మన దేశం కాదు, మన ఊరు కాదు, మన భాష కూడా తెలియదు. ఆయనకు తెలిసిందల్లా ఆదివాసీలకు అభివృద్ధిని పరిచయం చేయడం, ప్రభుత్వ సంక్షేమ పథకాలు గిరిజనులదరికి చేరవేసేలా ఆదివాసీ గూడాలలో చెరగని ముద్ర, శాశ్వత స్థానం పదిలపరుచుకున్న ఆదివాసీల ఆత్మబంధువు, మానవ పరిణామ శాస్త్రవేత్త, దివంగత ప్రొఫెసర్ క్రిస్టఫర్ వాన్ ప్యూరర్ హైమెన్డార్ఫ్ ఆస్ట్రియా దేశం వియన్నా నగరంలో 199 సంవత్సరంలో జన్మించాడు. లండన్ విశ్వవిద్యాలయం నుంచి మానవ పరిణామ శాస్త్రంలో డాక్టరేట్ పొందారు 1936లో ఉద్యోగరీత్యా భారత్‌కు వచ్చి నిజాం కాలేజీలో ప్రొఫెసర్‌గా పని చేశాడు. 1928 నుండి 1940 వరకు బ్రిటిష్ పాలనలో కెరమెరి మండలం జోడేఘాట్ అటవీ ప్రాంతంలో కుమురం భీం ఆధ్వర్యంలో జల్, జంగిల్, జమీన్ నినాదంతో నిజాం సైనికులకు గోండులకు మధ్య తీవ్ర పోరాటం జరిగింది.
నిజాం సైన్యాన్ని ముప్పుతిప్పలు పెట్టిన భీమ్ ఆశ్వయుజ శుద్ధ పౌర్ణమినాడు ద్రోహి ఇచ్చిన సమాచారంతో జోడేఘాట్ గుట్టల్లో ఈ యుద్ధ వీరుడు అసువులు బాశారు. ఈ నేపథ్యంలో ఆదివాసీల తిరుగుబాటుకు గల కారణాలను, మూలాలను వెతకాలని పరిశోధించడానికి నిజాం ప్రభుత్వం ప్రొఫెసర్ హైమెన్డార్ఫ్ను ఆదిలాబాద్‌కు పంపింది. అలా 1940 సంవత్సరంలో ఆయన తన సతీమణి బెట్టి ఎలిజబెత్‌ను వెంటబెట్టుకొని వచ్చి ఆదివాసీల జీవితాలపై అధ్యయనం చేయడానికి జైనూర్ మండలం మార్లవాయి గ్రామంలో అడుగుపెట్టాడు. వారి రాక గిరిజనుల తలరాతలు మార్చింది. అక్కడ చుట్టూ కొండల మధ్య జీవనం సాగిస్తున్న లచ్చు పటేల్ వీరికి ఆవాసం కల్పించడం జరిగింది. ఇతడు ఆదివాసీల జీవితాలను పరిశోధించడమే కాకుండా వారి సమస్యలను తెలుసుకొని వాటి పరిష్కారానికి ప్రభుత్వానికి నివేదికలు పంపారు. ఆదివాసీల అభివృద్ధికి సూచనలు చేయడమే కాకుండా పలు ప్రామాణిక గ్రంథాలు రాశారు. ది గోండ్స్ ఆఫ్ ఆదిలాబాద్ అనే గ్రంథంలో ఆదివాసీల జీవన విధానం, సంస్కృతి, సాంప్రదాయాలను పొందుపరిచారు.
శక్తివంచన లేకుండా పరిశోధన చేసి ఆదివాసీలకు జల్, జంగిల్, జమీన్‌పై పూర్తి అధికారాలు ఉండాలని గ్రంథంలో సూచించారు. హైమెన్డార్ఫ్ నిజాం సర్కారుకు ఆదివాసీల జీవన విధానం ఉద్యమాలను నిజాం సర్కారుకు నివేదించడంతో ఆదివాసీలకు సర్వహక్కులు కల్పించారు. ఆదివాసీలతో మమేకమైన మూలంగా గిరిజనుల్లో శాశ్వతంగా ఉండిపోయారు. ఆదివాసీల గుండెల్లో చెరగని ముద్ర వేయించుకున్నారు. ఆదివాసీలతో ఏర్పడిన అనుబంధానికి ప్రత్యేకగా డార్ఫ్ దంపతులు తమ కుమారుడికి లచ్చు పటేల్ అని గిరిజనుడి పేరు పెట్టుకున్నారు. కొంత కాలానికి 1990లో బెట్టి ఎలిజబెత్ కన్నుమూయడంతో ఆమె కోరిక మేరకు మార్లవాయి గ్రామంలో గోండు సాంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు జరిపించారు. 1995లో ఇంగ్లాండులో మృతి చెందిన హైమెన్డార్ఫ్కు కూడా మార్లవాయిలోనే ఎలిజిబెత్ సమాధి పక్కన ఇతని సమాధి కట్టారు. వారి విగ్రహాలను కూడా గ్రామంలో ఏర్పాటు చేశారు. అయితే డార్ఫ్ మరణం తర్వాత 17 సంవత్సరాలకు అంటే 2012 ఫిబ్రవరి 27న అతని కుమారుడు లచ్చు పటేల్ అలియాస్ నికోలస్ తండ్రి అస్థికలను మార్లవాయికి తీసుకువచ్చి తల్లి సమాధి పక్కన ఉన్న తండ్రి సమాధిలో ఐక్యం చేశాడు. ప్రతి సంవత్సరం ఇక్కడి ఆదివాసులు హైమెన్డార్ఫ్ వర్ధంతిని ప్రతి ఏట జనవరి 11న గోండు సాంప్రదాయం ప్రకారం నిర్వహించి గిరిజనుల అభివృద్ధి కోసం వారు అందించిన సేవలను సహకారాన్ని స్మరించుకుంటారు. ప్రతి ఏటా పుష్యమాసంలో నిర్వహించే కేస్లాపూర్ నాగోబా జాతరలో గిరిజన దర్బార్ ఏర్పాటు చేయడం ఆయన పుణ్యమే. ఈ విధంగా హైమెన్డార్ఫ్ ఒక శాస్త్రవేత్తగానే మిగిలిపోకుండా ఆదివాసీల బతుకుల్లో వెలుగులు నింపిన బాంధవ్యుడు.
పెనుక ప్రభాకర్, 9494283038
(నేడు హైమెన్డార్ఫ్ వర్ధంతి)