Saturday, January 11, 2025

క్షమాభిక్ష కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించిన శ్రద్ధానంద

- Advertisement -
- Advertisement -

భార్యను హత్య చేసిన కేసులో 30 ఏళ్లుగా కారాగారవాసం చేస్తున్నాడు స్వామి శ్రద్ధానంద. తాను రాష్ట్రపతికి 2023 డిసెంబర్‌లో పెట్టుకున్న క్షమాభిక్ష అభ్యర్థనపై సానుకూలంగా స్పందించాలని కోరుతూ ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆయన భార్య రాచరిక రాష్ట్రమైన మైసూర్ మాజీ దీవాన్ సర్ మీర్జా ఇస్మాయిల్ మనువరాలు షకెరెహ్. వారు 1986 ఏప్రిల్‌లో పెళ్లి చేసుకున్నారు. కానీ షకెరెహ్ 1991 మే నుంచి హఠాత్తుగా కనిపించకుండా పోయింది. బెంగళూరు సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ ఫిర్యాదుపై దర్యాప్తు మొదలెట్టారు. తర్వాత శ్రద్ధానంద తన భార్యను చంపింది తానేనని ఒప్పుకున్నాడు. దాంతో శ్రద్ధానందకు శిక్ష పడింది. 30 ఏళ్ల జైలు జీవితం గడిపిన అతడు ఒక్క రోజు కూడా పేరోల్ తీసుకోలేదు. శిక్షలో ఉపశమనం కూడా పొందలేదు. దీంతో అతడు క్షమాభిక్ష కోసం అభ్యర్థిస్తున్నాడు. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీని చంపినవారికి కూడా క్షమాభిక్ష లభించిందని ఆయన ఉదాహరిస్తున్నాడు.

వారిని 27 ఏళ్ల జైలు జీవితం తర్వాత వదిలిపెట్టారని పేర్కొంటున్నాడు. క్షమాభిక్ష ఇవ్వడానికి లేక శిక్షను తగ్గించడానికి ఆర్టికల్ 72 ప్రకారం రాష్ట్రపతికి, ఆర్టికల్ 161 ప్రకారం గవర్నర్‌కు మాత్రమే ఆ హక్కు ఉందని రాజ్యాంగ ధర్మాసనం తన ఉత్తర్వులో పేర్కొంది. శ్రద్ధానంద 2023 డిసెంబర్‌లోనే రాష్ట్రపతికి క్షమాభిక్ష అభ్యర్థనను పెట్టుకున్నాడు. అయితే అది ఇంకా పరిశీలనలోనే ఉంది. 2005లో విచారణ కోర్టు శ్రద్ధానందను దోషిగా తేల్చి అతడికి మరణశిక్ష విధించింది. తర్వాత కర్నాటక హైకోర్టు సైతం అతడి మరణ శిక్షను అదే సంవత్సరం ధ్రువీకరించింది. హైకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా అతడు అప్పీల్ చేసుకున్నాడు. ఇద్దరు న్యామూర్తులు సుప్రీంకోర్టు ధర్మాసనం అతడి నేరారోపణను సమర్థించడమేకాక, శిక్షను వాయిదా వేసింది. అయితే విశేషం ఏమిటంటే వారిలో ఓ జడ్జీ జీవితాంతం అతడిని జైలు నుంచి విడుదల చేయకూడదని అనగా, మరో న్యాయమూర్తి అతడికి మరణం తప్ప మరొకటి ఇవ్వకూడదు అని అభిప్రాయపడ్డారు.

ఈ తీర్పుపై అప్పీల్ 2008 జులై 22న ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం ముందుకు వచ్చింది. న్యాయమూర్తులు బి.ఆర్.గవాయ్, ఆగస్టీన్ జార్జ్ మసిహ్ శుక్రవారం పిటిషన్‌పై విచారణ చేపట్టారు. 84 ఏళ్ల శ్రద్ధానంద ఉరఫ్ మురళీ మనోహర్ మిశ్రా తరఫు న్యాయవాది వరుణ్ ఠాకుర్‌తో వారు వినతి కాపీని కేంద్రం న్యాయవాదికి ఇవ్వమని తెలిపారు. ఇంకా వచ్చే వారం మళ్లీ విచారణ చేపడతామని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News