నల్లగొండ ఇంటెలిజెన్స్ ఎస్పీ గంజి కవిత పై వచ్చిన అవినీతి ఆరోపణల నేపథ్యంలో ఆమెను డిజిపి కార్యాలయానికి అటాచ్ చేస్తూ శనివారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. తన కింద పని చేసే సిబ్బంది నుంచి వసూళ్లు, అవినీతి ఆరోపణల పై కిందిస్థాయి పోలీసు అధికారులు లిఖితపూర్వకంగా పై అధికారులకు ఫిర్యాదు చేసారు. ఎస్పీ కవితను డిజిపి ఆఫీసుకు అటాచ్ చేయడంతో ఆమె స్థానంలో శ్రీనివాస్ రావుకు పోస్టింగ్ ఇచ్చారు. ఆమెపై వచ్చిన ఆరోపణలపై ఇప్పటికే విచారణ జరుగుతుందని, అది అందాక సస్పెండ్ చేసే అవకాశం ఉన్నట్టు పోలీసు వర్గాల సమాచారం. ఇంటెలిజెన్స్ విభాగంలో పోస్టింగ్‌ల కోసం ఆమె లంచాలు వసూలు చేయడంతో పాటు తన సిబ్బందితో వడ్డీ, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయించినట్టు కిందిస్థాయి సిబ్బంది చేసిన ఫిర్యాదులో పేర్కొన్నారు.
అలాగే విధి నిర్వహణలో భాగంగా నల్లగొండ, సూర్యాపేట జిల్లాలో ఇంటలిజెన్స్ ఎస్పీ కవిత అనేక అక్రమాలు, భారీ ఎత్తున వసూళ్లకు పాల్పడినట్లుగా ప్రజల నుంచి కూడా ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో పై అధికారులు కవిత అక్రమా లపై స్పెషల్ షాడో టీమ్‌ను ఏర్పాటు చేసినట్టు సమాచారం. ఇందులో భాగంగా రేషన్ , గుట్కా మాఫీయా నుంచి అక్రమ వసూ ళ్లు, కింది స్థాయి సిబ్బంది వద్ద కూడా చేతివాటం ప్రదర్శించినట్లుగా షాడో టీమ్ నిఘాలో తేలినట్టు తెలిసింది. ఎస్పీ కవితతో పాటు ఒక ఎస్‌ఐ, హెడ్ కానిస్టేబుల్, ముగ్గురు కానిస్టేబుళ్లకు కూడా ఆమె అక్రమాల్లో భాగస్వాములు అయినట్లుగా బయటపడిందని తెలిసింది. హోదాను అడ్డుపెట్టుకొని తన తల్లి డ్యూటీ వెళ్లకుండానే వేతనం తీసుకున్నట్టు విచారణలో బయటపడినట్టు తెలిసింది. ఎస్పీ కవిత తల్లి విద్యుత్ శాఖలో ఉద్యోగం చేస్తున్నట్టు సమాచారం.
విలేకరులకు కూడా ముడుపులు!?
ఇంటలిజెన్స్ ఎస్పీ కవిత చేసిన అక్రమాలను వెలుగులోకి రాకుండా ఆమె పెద్ద మొత్తంలో స్థానిక విలేఖరులకు ముడుపులు ఇచ్చినట్టు కూడా విచారణలో బయటపడినట్టు తెలిసింది. ఎస్పీ కవితతో కొందరు విలేఖరులు చేసిన చాటింగ్, నగదు లావాదేవీలను విచారణ అధికారులు రెండు, మూడు రోజుల్లో బయట పెట్టనున్నట్టు పోలీసు వర్గాల విశ్వసనీయ సమాచారం.