సమాచార హక్కు చట్టం అమలులోకి వచ్చి రెండు దశాబ్దాలు కావస్తున్నా ప్రభుత్వం కానీ, సంబంధిత వర్గాలు కానీ చట్టంలోని పారదర్శకత, సాధికారత విషయంలో ప్రతికూలంగా ఉంటున్నాయి. ప్రభుత్వ రికార్డుల్లోని ప్రజాసంబంధ కార్యకలాపాల సమాచారం తెలుసుకోడానికి ఈ చట్టం కింద ప్రయత్నించే పౌరులకు సరైన న్యాయం దక్కడం లేదు. ఈ చట్టం దేశంలో మొట్టమొదటిసారి ప్రశ్నించే హక్కును సామాన్యుడి చేతికి ఒక ఆయుధంగా అందించిన సంగతి తెలిసిందే. కానీ ప్రభుత్వ వర్గాలు తమ వద్ద ఉన్న సమాచారాన్ని బయటపెట్టడానికి ఒప్పుకోవడం లేదు. సమాచారం కోరుతున్నందుకు గల కారణాలను పౌరుడు వెల్లడించాల్సిన అవసరం లేదని చట్టం స్పష్టంగా చెబుతోంది. కానీ ఆ నిబంధనను పక్కనపెట్టి సమాచారం ఎందుకు కావాలో కారణం చెప్పాలని సమాచార కమిషనర్లు అడుగుతుండడం విడ్డూరం.
అనేక కేసుల్లో వ్యక్తిగత గోప్యత పేరుతో అధికారులు, సమాచార కమిషనర్లు పౌరుడికి సమాచారం అందకుండా నిరోధిస్తున్నారు. ఈ ధోరణి 19(1)(ఎ) అధికరణం కింద పౌరులకు సంక్రమించిన మౌలిక హక్కులకు విఘాతం కలిగిస్తుంది. దరఖాస్తుదారు కోరిన సమాచారాన్నిసరైన కారణం చూపకుండా 30 రోజుల్లోగా అందించని అధికారి వ్యక్తిగతంగా జరిమానా చెల్లించాలని చట్టం చెబుతోంది. ఒక ప్రభుత్వ విభాగం నుంచి కోరిన సమాచారం అందకుంటే అదే విభాగానికి చెందిన ఉన్నతాధికారికి అప్పీలు చేసుకునే వెసులుబాటు ఉంది. అప్పిల్లేట్ అధికారీ సంతృప్తికరమైన సమాచారం ఇవ్వలేనప్పుడు రెండో అప్పీలు చేసుకునేందుకు సమాచార కమిషన్లు ఉన్నాయి. తమ ఆదేశాలు అమలయ్యేందుకు వీలుగా సమాచార కమిషన్‌కు తగినన్ని అధికారాలను ఈ చట్టం దఖలు పర్చింది. కానీ ఈ చట్టం సమర్థతను నీరుకార్చేలా చట్టంలో అనేక సవరణలు తీసుకు వస్తున్నారు. అడిగిన సమాచారం అందించడంలో అనవసరమైన ఆలస్యం, నిరాకరణ ఇవన్నీ చట్టం హక్కును దిక్కులేనివిగా తయారు చేస్తున్నాయి.
ఈ చట్టం పరిధిలోని కేంద్ర సమాచార కమిషనర్లను ప్రధాన మంత్రి, లోక్‌సభలో ప్రతిపక్ష నేతతో పాటు మరో మంత్రితో కూడిన కమిటీ ఎంపిక చేస్తుంది. అలాగే రాష్ట్రాల పరిధిలో ముఖ్యమంత్రి, శాసనసభలో ప్రతిపక్షనేత, మరో మంత్రి రాష్ట్రస్థాయిలో కమిషనర్లను ఎంపిక చేస్తారు. అయితే కేంద్ర, రాష్ట్ర సమాచార కమిషనర్ల పనితీరును కుంటుపర్చడం ద్వారా చట్టాన్ని తుంగలో తొక్కే పరిస్థితి ఏర్పడింది. ఇది సుప్రీం కోర్టు దృష్టికి వచ్చి ప్రభుత్వ వర్గాలను నిలదీసింది. కేంద్రంలోను, కొన్ని రాష్ట్రాల్లోను సమాచార కమిషనర్ల పదవులకు సంబంధించి భారీ సంఖ్యలో ఖాళీలు ఉండడాన్ని ఆక్షేపించింది. ప్రజలు కోరిన అధికారిక సమాచారాన్ని ఇవ్వడం లేదని, అలాగే విపరీత ఆలస్యం చేస్తున్నారని ఆయా సంస్థల, విభాగాల అధికారులు దీనిపై స్పందించడం లేదని అనేక ఫిర్యాదులు సుప్రీం కోర్టు దృష్టికి వెళ్లాయి. దీనిపై విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు ధర్మాసనం కేంద్ర సమాచార కమిషన్ (సిఐసి)లో 8 కమిషనర్ల ఉద్యోగాలు ఖాళీగా ఉండడంతో 23,000 అప్పీళ్లు పెండింగ్‌లో ఉన్నాయని గుర్తించింది.
అదే తీరులో కొన్ని రాష్ట్రాల సమాచార కమిషనర్ల ఉద్యోగాలు కూడా భర్తీ కావడం లేదని గమనించింది. దీనికి తోడు దేశంలో పలువురు సమాచార కమిషనర్లు వారానికి కనీసం 40 గంటలైనా పనిచేయడం లేదు. వాస్తవానికి ఒక్కొక్క కమిషనర్ నెలకు 400 నుంచి 500 వరకు కేసులు పరిష్కరించవలసి ఉంది. కానీ కమిషనర్లలో ఎక్కువ మంది నెలకు 50 నుంచి 100 కేసులు మాత్రమే పరిష్కరిస్తున్నారని ఫిర్యాదులు వస్తున్నాయి. సాధారణంగా హైకోర్టుల్లో అధికభాగం నెలకు 200 వరకు కేసులు విచారిస్తుంటారు. అదే విధంగా నెలకు కనీసం 200 కేసులైనా పరిష్కరించుకోవాలన్న లక్షంతో సమాచార కమిషనర్లు బాధ్యతలు నిర్వర్తించాల్సిన అవసరం ఉంది. చట్టప్రకారం బాధ్యతలు నిర్వహించాల్సిన ఉద్యోగులు నియామకం కాకపోయినా, ఉన్నవారు కూడా సరిగ్గా పనిచేయకున్నా ఈ వ్యవస్థ ఎలా పనిచేస్తుందని సుప్రీం కోర్టు ప్రభుత్వవర్గాలను ప్రశ్నించింది. ఈ పరిస్థితిలో ఆయా ఉద్యోగుల ఎంపిక ప్రక్రియ పైన, ఎనిమిది మంది కేంద్ర సమాచార కమిషనర్ల నియామకానికి సంబంధించి అత్యవసరంగా చర్యలు తీసుకోవాలని, ఈ మేరకు నోటిఫై చేయాలని డిపార్టుమెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రయినింగ్ విభాగాన్ని సుప్రీం కోర్టు ధర్మాసనం ఆదేశించింది. సెర్చ్ కమిటీ పనితీరు, ఆయా ఉద్యోగాల కోసం వచ్చిన దరఖాస్తుల వివరాలు సమర్పించాలని కోర్టు కోరింది. ఇదే విధంగా రాష్ట్రాలు కూడా ఈ ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించింది.
అయితే సమాచార చట్టం అసలు ప్రయోజనం సిద్ధించాలంటే ఇది సరిపోదు. ఖాళీలను భర్తీ చేసి చేతులు దులుపుకోకూడదు. ఈ చట్టానికి సంబంధించి కమిషనర్ల ఉద్యోగాల ఖాళీల భర్తీకి ఎలాంటి ప్రమాణాలు ఏ విధంగా పాటించాలో 2019లో సుప్రీం కోర్టు తన తీర్పులో వివరించింది. సకాలంలో ఉద్యోగాల భర్తీకి ముందుగానే పత్రికల్లో ప్రకటనలు ఇవ్వాలని సూచించింది. కేంద్ర సమాచార కమిషనర్ పదవికి నిర్ణయించిన ఐదేళ్ల వ్యవధిని ప్రభుత్వం కొన్నేళ్ల క్రితం తొలగించడంతో దాని స్వయం ప్రతిపత్తి కోల్పోవడమైంది. ప్రభుత్వ కనుసన్నల్లో ఉండేవారినే ఈ పదవిలో నియమించడం పరిపాటిగా వస్తోంది.రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగులను నియమిస్తుండటాన్ని సుప్రీం కోర్టు గమనించింది. సర్వీసులో ఉండగా ప్రభుత్వ వర్గాలకు అనుకూలంగా వ్యవహరించిన ఉన్నతోద్యోగులు, రాజకీయ నాయకులకు పునరావాస కేంద్రాలుగా సమాచార కమిషన్లు దిగజారిపోయాయన్న ఆరోపణలూ ఉంటున్నాయి. సమాచార కమిషనర్ల ఉద్యోగాలు భారీ ఎత్తున ఖాళీగా ఉంటే సమాచారం పొందాలనుకున్న పౌరులకు ఈ చట్టం అమలుపై ఆసక్తి కోల్పోయే ప్రమాదం ఉంది.