Saturday, January 11, 2025

రూ.168 కోట్లతో నేతన్నలకు అభయహస్తం పథకం

- Advertisement -
- Advertisement -

రాష్ట్రంలోని చేనేత, మరమగ్గాల కార్మికుల సంక్షేమం, వారి సమగ్ర అభివృద్ధి కోసం రూ.168 కోట్లతో చేనేత అభయహస్త పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తుందని వ్యవసాయం, చేనేత జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. చేనేత కార్మికుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ పథకాన్ని ఆమోదించినందుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి మంత్రి తుమ్మల ధన్యవాదాలు తెలియజేశారు. రాష్ట్ర ప్రభుత్వ చిత్తశుద్దికి ఇదొక నిదర్శనమని ఆయన అన్నారు.
ఈ పథకం ద్వారా తెలంగాణ నేతన్న పొదుపు (పొదుపు నిధి), తెలంగాణ నేతన్న భద్రత (నేతన్న భీమా), తెలంగాణ నేతన్నకు భరోసాలు అమలు చేయడం జరుగుతుందని, నేతన్న పొదుపు కోసం బడ్జెట్ ద్వారా రూ.115 కోట్లు, నేతన్న భద్రత కోసం రూ. 9 కోట్లు, నేతన్న భరోసా పథకానికి రూ. 44 కోట్లు కేటాయింపులు జరిపినట్లు మంత్రి వివరించారు.

తెలంగాణ నేతన్న పొదుపు (పొదుపు నిధి) ద్వారా చేనేత కార్మికులు తమ వాటాగా 8 శాతం పొదుపు చేస్తే, రాష్ట్ర ప్రభుత్వం 16 శాతం వాటా జమ చేస్తుందని, దీని ద్వారా దాదాపు 38,000 మంది చేనేత కార్మికులు లబ్ధిపొందే అవకాశం ఉందన్నారు. అదే పవర్ లూమ్ కార్మికులైతే వారు 8 శాతం పొదుపు చేసినట్లయితే రాష్ట్ర ప్రభుత్వం 8 శాతం వాటా జమ చేస్తుందని, దీని ద్వారా దాదాపు 15వేల మంది పవర్ లూమ్ కార్మికులు లబ్ధి పొందే అవకాశం ఉందన్నారు.
తెలంగాణ నేతన్న భద్రత (నేతన్న భీమా) ద్వారా చేనేత, పవర్ లూమ్ కార్మికులు, అనుబంధ కార్మికులందరికీ జీవిత భీమా వర్తిస్తుందని, నమోదు చేసుకున్న కార్మికులు ఏ కారణంతోనైనా మరణిస్తే, మరణించిన కుటుంబం నామినీకి రూ.5 లక్షల భీమా లబ్ది చేకూరుతుందని తెలిపారు.

తెలంగాణ నేతన్నకు భరోసా ద్వారా చేనేత కార్మికులు తెలంగాణ మార్క్ లేబుల్‌ను ఉపయోగించి తయారుచేసిన తెలంగాణ వస్త్ర ఉత్పత్తులను ప్రోత్సహించేందుకు, వేతన మద్దతు అందించే విధంగా పని ఆధారంగా ఒక సంవత్సరానికి ఒక్కొక్క చేనేత కార్మికునికి రూ.18వేల వరకు, అనుబంధ కార్మికునికి రూ.6వేల వరకు మంజూరు చేయడం జరుగుతుందని మంత్రి వివరించారు.ప్రజాప్రభుత్వం ఏర్పడిన ఏడాది కాలంలోనే చేనేత రంగానికి రూ.874 కోట్లు విడుదల చేశామన్నారు. అందులో గత ప్రభుత్వం బకాయిగా ఉంచినవే రూ.465 కోట్లు ఉన్నాయని మంత్రి తుమ్మల గుర్తుచేశారు. అలాగే నేతన్నలకు నిరంతరం పనికల్పించాలనే ఉద్ధేశంతో అన్నీ ప్రభుత్వ శాఖలు, కార్పొరేషన్లు, సొసైటీలు తప్పని సరిగా తమకు కావలిసిన వస్త్రాలను టెస్కో ద్వారానే కొనుగోలు చేసేవిధంగా ప్రభుత్వం జీవో నెం.1 తేది: 11.03.2024 తీసుకువచ్చామన్నారు. ఇందిరా మహిళా శక్తి చీరల పథకం కూడా అమలుచేస్తున్నామని తెలిపారు.

అంతేకాకుండా చేనేత కార్మికుల కోసం రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో రూ.50 కోట్ల కార్పస్ ఫండ్‌తో నూలు డిపో ఏర్పాటు చేశామని, నేతన్నలకు చేయూత క్రింద చేనేత కార్మికులకు రూ.290.09 కోట్లు విడుదల చేసినట్లు మంత్రి వెల్లడించారు.రూ. 22.25 కోట్ల నిధులతో నేతన్న భీమా, పావలావడ్డీ పథకం కింద 60 చేనేత సహకార సంఘాలకు రూ.1.09 కోట్లు, మరమగ్గ కార్మికులకు 10శాతం నూలు సబ్సీడీ పథకం కింద 2018 నుంచి 2022 వరకు ఉన్న అన్ని బకాయిలు రూ 37.49 కోట్లు ఈ ఏడాదిలోనే విడుదల చేసిన విషయాన్ని మంత్రి తుమ్మల గుర్తుచేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News