాను ఆర్థికంగా మరింత బలోపేతం చేసేందుకు మిత్రదేశాల సహజ వనరులను స్వాధీనం చేసుకునేందుకు సైతం వెనుకాడకపోవటం. నిజానికి ఆ మాట ట్రంప్ స్వయంగా చెప్తున్నారు. రెండు ఆ దేశాలపై, భూభాగాలపై సైనిక నియంత్రణను పెంచటం. మూడు, వేగంగా వృద్ధి చెందుతున్నచైనాను, దాని మిత్ర దేశమైన రష్యాను, ఆర్థికంగా, సైనికంగా, పలుకుబడుల రీత్యా నియంత్రించగలగటం. ఈ వ్యూహం మాట నిజమైతే, అందుకు పై నాలుగు దేశాలు సహకరించగలవా? అందుకోసం నిజంగానే బలప్రయోగం చేస్తారా? చైనా, రష్యాలపై వివిధ నియంత్రణలు సాధ్యమా? అన్నవి వేచి చూడవలసిన విషయాలు.

టంకశాల అశోక్

దూరదృష్టి

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News