గుజరాత్‌లో నాలుగో హ్యూమన్ మెటాన్యూమో వైరస్(హెచ్‌ఎంపివి) కేసు నిర్ధారణ అయింది.అహ్మదాబాద్‌లోని ఓ తొమ్మిది నెలల బాలుడికి హెచ్‌ఎంపివి సోకినట్లు అధికారులు ఆదివారం వెల్లడించారు. ఈ వైరస్ కేసులన్ని వారం రోజుల్లోనే పెరిగాయి. జలుబు, దగ్గు కారణంగా ఆ పిల్లాడిని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో జనవరి 6న చేర్పించారు. ఆ పిల్లాడు శ్వాస తీసుకోడానికి కూడా ఇబ్బంది పడుతున్నాడు. కాగా ఆ పిల్లాడు విదేశాలకు పయనించిన దాఖలాలు లేవని అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు తెలిపారు. ఇదిలావుండగా సబర్‌కాంత జిల్లాలో ఎనిమేదేళ్ల బాలుడికి కూడా శుక్రవారం ఈ వైరస్ సోకినట్లు వెల్లడయింది. అహ్మదాబాద్‌లో రెండు రోజుల క్రితం ఓ 80 ఏళ్ల వృద్ధుడికి పరీక్షలు నిర్వహించగా వైరల్ ఇన్‌ఫెక్షన్ పాజిటివ్ అని తేలింది. ఆ వృద్ధుడు ఆస్తమా వ్యాధితో బాధపడుతున్నాడు. కాగా ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో అతడికి చికిత్స అందిస్తున్నారు.
గమనించాల్సిన విషయం ఏమిటంటే గుజరాత్‌లో తొలి సాంక్రమిక కేసు జనవరి 6న వెలుగు చూసింది. రాజస్థాన్‌కు చెందిన ఓ రెండు నెలల బాలుడికి హెచ్‌ఎంపివి సోకినట్లు వెల్లడయింది. ఈ వైరల్ వ్యాధి లక్షణాలు ఏమిటంటే జ్వరం, ముక్కు దిబ్బడ, ముక్కు కారడం, దగ్గు వంటివి ఉంటాయి. అహ్మదాబాద్‌లోని ఆసుపత్రిలో ఆ బాలుడికి చికిత్స అందించాక డిశ్చార్జ్ చేశారు. ఇక హెచ్‌ఎంపివి వ్యాధి వివరాల్లోకి వెలితే… దీనిని 2001లో గుర్తించారు. ఇది పారామిక్సోవిరిడే కుటుంబానికి చెందింది. ఇది శ్వాసకోశ సిన్సిటయల్ వైరస్‌కు సంబంధించింది. ఇది దగ్గు లేదా తుమ్ముల నుంచి వచ్చే శ్వాసకోశ బిందువుల ద్వారా, అలాగే కలుషితమైన ఉపరితలాలను తాకడం లేదా వ్యాధి సోకిన వ్యక్తులతో ప్రత్యక్ష సంబంధంలోకి రావడం ద్వారా వ్యాపిస్తుంది.