Saturday, January 11, 2025

విసిల ఎంపికలో రాష్ట్రాల పాత్ర శూన్యం

- Advertisement -
- Advertisement -

1956లో పార్లమెంటులో ఆమోదించిన చట్టం ద్వారా ఇది చట్టబద్ధతను సంతరించుకున్నది. అప్పట్లో యుజిసి కేవలం నిధుల పంపిణీ, విశ్వవిద్యాలయాల పనిని వాటి మెరుగుదలను సమన్వయం చేసే కార్యక్రమాలను నిర్వహించేది. అయితే 2014లో బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్‌ను తమ భావాలకు అనుగుణంగా మలుచుకోవాలని చాలా ప్రయత్నాలు చేశారు. అందుకు అనుగుణంగా 2018లో 1956 చట్టానికి సవరణలు చేయడాని కి చేసిన ప్రయత్నం తీవ్ర ప్రతిఘటనల ద్వారా విరమించుకున్నది. అయితే ఆ చట్టం ముసాయి దాలోని అంశాలను నిబంధనల రూపంలో అమలు చేయాలని చూస్తున్నారు. భారతదేశ రాజ్యాంగం అమలులోకి వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఇటు రాజ్యాంగ వ్యతిరేక నిర్ణయాలు చేయడం ప్రజలను అవమానించడం తప్ప మరొకటి కాదు.

‘విద్యకు సంబంధించిన అంశం రాష్ట్రాల పరిధిలోకి రావాలి. కేంద్రానికి సమన్వయం చేసే అధికారం ఎప్పటికీ ఉంటుంది. కాని కేంద్రం మొత్తం తన చేతుల్లోకి తీసకుంటే రాష్ట్రాల చొరవ దెబ్బ తింటుంది. అయితే సాంకేతిక, వృత్తిపరమైన, విజ్ఞాన సంబంధిమైన సంస్థలు, విద్యాలయాలు కేంద్ర పరిధిలో ఉంటాయి. అంతకు మించి ఆలోచించడం సరికాదు” అంటూ రాజ్యాంగ సభ సభ్యులు కృష్ణమాచారి రాజ్యాంగ సభలో స్పష్టం చేశారు. విద్యకు సంబంధించిన అంశం కేంద్రం లేదా ఉమ్మడి జాబితాల్లోకి తీసుకోవాలని కొందరు సభ్యులు చేసిన సూచనలను ఆయన వ్యతిరేకించారు. ఆయన ప్రతిపాదించినట్టుగానే విద్య రాష్ట్ర జాబితాలోకి వచ్చింది. కృష్ణమాచారి రాజ్యాంగ రచనా సంఘం సభ్యులు కూడా.

అందుకే రచనా సంఘం తరపున ఆయన తన వాదనను వినిపించారు. అయితే 1970లో జరిగిన 42వ రాజ్యాంగ సవరణ ప్రకారం విద్య ఉమ్మడి జాబితాలోకి వెళ్లింది. అయినప్పటికీ అది కేంద్రం మొత్తం గుత్తాధిపత్యం కిందికి వెళ్లలేదు. అప్పటి నుంచి కూడా రాష్ట్రాల పరిధిలో నడుస్తున్న విశ్వవిద్యాలయాలు రాష్ట్ర ప్రభుత్వ పాలనలోనే ఉండేవి. కేంద్రం తమ బడ్జెట్‌లో, పార్లమెంటు చట్టం ద్వారా ఏర్పడిన విశ్వవిద్యాలయాలు మాత్రం కేంద్రం పరిపాలనలో ఉండేవి. అయితే ఇటీవల కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా దేశంలోని విశ్వవిద్యాలయాన్నింటినీ తన ఆధీనంలోకి తెచ్చుకోవాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నది. గత మూడు రోజుల క్రితం యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్ (యుజిసి) జారీ చేసిన చర్చా పత్రం ఎన్నో విమర్శలకు దారి తీస్తున్నది. ఇప్పటికే రకరకాలుగా యుజిసి ద్వారా కేంద్రం తన ఆధిపత్యాన్ని ప్రదర్శించడానికి పూనుకుంటున్నది. ప్రస్తుతం చర్చ కోసం విడుదల చేసిన పత్రంలో చాలా విషయాలున్నప్పటికీ, విశ్వవిద్యాలయాల వైస్ ఛాన్సలర్ల నియామకం చాలా విమర్శలకు తావిస్తున్నది.

నూతనంగా రూపొందించిన నిబంధనల ప్రకారం రాష్ట్ర గవర్నర్ ముగ్గురు సభ్యుల పానెల్‌ను నియమిస్తారు. ఇందులో ఛాన్సలర్‌గా గవర్నర్ నామినెట్ చేసిన వ్యక్తి, పానెల్ ఛైర్మన్, రెండవ వ్యక్తి యుజిసి నామినెట్ చేసిన ప్రతినిధి, మూడవ వ్యక్తి విశ్వవిద్యాలయం నుంచి ఒకరు ఉంటారు. ఇందులో గవర్నర్ నామినెట్ చేసిన వ్యక్తి ఛైర్మన్‌గా ఉంటారు. దీనిలో రాష్ట్ర ప్రభుత్వ పాత్ర లేదు. గతంలో రాష్ట్ర ప్రభుత్వమే సెర్చ్ కమిటీలను వేసేది. ఆ కమిటీ ముగ్గురు ప్రాధాన్యత కలిగిన సభ్యుల జాబితాను ఛాన్సలర్ అయిన గవర్నర్‌కు పంపితే అందులో ఒకరిని వైస్ ఛాన్సలర్‌గా నియమించేవాళ్లు. అయితే ఇది రాష్ట్ర ప్రభుత్వం మాత్రమే నిర్ణయించేది. గవర్నర్ పాత్ర కేవలం నామమాత్రమే.ఆ రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోనే రాష్ట్ర విశ్వవిద్యాలయాల వైస్ ఛాన్సలర్ల ఎంపిక జరిగేది. అయితే ఈ కొత్త నిబంధనల ప్రకారం ఇక ఎంత మాత్రం రాష్ట్రాలకు అటువంటి అధికారం ఉండదు. అంటే ఉన్నత విద్యలో రాష్ట్రాల పాత్ర శూన్యం కానున్నది. ఇది రాజ్యాంగ స్ఫూర్తికి పూర్తిగా భిన్నమైనది.

అదే విధంగా విశ్వవిద్యాలయాల వైస్ ఛాన్సలర్లను గతంలో లాగా విశ్వవిద్యాలయాలలో నిర్ణీతమైన కాలం బోధనలో ఉండి ప్రొఫెసర్ స్థాయికి ఎదిగిన వాళ్లను ఏరి ఎంపిక చేసే సాంప్రదాయం ఉండేది. కాని ఇప్పుడు దానిని సడలించి విశ్వవిద్యాలయాలకు బయట ఉన్న వ్యక్తులు, పారిశ్రామిక వేత్తలు, ఇతర సామాజిక రంగంలో ఉన్న వాళ్లను నియమించే అవకాశం కూడా ఈ కొత్త నిబంధనల్లో చేర్చారు. ఇది మరింత శోచనీయం. దీని ద్వారా ఎవరైతే అధికారంలో ఉంటారో వారి మనుషులను విద్యకు సంబంధం లేని వారిని వైస్ ఛాన్సలర్లుగా నియమించుకునే విస్తృత అధికారాలు ఈ నిబంధనలు అందిస్తాయి. ఇందులో రెండు అంశాలున్నాయి. ఇక ఇప్పటి బిజెపి ప్రభుత్వం తమ భావజాలంతో ఉన్నవాళ్లను నింపాలనుకోవడం మొదటిది. నాకు తెలిసి అర్హులైన ప్రొఫెసర్లు, వాళ్ల భావాలతో ఉన్న వాళ్లు దొరికే అవకాశం కనిపిస్తున్నట్టు లేదు. అందువల్ల అనర్హులను నియమించాలనుకుంటున్నది. ఇది విశ్వవిద్యాలయాల స్థాయిని అధోఃపాతాళానికి దిగజారుస్తుందనడంలో సందేహం లేదు. రెండోది పారిశ్రామిక వేత్తలను నియమించడం వల్ల క్రమంగా ప్రభుత్వ ఆధీనంలో నడుస్తున్న విశ్వవిద్యాలయాలను ప్రైవేటు వ్యక్తులకు, సంస్థలకు ఉచితంగా అందజేసే కుట్ర కనిపిస్తున్నది. ఒకవైపు తమ భావజాల ఎజెండాను విశ్వవిద్యాలయాల్లోకి సంపూర్ణంగా, అధికారికంగా ప్రవేశపెట్టడంతోపాటు ధనికులకు, వ్యాపారస్థులకు విశ్వవిద్యాలయాలను ధారాదత్తం చేయడం జరిగే అవకాశం ఉంది. ఇది సందర్భం కాకపోయినా ఇక్కడ బాబా సాహెబ్ అంబేద్కర్ ప్రస్తావించిన ఒక అంశాన్ని చెప్పాలని ఉంది. “భారత దేశ ప్రజలకు పెట్టుబడిదారీ విధానం, బ్రాహ్మణిజం రెండు ఉమ్మడి శత్రువులు” అన్న మాటలను బిజెపి ప్రభుత్వం నిజమే అని నిరూపిస్తున్నది.

వీటితోపాటు అసిస్టెంట్ ప్రొఫెసర్ నియామకంలో కూడా గతంలో ఉన్న నిబంధనలను సడలించింది. గతంలో ఉన్నత విద్యతో పాటు నీట్ నుంచి పరీక్ష పాసైన వాళ్లకు, పిహెచ్‌డి చేసిన వాళ్లకు విశ్వవిద్యాలయాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా ప్రవేశం ఉంటే ఇప్పుడు ఆ నిబంధనలను సడలించింది. ఇది కూడా తమ మనుషులను విశ్వవిద్యాలయాల్లో నింపుకునే ప్రయత్నమేననే విమర్శ బలంగా ఉన్నది.

విద్యా వ్యవస్థను ఇప్పటికే గత పదేళ్ల బిజెపి ప్రభుత్వం తన భావజాలంతో ప్రయత్నాలు ఎన్నో చేసింది. కేవలం విశ్వవిద్యాలయాలే కాదు, పరిశోధన, అధ్యయన సంస్థల్లో తమ మనుషులతో నింపివేసింది. ఇటీవల యుజిసి ఛైర్‌పర్సన్‌గా నియమించిన వ్యక్తికి, బిజెపి భావజాలంతో ఉన్న సంబంధాలు జగద్వితమే. అందువల్లనే యుజిసి ఇటువంటి రాజ్యాంగ విరుద్ధమైన నిబంధనలను రూపొందించి, గందరగోళం సృష్టిస్తున్నది.

గతంలో కూడా యుజిసి ఎస్‌సి, ఎస్‌టి, బిసిల రిజర్వేషన్లకు వ్యతిరేకంగా రూపొందించిన సర్కులర్ తీవ్ర ప్రతిఘటన తర్వాత వెనక్కు తీసుకున్నది. ప్రభుత్వమే దాని మీద జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్ (యుజిసి) ఏర్పాటు, దాని పని విధానానికి మించి తన కార్యక్రమాలను విస్తరిస్తున్నది. యూనివర్శిటీ గ్రాంట్స్ కమిటి 1945లో అప్పటి జాతీయ స్థాయి విశ్వవిద్యాలయాలైన అలీఘడ్, బనారస్, ఢిల్లీ విశ్వవిద్యాలయాల పని తీరును సమన్వయం చేసి, నిధులను సమకూర్చి ఏర్పాటైంది. 1947లో ఇది మిగతా జాతీయ స్థాయి విశ్వవిద్యాలయాలకు విస్తరించాయి. ఇది బ్రిటిష్‌లోని యుజిసి తరహాలో రూపొందించారు. అయితే 1953లో అప్పటి విద్యాశాఖ మంత్రి మౌలానా అబ్దుల్ కలామ్ అజాద్ ప్రారంభించారు. 1956లో పార్లమెంటులో ఆమోదించిన చట్టం ద్వారా ఇది చట్టబద్ధతను సంతరించుకున్నది.

అప్పట్లో యుజిసి కేవలం నిధుల పంపిణీ, విశ్వవిద్యాలయాల పనిని వాటి మెరుగుదలను సమన్వయం చేసే కార్యక్రమాలను నిర్వహించేది. అయితే 2014లో బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్‌ను తమ భావాలకు అనుగుణంగా మలుచుకోవాలని చాలా ప్రయత్నాలు చేశారు. అందుకు అనుగుణంగా 2018లో 1956 చట్టానికి సవరణలు చేయడానికి చేసిన ప్రయత్నం తీవ్ర ప్రతిఘటనల ద్వారా విరమించుకున్నది. అయితే ఆ చట్టం ముసాయిదాలోని అంశాలను నిబంధనల రూపంలో అమలు చేయాలని చూస్తున్నారు. భారతదేశ రాజ్యాంగం అమలులోకి వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఇటు రాజ్యాంగ వ్యతిరేక నిర్ణయాలు చేయడం ప్రజలను అవమానించడం తప్ప మరొకటి కాదు. ఇటువంటి అప్రజాస్వామిక నిర్ణయాలను మొదట్లోనే ప్రతిఘటించి, ప్రభుత్వం ప్రత్యేకించి యుజిసి తన నిబంధనలను వెనక్కు తీసుకునే విధంగా అన్ని ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు కార్యాచరణను రూపొందించుకోవాలి.

మల్లేపల్లి లక్ష్మయ్య

దర్పణం

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News