కర్నాటక ప్రజలు ఐదు సంవత్సరాల కాలానికి కాంగ్రెస్‌ను ఆశీర్వదించారని, తాను, ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పార్టీ అధిష్ఠాన వర్గం ఆదేశాలకు అనుగుణంగా పని చేస్తూనే ఉంటామని ఉప ముఖ్యమంత్రి డికె శివకుమార్ శనివారం చిక్కమగళూరులో చెప్పారు. అధికార పార్టీలో అధికారం కోసం కుమ్ములాటలు ఉన్నాయన్న వార్తలను ఆయన తోసిపుచ్చారు. రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు కూడా అయిన శివకుమార్ చిక్కమగళూరుకు రాగానే ‘తదుపరి ముఖ్యమంత్రి’ అని తనను మద్దతుదారులు కొనియాడుతుండడంతో తనకు ఎవరి మద్దతూ అవసరం లేదని, పార్టీ చెప్పినదానికి కట్టుబడి ఉంటానని ఆయన స్పష్టం చేశారు.‘ఏ ఒక్కరూ ఆందోళన చెందరాదు, రాజకీయ మలుపు అవసరం ఏమాత్రం లేదు. జనం మమ్మల్ని ఆశీర్వదించి, మాకు ఒక అవకాశం ఇచ్చారు, మేము ఐదు సంవత్సరాల పాటు కొనసాగుతాం.
ఇప్పుడు సాగుతున్న చర్చలు అన్నిటికీ ఏమాత్రం విలువ లేదు. ముఖ్యమంత్రి, నేను పార్టీ ఆదేశాల ప్రకారం పని చేస్తూనే ఉంటాం’అని శివకుమార్ ఒక ప్రశ్నకు సమాధానంగా విలేకరులతో చెప్పారు. మీరు తదుపరి సిఎం కావాలని కార్యకర్తలు లేదా మద్దతుదారుల కోరుతుండడం గురించిన ప్రశ్నకు శివకుమార్ సమాధానం ఇస్తూ, ‘నా నుంచి ఏదైనా ఎవరైనా కోరాలని నేను అనుకోవడం లేదు. నాకు ఏ ఒక్కరి మద్దతూ అవసరం లేదు. నాకు ఏ శాసనసభ్యుని దన్నూ అక్కరలేదు. ఇది నాకు, కాంగ్రెస్ పార్టీకి మధ్య ఉంది. కాంగ్రెస్ పార్టీ ఏమి చెప్పినా తదనుగుణంగా నేను పని చేస్తాను. నా కోసం కార్యకర్తలు లేదా శాసనసభ్యులు అరవాలని లేదా నాకు మద్దతుగా నిలవాలని నేను కోరుకోవడం లేదు. నా కర్తవ్యం నేను నెరవేరుస్తా’ అని తెలిపారు. “కర్మన్యే వాధికారస్తే మా ఫలేష్ కదాచన’ (నీ కృషి నీవు చేయి, ఫలితాలు భగవంతునికి వదిలేయి) అన్న సూక్తిలో నాకు విశ్వాసం ఉంది’ అని శివకుమార్ చెప్పారు.