రాష్ట్రంలో త్వరలో జరగబోయే మూడు శాసనమండలి (ఎమ్మెల్సీ) స్థానాలకు భారతీయ జనతా పార్టీ (బిజెపి) రాష్ట్ర నాయకత్వం అభ్యర్థులను ప్రకటించింది. మూడు ఎమ్మెల్సీ స్థానాల్లో రెండు ఉపాధ్యాయ, ఒక పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి అభ్యర్థుల వివరాలను బీజేపీ జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా ఆదేశాలతో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి శుక్రవారం ప్రకటించారు. నల్గొండ, -ఖమ్మం, -వరంగల్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ బీజేపీ అభ్యర్థిగా పులి సరోత్తమ్‌రెడ్డి, కరీంనగర్, -మెదక్-, ఆదిలాబాద్-, నిజామాబాద్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మల్కా కొమరయ్య,
కరీంనగర్-, మెదక్-, ఆదిలాబాద్-, నిజామాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా అంజిరెడ్డి పేర్లను ప్రకటించారు. ఇలా అభ్యర్థులను అన్ని పార్టీల కంటే ముందుగా బిజెపి ప్రకటించడంతో ఎన్నికల్లో తమ సత్తా చాటాలని ఆ పార్టీ అధిష్టానం దూకుడు పెంచింది. మరోవైపు 12 జిల్లాల నుంచి ఓటు హక్కు కోసం మొత్తం 28 వేల మందికి పైగా ఉపాధ్యాయులు, అధ్యాపకులు దరఖాస్తు చేసుకోగా, పరిశీలన అనంతరం మొత్తం 22,554 మంది ఓటర్లతో ముసాయిదా ఓటర్ల జాబితాను ఖరారు చేశారు.