ఉత్తర ప్రదేశ్ సంభల్ జిల్లాలోని చందౌసి ప్రాంతంలో ఇటీవల కనుగొన్న సుమారు 150 ఏళ్ల నాటి దిగుడు బావిలో కొంత భాగాన్ని ఆక్రమించినట్లుగా భావిస్తున్న ఒక ఇంటిని మునిసిపల్ అధికారుల నోటీస్ దృష్టా ఇంటి యజమాని శుక్రవారం రాత్రి పాక్షికంగా కూల్చివేసినట్లు అధికారి ఒకరు శనివారం వెల్లడించారు. తవ్వకాలు కొనసాగుతున్నందున ఆఇల్లు ఒక వైపు దిగుడు బావిని ఆక్రమించినట్లు వెలుగులోకి వచ్చినట్లు, లక్ష్మణ్ గంజ్ వాసి గుల్నాజ్ (యూసఫ్ సైఫీ భార్య)కు ఒక నోటీస్ ఇచ్చినట్లు, వారే స్వయంగా దానిని కూల్చివేస్తున్నట్లు చందౌసి నగర్ పాలిక పరిషత్ ఎగ్జిక్యూటివ్ అధికారి కృష్ణ కుమార్ సోన్‌కర్ తెలియజేశారు. ‘వారికి నోటీస్ ఇవ్వడమైంది.
వారు తమంత తాముగా దానిని కూల్చివేస్తున్నారు. మేము జెసిబితో కూల్చివేసినట్లయితే మరింత నష్టం జరిగి ఉండేది. ఒక భాగాన్ని మాత్రమే తొలగించవలసి ఉంటుందని, తక్కిన భాగాన్ని వదలివేస్తామని జిల్లా మేజిస్ట్రేట్ (డిఎం) శుక్రవారం వారికి వివరించారు’ అని ఆయన తెలిపారు. తన ఇంటిని కోల్పోతున్నందుకు విచారంగా ఉందని గుల్నాజ్ చెప్పారు. ’24 గంటల్లోగా ఇల్లు ఖాళీ చేయవలసిందిగా నాకు నోటీస్ ఇచ్చారు. నేను డిఎంతో మాట్లాడాను. మాకు స్థలం అమ్మినవారిపై కేసు నమోదు చేయవలసిందని ఆయన మమ్మల్ని కోరారు’ అని గుల్నాజ్ తెలిపారు.