మన తెలంగాణ/గజ్వేల్ జోన్/మర్కుక్:సెల్ఫీల సరదా ప్రాణాలు తీసిన సంఘటన సిద్దిపేట జిల్లా, మ ర్కుక్ మం డలం, కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్‌లో చోటుచేసుకుంది. శనివారం ఉదయం ఐదుగురు యువకులు రిజర్వాయర్‌లో పడి మృత్యువాతపడ్డారు. మరో ఇ ద్దరు యు వకులు సురక్షితంగా బయటపడ్డారు. వివరాల్లో కి వెళ్తే.. సికింద్రాబాద్‌లోని ముషీరాబాద్‌కు చెందిన ఏడుగురు యువకులు నాలుగు ద్విచక్ర వాహనాలపై శనివా రం కొండపోచమ్మ రిజర్వాయర్‌కు వచ్చారు. ఈత కోసం వా రు ఒకరి చేయి ఒకరు పట్టుకొని రిజర్వాయర్‌లో సె ల్ఫీలు దిగాలన్న ఉత్సాహంతో లోపలికి దిగారు. వారంతా అలా సెల్ఫీలు తీసుకుంటున్న క్రమంలో ఒక్కసారిగా రిజర్వాయర్‌లోకి జారీ మునిగిపోయారు. అనూహ్యంగా జరిగిన ఈ పరిణామంతో ఐదుగురు యువకులు నీటిలో మునిగి మృత్యవాత పడగా మరో ఇద్దరు యువకులు మాత్రం ఈదుకుంటూ సురక్షితంగా బయటకు వచ్చారు. రిజర్వాయర్‌లో తమ స్నేహితులు మునిగిన వెంటనే మిగిలిన ఇద్దరు యువకులు ఆర్తనాదాలు చేసినా వారి రోదన అరణ్యరోదనగా మిగిలింది.
దూరంగా ఉన్న ఒకరిద్దరు పోలీసులకు సమాచారం అందగానే ఘటనా స్థలానికి చేరుకొని పైఅధికారులకు సమాచారం చేరవేశారు. వెంటనే గజ్వేల్ ఏసిపి పురుషోత్తం రెడ్డి ఆధ్వర్యంలో ములుగు, మర్కుక్ పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి గల్లంతైన వారిని గజఈతగాళ్లను రప్పించి బయటకు తీసేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించాయి. సంఘటన స్థలాన్ని చేరుకున్న సిపి అనురాధ పరిస్థితిని సమీక్షించారు. తొలుత దినేశ్వర్ అనే యువకుడి మృతదేహం లభ్యమైంది. ఆ తర్వాత జరిపిన ముమ్మర గాలింపు చర్యలతో మిగతా వారి మృతదేహాలు కూడా లభ్యమయ్యాయి. మృతుల్లో సికింద్రాబాద్ ముషీరాబాద్‌కు చెందిన ఫొటోగ్రాఫర్ ధనుష్ (20), ధనుష్ సోదరుడు లోహిత్ (17), కవాడిగూడకు చెందిన చీకట్ల దినేశ్వర్ (17), డిప్లొమా విద్యార్థి సాహిల్ (19), ఖైరతాబాద్ చింతల్ బస్తీకి చెందిన డిప్లొమా విద్యార్థి జతిన్ (17) ఉన్నారు. ఈ ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడిన ఇద్దరిలో ముషీరాబాద్ రామ్‌నగర్‌కు చెందిన డిప్లొమా విద్యార్థి కొమారి మృగాంక్ (17), ముషీరాబాద్‌కు చెందిన ఎండి. ఇబ్రహీం (20) ఉన్నారు. సమాచారం తెలుసుకున్న మృతుల కుటుంబాలకు చెందిన బంధువులు రోదిస్తూ సంఘటనా చేరుకుని, దిక్కులు పిక్కటిల్లేలా రోదించిన తీరు పలువురిని కలచివేసింది.
కొండపోచమ్మ ఘటనపై సీఎం విచారం
సిద్దిపేట జిల్లా కొండపోచమ్మ ప్రాజెక్టులో యువకులు గల్లంతు అయిన ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విచారం వ్యక్తం చేశారు. గజ ఈత గాళ్లతో గాలింపు చర్యలు చేపట్టాలని సీఎం ఆదేశించారు. జిల్లా అధికారులు దగ్గర ఉండి పరిస్థితిని పర్యవేక్షించాలని, తగిన సహాయక చర్యలు చేపట్టాలని కోరారు.
టీపీసీసీ సంతాపం..
కొండపోచమ్మ జలాశయంలో ఐదుగురు యువకులు మునిగి చనిపోయిన సంఘటనపై టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఎంతో భవిష్యత్తు ఉన్న యువత ఇలా అర్దాంతరంగా జీవితాలను కోల్పోవడం అత్యంత బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇదిలావుండగా, రిజర్వాయర్ పరిధిలో అప్పుడప్పుడు ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో పోలీసులు రిజర్వాయర్‌లోకి ఎవరినీ రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ విషయంలో ఒకింత కఠినంగా కూడా వ్యవహరిస్తున్నారు. అయినప్పటికీ సుమారు తొమ్మిది కిలోమీటర్ల విశాలమైన రిజర్వాయర్ కట్టపై పర్యవేక్షణ చేయడానికి కొద్ది మంది పోలీసులే ఉండటం, ఒక్కోసారి ఇలాంటి సంఘటనలకు దారితీస్తోంది. పోలీసులు ఎంత వారించినా ఎక్కడో ఒకచోట దూరం నుంచి కట్ట కింది వైపు నుంచి ఈత కోసం కొందరు యువకులు దిగుతూ ఉండటం ఇలాంటి ప్రమాదాలకు దారితీస్తోంది. ఇప్పటికైనా రిజర్వాయర్లో ప్రమాదాలు నివారణకు బందోబస్తు చర్యలను మరింత కఠినం చేయాల్సిన అవసరం ఉందని పలువురు కోరారు.
ఫలించిన గాలింపు చర్యలు : సిపి అనురాధ
హైదరాబాద్ పట్టణానికి చెందిన యువకులు కొండపోచమ్మ సాగర్‌ను చూడడానికి వచ్చి, అందులోకి దిగి ఐదుగురు గల్లంతై మరణించినట్టు సిపి అనురాధ తెలిపారు. విషయం తెలిసిన వెంటనే జిల్లాలో ఉన్న గజఈతగాళ్లను పిలిపించి గాలింపు చర్యలు చేపట్టడంతో ఎట్టకేలకు ఐదుగురు యువకుల మృతదేహాలు లభ్యమయ్యాయని తెలిపారు. ఎస్‌పి వెంట సిద్దిపేట=గజ్వేల్ ఏసిపి పురుషోత్తం రెడ్డి, గజ్వేల్ రూరల్ సిఐ మహేందర్ రెడ్డి, ములుగు ఎస్‌ఐ విజయ్ కుమార్, గౌరారం ఎస్‌ఐ కరుణాకర్ రెడ్డి తదితరులు ఉన్నారు.