ముంచుకొస్తున్న పంచాయతీ ఎన్నికలు
పట్టుసాధించేందుకు పార్టీల వ్యూహం
క్యాడర్‌లో ఉత్సాహం నింపేందుకు జిల్లాల
వారీగా పార్టీ అగ్రనేతల సమావేశాలు
గత ఫిబ్రవరితోనే ముగిసిన పంచాయతీ
పాలకవర్గాల పదవీకాలం
మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో గ్రామ పంచాయితీ ఎన్నికలు ఎప్పుడైనా ఉండవచ్చనే సం కేతాలు ఉండటంతో అధికార యంత్రాంగం ముం దస్తుగా అన్ని ఏర్పాట్లు సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఓటర్ల జాబితాను గ్రామాలు, వా ర్డుల వారీగా సిద్దం చేయగా, తాజాగా కొత్త పేర్ల ను వార్డుల వారీగా సేకరిస్తున్నారు. గత ఏడాది ఫి బ్రవరి 1వ తేదీతో పంచాయతీ పాలకవర్గాల పదవీకాలం ముగిసింది. ఆ తర్వాత సార్వత్రిక ఎన్నికలు రావడంతో పంచాయతీ ఎన్నికలు వాయిదా పడ్డాయి. పంచాయతీ పాలకవర్గం గడువు ముగిసి 11 నెలలు పూర్తయినా వివిధ కారణాల వల్ల ఇప్పటివరకు ఎన్నికలు జరుగలేదు. త్వరలో పంచాయితీ ఎన్నికలు నిర్వహించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఎప్పుడు ఎన్నికలు వచ్చినా సిద్దం గా ఉండేలా యంత్రాంగం ముందస్తు ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. ఒకపక్క అధికార యంత్రాంగం స్థానిక సమరానికి సన్నద్ధమవుతుండగా, మరోవైపు పార్టీలు సైతం వ్యూహాలను పదునుపెడుతున్నాయి.
ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్న పార్టీలు
రాబోయే పంచాయతీ ఎన్నికలకు గ్రామస్థాయి నుంచి పార్టీ శ్రేణులను సమాయత్తం చేసేందుకు ఆయా రాజకీయ పార్టీలు ప్రణాళికలు సిద్దం చేసుకుంటున్నారు. జిల్లాలవారీగా పార్టీ పరిస్థితులను సమీక్షించి అన్ని జిల్లాల్లో పూర్తి స్థాయి పట్టు సాధించేందుకు వ్యూహాలను సిద్దం చేసుకున్నాయి. పార్టీ కేడర్‌లో ఉత్సాహం నింపేందుకు జిల్లాలవారీగా ఆయా పార్టీల అగ్రనేతలు సమావేశాలు నిర్వహిస్తున్నారు. అందుబాటులోకి వచ్చిన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటూ నిత్యం కార్యకర్తలకు అందుబాటులో ఉండే విధంగా ఆయా పార్టీల నేతలు ప్రణాళికలు సిద్దం చేసుకుంటున్నారు. వీటితోపాటు ఎక్స్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్,వాట్సాప్ వంటి సోషల్ మీడియా ద్వారా పార్టీకి సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు చేరవేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఆయా పార్టీల వ్యవహారాలలో ఇప్పటివరకు కొనసాగుతున్న విధానాలను సమీక్షించుకుని అవసరమైన అంశాలలో కొన్ని మార్పులు చేయనున్నట్లు తెలిసింది. ప్రధానంగా మూసపద్దతికి స్వస్తి పలికి ఆధునిక విధానాలను అందుబాటులోకి తీసుకువచ్చే విషయంపై కసరత్తు చేస్తున్నట్లు సమాచారం.
ఆశావహులు స్థానికంగా అందుబాటులో ఉన్న కళాకారులు, పాటల రచయితలతో తమ పేర్లపై పాటలు రాయించుకుంటున్నారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన ప్రచార వ్యూహాలపై ఇప్పటి నుంచే సన్నద్ధమవుతున్నారు. ఇప్పటికే గాంధీ భవన్‌లో కాంగ్రెస్ ముఖ్యనేతలు, మంత్రులలో కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి కె.సి.వేణుగోపాల్ స్థానిక ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై దిశానిర్ధేశం చేశారు. మంత్రులు జిల్లాల వారీగా బాధ్యత తీసుకుని కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని చెప్పారు. అలాగే సిట్టింగ్ ఎంఎల్‌ఎలు ఉన్నచోట ఒక విధంగా, ప్రతిపక్ష ఎంఎల్‌ఎలు ఉన్నచోట మరో విధమైన వ్యూహాలు అనుసరించి సాధ్యమైనంత ఎక్కువ స్థానాలు గెలవాలని తెలిపారు. ఏడాది పాలనలో కాంగ్రెస్ అందించిన సంక్షేమ ఫలాలు ప్రజలకు వివరించాలని సూచించారు. అలాగే బిఆర్‌ఎస్ తమ పార్టీ శ్రేణులను స్థానిక సమరానికి సిద్ధం చేస్తున్నది. ఏడాది కాంగ్రెస్ పాలనలో కాంగ్రెస్ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి ఎక్కువ స్థానాలు గెలిచేందుకు బిఆర్‌ఎస్ అధిష్టానం వ్యూహాలు సిద్ధం చేసుకుంటుంది.
గ్రామాల్లో ఊరందుకోనున్న రాజకీయం
రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించడమే తరువాయి.. ఎన్నికల రంగంలోకి దూకేందుకు స్థానిక నాయకులు సిద్ధంగా ఉన్నారు. సర్పంచ్, ఎంపిటిసి ఎన్నికల్లో పోటీ చేయాలనే ఔత్సాహికులు తమ వ్యూహాలను సిద్ధం చేసుకుంటున్నారు. గ్రామాల్లో మళ్లీ రాజకీయం ఊపందుకోనుంది. ఒకవైపు ప్రజల్లో ఉంటూ, వారి సమస్యల పరిష్కారానికి నాయకులు, యువకులు చొరవ చూపుతున్నారు. గ్రామాలలో మహిళా సంఘాలు, స్వయం సహాయక బృందాలు, యువజన సంఘాలతో నిత్యం సమావేశమవుతున్నారు. గ్రామంలో ముఖ్య నాయకులు, పెద్దలను కలుస్తూ వారి ఆశీస్సులు పొందే ప్రయత్నం చేస్తున్నారు. పంచాయతీ, మండల, జిల్లా పరిషత్ ఎన్నికల్లో పోటీకి యువత ఉత్సహం చూపుతోంది. ముఖ్యంగా మొదట జరిగే సర్పంచ్ ఎన్నికలపై ఎక్కువ మంది ఆసక్తి చూపుతున్నారు. ఆయా పార్టీల్లోని నాయకులు, కార్యకర్తలు, ఏ పార్టీలో సభ్యత్వం లేని వారు కూడా ఆయా పార్టీల మద్దతు కూడగట్టి పోటీచేయాలనే ఆసక్తితో ఉన్నారు.