Friday, January 10, 2025

ఎంఎస్‌పి సాధనకు మరోమార్గం

- Advertisement -
- Advertisement -

పంటలకు చట్టబద్ధంగా కనీస మద్దతు ధరల సాధనకోసం రైతు సంఘాలు ఢిల్లీ హర్యానా సరిహద్దుల్లో రోజులు, సంవత్సరాలుగా రోడ్డెక్కి ఆందోళనలు సాగిస్తున్నా ప్రభుత్వ వర్గాలనుంచి స్పందన లేదు సరికదా పోలీస్ బలగాలతో రైతుల ఉద్యమాన్నిఅణగదొక్కుతున్నారు. రానురాను ఈ సమస్య జటిలమవుతోంది. నిరవధిక నిరాహార దీక్ష కొనసాగిస్తున్న రైతు నాయకుడు జగ్‌జిత్ సింగ్‌దల్లేవాల్ ఆరోగ్యం క్షీణిస్తుండడంతో చివరకు సుప్రీం కోర్టు జోక్యం చేసుకుని వైద్య చికిత్స అందించాలని అక్కడి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించవలసి వచ్చింది. దల్లేవాల్ చేపట్టిన నిరాహార దీక్ష మంగళవారం (జనవరి 7) నాటికి 43 రోజులు కావస్తోంది. ఈ పరిస్థితుల్లో ఎంఎస్‌పి కోసం కేంద్ర ప్రభుత్వ నిర్ణయం కోసం నిరీక్షించకుండా రాష్ట్రాల వారీగా సాధించుకోవచ్చని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు.

ప్రత్యామ్నాయంగా రైతులకు ప్రయోజనం కలిగించే చర్యలు చేపట్టవచ్చని ది డబ్లింగ్ ఫార్మర్స్ ఇంకమ్ (డిఎఫ్‌ఐ) కమిటీ సూచిస్తోంది. పంటల ఉత్పత్తి వ్యయం, ఇతర ఖర్చుల ఆధారంగా వ్యయసాయ మార్కెట్ యార్డు ( మండీ)ల్లోనే కనీస ధరకు పంటల వేలం రేటు నిర్ణయించవచ్చని సూచిస్తోంది. దీని వల్ల రైతులకు డిమాండ్, సరఫరా ఆధారంగా లాభం నిర్ణయమవుతుందని సూచించింది. రైతులు రెక్కలు ముక్కలు చేసుకుని పండించే పంటలను ప్రలోభాలతో అతి తక్కువ ధరకు కాజేసే దళారీల నిలువు దోపిడీ విధానాలను అరికట్టడానికి రాష్ట్ర ప్రభుత్వాలు అగ్రికల్చరల్ ప్రొడ్యూస్ మార్కెటింగ్ కమిటీ (ఎపిఎంసి) యార్డులను నిర్వహిస్తున్నాయి. ఈ యార్డులకు రైతులు తమ పంటలను తీసుకువచ్చి వేలం ద్వారా లాభదాయకమైన ధరలకు పంటలను అమ్ముకోవచ్చు. అయితే ఈ అగ్రికల్చరల్ ప్రొడ్యూస్ మార్కెటింగ్ కమిటీ (ఎపిఎంసి) యార్డుల్లో వ్యవసాయ ఉత్పత్తులపై వేలంలో పాల్గొనే పాటదారులు అంతా కుమ్మక్కు (రింగ్) కాకుండా జాగ్రత్తపడాలి. అలాగే పంటల ఉత్పత్తి వ్యయ ఆధారిత ధర కన్నా తక్కువ ధరకు వేలం పాడటానికి అవకాశం ఇవ్వకూడదు. అలా జరగాలంటే పంటకు గిట్టుబాటు ధరను కనీస రిజర్వు ధర (ఎంఆర్‌పి)గా చట్టపరంగా పరిగణించాలి.

ఈ విధమైన నిబంధన రాష్ట్ర ఎపిఎంసి చట్టాల్లో పొందుపరిచేలా సవరణలు చేయాలని డిఎఫ్‌ఐ కమిటీ మాజీ ఛైర్మన్ అశోక్ కె దల్వాల్ సూచించారు. ఇలా చేస్తే కమిషన్ ఏజెంట్లుగా వ్యవహరించే దళారుల ప్రలోభాలకు ఏ రైతు లొంగకుండా నిరోధించడానికి వీలవుతుంది. ఈ కమిషన్ ఏజెంట్లు రైతుల సమ్మతి లేకుండానే తమకు నచ్చిన ధరనే కనీస రిజర్వేషన్ ధరగా ప్రతిపాదిస్తుంటారు. పండించే అన్నదాతకు ధర నిర్ణయించుకునే హక్కులేకుండా ప్రలోభ పరుస్తుంటారు. సాధారణంగా ఈ మార్కెట్ యార్డుల్లో దళారులదే రాజ్యంగా సాగుతుంది. అలాంటి దోపిడీ విధానాలు సాగకుండా వేలం పాటలను నిబంధనల ప్రకారం నిర్వహించగలగాలి. అయితే ఓపెన్ మార్కెట్‌లో చట్టబద్ధమైన కనీస మద్దతు ధర అన్నది ఎక్కడా లభించదని, మొత్తం వ్యవసాయం అంతా ప్రభుత్వ నియంత్రణలోనే ఉండడమే దీనికి కారణమని నేషనల్ అకాడమీ ఆఫ్ అగ్రికల్చరల్ సైన్సెస్ (ఎన్‌ఎఎఎస్) ఉపాధ్యక్షుడు పికె జోషి వ్యాఖ్యానించారు. మొత్తం పంటలను సేకరించి, నిల్వచేసి, లాభదాయకమైన మద్దతు ధరకు అమ్మడం అన్నది ప్రభుత్వ నిర్వహణలో సాధ్యం కాదు. పక్కాగా మార్కెటింగ్ వ్యవస్థ నిర్వహించాలంటే దానికి తగిన వ్యవస్థల నిర్వహణకు ఎంతో వ్యయప్రయాసలు అవసరం.

ఈ విషయంలో ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్‌సిఐ) బియ్యం, గోధుమలను ఏ విధంగా సేకరిస్తోందో, ఎలా నిల్వచేసి విక్రయిస్తోందో ఉదాహరణగా చెప్పవచ్చు. బియ్యం, గోధుమల సేకరణ, నిల్వ, విక్రయాలకు ఎఫ్‌సిఐ చేసే వ్యయం, ప్రైవేట్ వ్యాపారులు చేసే ఖర్చు కన్నా ఎంతో ఎక్కువగా ఉంటోందని జోషి ఉదహరించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన మూడు వివాదాస్పద వ్యవసాయ చట్టాల పరిశీలనకు సుప్రీం కోర్టు నియమించిన నిపుణుల కమిటీలో జోషి సభ్యునిగా 2020 వరకు పనిచేశారు. జోషి పరిశీలన ప్రకారం కనీస మద్దతు ధర (ఎంఎస్‌పి)ను చట్టబద్ధం చేయడం అంటే ప్రైవేట్ వ్యాపారస్థుడ్ని పూర్తిగా కనుమరుగు చేయడమే అవుతుంది. అయితే ఈ మేరకు ప్రభుత్వం ఎఫ్‌సిఐ రీతిలో ప్రతి పంట సేకరణకు, నిల్వకు, విక్రయానికి కావలసిన మౌలిక సౌకర్యాలు కల్పించవలసిన అవసరం ఉంటుంది.

అలాగే దీనికి అనుసంధానంగా కొత్త వ్యవస్థలను ఏర్పాటు చేయక తప్పదు. ఇవన్నీ సమకూర్చాలంటే భారీ ఎత్తున పెట్టుబడులు చాలా వరకు భరించవలసి వస్తుంది. పంటలకు లాభదాయకమైన ధరలు రావాలంటే ధరల లోటును భర్తీ చేసే వ్యవస్థ తప్పని సరి. అంటే కనీస మద్దతు ధరకు మార్కెట్ రేటుకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని భర్తీ చేయడం. ధరల బీమా వ్యవస్థ, పంటకు గిట్టుబాటు ధర ముందుగా నిర్ణయించడం, అది వచ్చేవరకు గిడ్డంగిలో పంటకు భద్రత, నాణ్యత పరిరక్షణ వంటి గిడ్డంగి రశీదు పద్ధతి (వేర్‌హౌస్ రిసీప్ట్) ని అనుసరించడం వల్ల రైతులకు మేలే జరుగుతుంది. మిగులు ఉత్పత్తులను సమర్ధవంతంగా విక్రయించే వాణిజ్య విధానాన్ని ప్రభుత్వం నిర్వహించాల్సి ఉంటుంది. డిఎఫ్‌ఐ కమిటీ సిఫార్సు చేసిన పంటకు రిజర్వు ధర (ఎంఆర్‌పి) అనేది చాలా కష్టతరమైనది. ఒక జిల్లాలో ఎకరాకు వచ్చే దిగుబడి బట్టి పంటకు రిజర్వు ధర ఆధారపడి ఉంటుంది. అన్నిచోట్లా రిజర్వు ధర ఒకేలా ఉండదు. ఇందులో ఆయా ప్రాంతాల వ్యవసాయ పరిస్థితి బట్టి కూడా రిజర్వు ధర నిర్ణయమవుతుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News