సంక్రాంతి పండగకు
సొంతూళ్లకు బయలుదేరిన
హైదరాబాద్ వాసులు
జాతీయ రహదారులపై
పెరిగిన రద్దీ ప్రయాణికులతో
కిటకిటలాడుతున్న బస్‌స్టేషన్లు,
రైల్వేస్టేషన్లు గంటల
తరబడి ట్రాఫిక్‌జామ్ ఒక్కరోజే
హైదరాబాద్ సిటీ దాటిన లక్ష
వాహనాలు ప్రత్యామ్నాయ
మార్గాల ద్వారా ట్రాఫిక్‌ను
మళ్లిస్తున్న పోలీసులు
మన తెలంగాణ/చౌటుప్పల్/హైదరాబాద్: సంక్రాంతి పండగ కోసం హైదరాబాద్ వాసులు పల్లెబాట పట్టారు. ఈనెల 11వ తేదీ నుంచి 17 వరకు వరస సెలవులు రావడంతో పండగను తమ సొంతూళ్లలో జరుపుకునేందుకు పట్టణం విడిచి పల్లెకు పయనమయ్యారు. ఆంధ్రప్రదేశ్‌తో పాటు తెలంగాణలోని ఖమ్మం, నల్గొండ ఉమ్మడి జిల్లాలకు చెందిన ప్రజలంతా చౌటుప్పల్ మీదుగా 65వ నెంబర్ జాతీయ రహదారిపై వెళ్లాల్సి ఉండడంతో ఒక్కసారిగా రద్దీ పెరిగింది. ప్రజలు తమ స్తోమతను బట్టి ద్విచక్ర వాహనాలు, కార్లు, బస్సులు ఇతర వాహనాల్లో స్వగ్రామాలకు బయలు దేరారు. దీంతో శుక్రవారం ఉదయం నుంచి శనివారం రాత్రి వరకు సమారు లక్ష పైచిలుకు వాహనాలు తరలివెళ్లినట్లు తెలుస్తోంది. రహదారిపై ఒక్కసారిగా వాహనాల రద్దీ విపరీతం కావడంతో చౌటుప్పల్ పట్టణంలోని పలు కూడళ్లతో పాటు మండలంలోని పలు గ్రామాల క్రాసింగ్‌ల వద్ద రోడ్డు దాటడం స్థానికులకు ఇబ్బందికరంగా మారింది.
దీంతో పోలీసులు రోడ్డు క్రాసింగ్‌ల వద్ద ఎలాంటి ప్రమాదాలు జరగకుండా పటిష్టమైన చర్యలు చేపడుతున్నారు. దుమ్ము, ధూళి అనకుండా రోడ్లపై నిలబడి రోజుకు 24 గంటల పాటు ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నారు. చౌటుప్పల్ మండలంలోని పంతంగి టోల్ ప్లాజా వద్ద వాహనాల రద్దీ పెరగడంతో హైదరాబాద్ విజయవాడ వైపు పూర్తిగా పది గేట్లను తెరిచి వాహనాలను పంపించి వేస్తున్నారు. స్థానిక పోలీసులు, ఎన్‌హెచ్‌ఎఐ అధికారులు కలిసి ట్రాఫిక్‌కు అంతరాయం కలుగకుండా పరిస్థితిని ఎప్పటికప్పుడు దగ్గరుండి సమీక్షిస్తున్నారు. హైవేపై ఎలాంటి ఆటంకం లేకుండా తమ ప్రయాణాలు సాఫీగా సాగుతుండడంతో వాహన దారులు సైతం ఊపిరి పీల్చుకున్నారు. ఇదిలావుండగా 16 నుంచి నగరానికి మళ్లీ తిరుగు ప్రయాణ రద్దీ ప్రారంభం కానుంది.
సిటీ దాటిన లక్ష వాహనాలు
సంక్రాంతి పండుగ సందర్భంగా సొంత ఊళ్లకు వెళ్లే వాహనాలతో హైదరాబాద్‌విజయవాడ, హైదరాబాద్-బెంగళూరు జాతీయ రహదారిపై గంటల తరబడి ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. హైదరాబాద్ నుం చి ఆంధ్రా, రాయలసీమకు వెళ్లే రహదారులపై ఉన్న టోల్ ప్లాజాల వద్ద వాహనాల రద్దీ శనివారం ఉదయం నుంచే అనూహ్యంగా పెరిగిపోయింది. ముఖ్యంగా విజయవాడ రహదారిపై యాదాద్రి జిల్లా పంతంగి టోల్‌ప్లాజా దగ్గర వాహనాల రద్దీతో కిలో మీటర్ల పొడవునా వాహనాలు బారులుతీరాయి. నగరం నుంచి పండుగకు తమ గ్రామాలకు వెళ్లే వారు శుక్రవారం సాయంత్రం నుంచి పల్లెబాట పట్టడంతో ఒకేసారి జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారులు వాహనాలు చీమలబారును తలపిస్తున్నాయి. హైదరాబాద్ -విజయవాడ జాతీయ రహదారిపై శనివారం సాయంత్రం వరకే 50వేల వా హనాలు క్రాస్ అయినట్లు పంతంగి టోల్ ప్లాజావర్గాల సమాచారం. ట్రాఫిక్ జామ్ నివారించేందుకు తమ టోల్‌గేట్ వద్ద 6 గేట్ల ద్వారా హైదరాబాద్ నగరానికి, అలాగే ఆంధ్ర ప్రాంతం వైపు 10 టోల్‌గేట్లు ఏర్పాటు చేసినట్టు చెప్పారు.
రద్దీనీ నియంత్రించేందుకు టోల్ ప్లాజా సిబ్బంది, పోలీసులు ట్రాఫిక్ జామ్ కాకుండా చేసేందుకు అష్టకష్టాలు పడుతున్నారు. సాధారణ రోజుల్లో 15 వేల నుంచి 20 వేల వాహనాలు వెళ్తాయని, అయితే ఈసారి సంక్రాంతి సందర్భంగా శుక్రవారం సాయంత్రం వరకు ఒక్క రోజే 55 వేల వాహనాలు వెళ్లినట్లు టోల్ ప్లాజా వర్గాలు చెప్పాయి. ఇలా ఉండగా, ప్రతి శనివారం తెల్లవారుజాము నుంచే నగరంలోని ఎంజిబిఎస్, జెబిఎస్, దిల్‌సుఖ్ నగర్, ఎల్బీ నగర్ జంక్షన్లు ప్రయాణికులతో రద్దీతో కిక్కిరిసి పోయాయి. వాహనాల రద్దీ కారణంగా పోలీసులు ప్రత్యామ్నాయ మార్గాలను సూచిస్తున్నారు. ఆదివారం మరింత ట్రాఫిక్ తలెత్తే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఊళ్లకు వెళ్లే ప్రయాణికులకు ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. ఇక హైదరాబాద్ నుంచి రాయలసీమ వైపు వెళ్లే వాహనాలతో బెంగళూరు హైవే కూడా రద్దీగా మారింది. ఈ రూట్‌లో 20నుంచి 25 వేల వాహనాలు సా యంత్రం 5 గంటలకు వరకు వెళ్లినట్లు అంచనా వేస్తున్నారు. ఇక హైదరాబాద్ నుంచి వరంగల్, కరీంనగర్, నిజామాబాద్ రహదారుల్లోనూ విపరీతమైన రద్దీ కనిపించింది. మొత్తంగా హైదరాబాద్ నుంచి శనివారం సాయంత్రం 5 గంటల వరకు ఏకంగా లక్ష వాహనాలు నగ రం దాటి వెళ్లినట్లు అంచనా వేస్తున్నారు. వీటిలో కార్లు, ఇతర ప్రై వేట్ వాహనాలతో పాటు ఆర్టీసీ రెగ్యులర్, స్పెషల్ బస్సులు ఉన్నాయి.