కీడల్లో ఆసక్తితో శిక్షణకోసం వచ్చిన అథ్లెట్లను లైంగికంగా వేధించిన కోచ్ లు ప్రస్తుతం ఊచలు లెక్కిస్తున్నారు. దళిత టీనేజ్ అథ్లెట్‌ను ఐదేళ్లుగా లైంగికంగా వేధించి, అత్యాచారం చేసిన ఘటన కేరళలో జరిగింది. ఈ ఆరోపణపై ఏకంగా 15మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి దారుణాన్ని భరించలేక 18 ఏళ్ల అథ్లెట్ ధైర్యం చేసి ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఈ చర్యకు దిగారు. 16 ఏళ్లుగా ఉన్ననాటి నుంచి తనపై పలుమార్లు అత్యాచారం చేశారని ఆ బాలిక పోలీసులకు ఆవేదనతో తెలిపింది.
పతినంతిట్ట జిల్లాలో రెండు పోలీసు స్టేషన్లలో ఐదు ఎఫ్‌ఐఆర్ లు నమోదు కావడంతో శుక్రవారం ఆరుగురిని, శనివారం మరో 9 మందిని ఈ కేసులో అరెస్ట్ చేశారు. ఆ అథ్లెట్ ను కోచ్ లతో పాటు, తోటి అథ్లెట్లు, క్లాస్ మేట్ లు కూడా లైంగికంగా వేధించినట్లు తగిన సాక్ష్యాలుసేకరించినట్లు పోలీసులు తెలిపారు. మహిళా అథ్లెట్ లను వేధించిన కేసులో దాదాపు 60 మంది ప్రమేయం ఉన్నట్లు విచారణలో వెల్లడైంది. అరెస్ట్ చేసిన వారి నుంచి వాగ్మూలం నమోదు చేశారు. వారిపై పోక్సో కింద,ఎస్సీ ఎస్టీ చట్టం కింద కేసులు నమోదు చేశారు. సిట్ ఏర్పాటు చేసి దర్యాప్తు చేస్తున్నారు.