మన తెలంగాణ/హైదరాబాద్: అంతర్జాతీయ వేడుకకు హైదరాబాద్ నగరం సిద్దమవుతోంది. సంక్రాంతి పండగ సందర్భంగా ఈ నెల 13, 14,15 తేదీల్లో సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో 7వ అంతర్జాతీయ కైట్, స్వీట్ ఫెస్టివల్‌ను నిర్వహించేందుకు రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ ఏర్పాట్లు చేస్తోంది. ఈ సందర్బంగా బేగంపేట్ హరిత ప్లాజాలో పర్యాటక, సాంస్కృతిక శాఖ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఇం టర్నేషనల్ కైట్, స్వీట్ ఫెస్టివల్ గోడపత్రికను శనివారం ఆవిష్కరించారు. అంతకుముందు స్వీట్ స్టాల్స్‌ను మంత్రి సందర్శించి, వివిధ రా ష్ట్రాలకు చెందిన మహిళలు తమ ఇంట్లోనే త యారు చేసిన సంప్రదాయ మిఠాయిలను రుచి చూశారు. ఈసందర్భంగా మంత్రి జూపల్లి మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబించేలా, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్‌ను పెంచేలా అంతర్జాతీయ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ నిర్వహిస్తామని అన్నారు. హైదరాబాద్ ఓ మినీ ఇండియా అని,
దేశంలోని అన్ని రాష్ట్రాలు, ప్రాంతాలే కాకుండా ఇతర దేశాల నుంచి కూడా కాస్మోపాలిటన్ సిటీలో స్థిరపడ్డారని వెల్లడించారు. మూడు రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలలో 16 దేశాల నుంచి 47 మంది అంతర్జాతీయ కైట్ ఫ్లైయర్స్, 14 రాష్ట్రాల నుంచి 60 దేశవాళీ కైట్ క్లబ్ సభ్యులు పాల్గొని పలు డిజైన్లలో రూపోందించిన పతంగులను ఎగుర వేస్తారని వివరించారు. వీటితో పాటు జాతీయ, అంతర్జాతీయ స్వీట్లను, తెలంగాణ పిండి వంటలను స్టాళ్లలో అందుబాటులో ఉంచుతారని పేర్కొన్నారు. తెలంగాణలోని చారిత్రక ప్రదేశాలు, వారసత్వ కట్టడాలు, ప్రాచీన దేవాలయాలను సందర్శించాలని మంత్రి కోరారు. తెలంగాణ టూరిజం శాఖ అందుకు తోడ్పాటును అందిస్తుందని అన్నారు. పర్యాటక ప్రదేశాలను సందర్శించడం వల్ల ఆ ప్రాంత చరిత్ర సంస్కృతి, సంప్రదాయాలు తెలుసుకోవడంతో పాటు స్థానికులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని తెలిపారు. వీక్షకులకు ఉచిత ప్రవేశం ఉంటుందని, అందరూ ఆహ్వానితులేనని తెలిపారు. రాబోయే రోజుల్లో కైట్, స్వీట్ ఫెస్టివల్‌ను పట్టణ, గ్రామీణ ప్రాంతాలకు విస్తరిస్తామని పేర్కొన్నారు.
కైట్, స్వీట్ ఫెస్టివల్ తెలంగాణ ప్రత్యేకత:స్మితా సబర్వాల్
పర్యాటక, సాంస్కృతిక శాఖ కార్యదర్శి స్మితా సబర్వాల్ మాట్లాడుతూ భారతదేశంలోనే కాదు, ప్రపంచంలో కూడా ఇలాంటి ఫెస్టివల్ ఎక్కడ నిర్వహించరని, అదే తెలంగాణ ప్రత్యేకతని అన్నారు. కైట్ ఫెస్టివల్ లో సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించడంతో పాటు హస్తకళలు, చేనేత వస్త్రాల స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నట్లు పర్యాటక శాఖ అధికారులు తెలిపారు. ఈ సంవత్సరం కైట్ ఫెస్టివల్‌కు మూడు రోజుల్లో 15 లక్షల మంది వరకు వస్తారని అంచనా వేస్తున్నామని అన్నారు. ప్రదర్శన తిలకించటానికి వచ్చే సందర్శకులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా జీహెచ్‌ఎంసీ, పోలీసు, ఇతర శాఖల అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పర్యాటక శాఖ సంచాలకులు జెండగే హనుమంతు కొండిబా, భాషా, సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ, కైట్ ఫెస్టివల్ కన్సల్టెంట్ పవన్. డి.సోలంకి, క్లిక్ కన్వీనర్ లిబి బెంజిమన్, దేశీయ, అంతర్జాతీయ కైట్ ప్లయర్స్, వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.