మలేషియా ఓపెన్ ప్రపంచ టూర్ సూపర్ 1000 టోర్నీలో సాత్విక్‌సాయిరాజ్ రంకీరెడ్డి చిరాగ్ శెట్టి జోడీ పోరు ముగిసింది. అద్భుత ఆటతీరుతో ప్రత్యర్థులను చిత్తుచేస్తూ సెమీస్‌కు దూసుకొచ్చిన ఈ జోడీ కొరియన్ జోడీ చేతిలో 10-21, 15-21 పాయింట్ల తేడాతో చిత్తుగా ఓడి ఇంటిదారి పట్టింది. శనివారం జరిగిన పురుషుల డబుల్స్‌లో సాత్విక్ చిరాగ్ జోడీ కొరియన్‌కు చెందిన కిమ్ ఒన్ హోసియొ షంగ్ జయ్ జోడీతో తలపడింది. హోరాహోరీగా సాగిన ఈ పోరులో తొలి గేమ్ నుంచి కొరియన్ జోడీ ఆధిపత్యం చెలాయించింది. 40 నిమిషాల్లోనే మ్యాచ్ ముగించింది కొరియన్ జోడీ.
తొలి బ్రేక్ పాయింట్ సమయానికి సెమీస్‌లో కిమ్‌సియొ జోడీ 6-11 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. అదే జోరుతో సాత్విక్ చిరాగ్ జోడీకి అవకాశమివ్వకుండా తొలి గేమ్‌ను 10-21తో 19 నిమిషాల్లో కైవసం చేసుకుంది. అనంతరం జరిగిన రెండో గేమ్‌లో తొలుత గట్టి పోటీనిచ్చినా సాత్విక్ చిరాగ్ జోడీ చివరి వరకూ ఆధిక్యాన్ని కాపాడుకోలేకపోయింది. ఇదే అదనుగా చెలరేగిన కొరియన్ జోడీ 15-21తో గేమ్‌ను సొంతం చేసుకొని మ్యాచ్‌లో విజయం సాధించింది. దీంతో ఫైనల్లోకి దూసుకెళ్లింది.