పంజాబ్ లోని లూథియానా వెస్ట్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆప్ ఎమ్‌ఎల్‌ఎ గుర్‌ప్రీత్ గోగీ ( 58) అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఆయనకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. గుర్‌ప్రీత్ గోగీ తన నివాసంలో తన లైసెన్స్‌డ్ పిస్టల్‌ను శుక్రవారం రాత్రి 11.30 గంటల ప్రాంతంలో శుభ్రం చేస్తుండగా ప్రమాద వశాత్తు బుల్లెట్ దూసుకొచ్చి తలకు గాయమై చనిపోయారని కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ కేసును దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు చెప్పారు. మరణానికి కొన్ని గంటల ముందు ఆయన అసెంబ్లీ స్పీకర్ కుల్తార్ సింగ్ సంధ్వాన్, ఆప్ ఎంపీ బల్బీర్‌సింగ్ సేచ్వాల్‌తో బుద్ధ నల్లా పరిశుభ్రం గురించి మాట్లాడారు.
ఈ నల్లా పూర్తిగా కలుషితమైంది. శనివారం మధ్యాహ్నంలూధియానాలో కెవిఎం స్కూలు సమీపాన ఆయన అంత్యక్రియలు జరిగాయి. ఆయన కుమారుడు స్వరాజ్ సింగ్ బస్సీ అంత్యక్రియలు నిర్వహించారు. ముఖ్యమంత్రి భగవంత్ మాన్, స్పీకర్ సంద్వాన్ , పార్టీ ఎంపీలు రాజ్‌కుమార్ చబ్బేవాల్, సీచేవాల్, సంజీవ్ అరోరా, కేబినెట్ మంత్రులు కుల్‌దీప్ సింగ్ దలీవాల్, హర్‌దీప్‌సింగ్ ముండియాన్, లాల్ చంద్ కటరుచక్, తరుణ్‌ప్రీత్ సింగ్ సౌంద్, తదితరులు అంత్యక్రియల్లో పాల్గొన్నారు.