‘ఆర్ద్రత’లో వ్యత్యాసం, మర్యాద చూపించడంలో ‘పక్షపాత మనస్తత్వం’, ‘అయినవారికి ఆకుల్లో కానివారికి కంచాల్లో’ వడ్డించడంలా ప్రవర్తించడం లాంటి వైరుధ్యాలు అధికారంలో వున్న రాజకీయ నాయకులకు సర్వసాధారణం, మానవ నైజం. ఈ జాడ్యం క్రమేపీ రాజకీయేతర ప్రముఖులకు కూడా విస్తరిస్తున్నది. ఇది కేవలం, కలియుగం ప్రథమ పాదంలోనే కాదు. యుగయుగాలుగా, యుగధర్మాలకు అనుగుణంగా జరిగాయి. ప్రభుత్వాధినేతలు నిరంతరం అందుబాటులో, చేరువలో వుండే విషయంలో కానీ; నలుగురు ప్రముఖులున్న చోట, రాజకీయ నాయకులు ఎలా మెసలుకోవాలనే విషయంలో కానీ; ఆదరణ, నిరాదరణ విషయంలో కానీ, ‘పెద్దలపట్ల చూపాల్సిన గౌరవ మర్యాదలు’ విషయంలో కానీ; ఇలాంటి మరెన్నో విషయాలలో కొన్ని ఆదర్శాలను పాటిస్తే మంచిదేమో! ఆదర్శాల మాట అటుంచి, కనీస మర్యాదలు పాటిస్తే అభిలషణీయమేమో! విద్యార్థిగా ‘డొమిసియల్’ సర్టిఫికేట్ కోసం వెళ్లి తహసీల్దార్‌ను కలవలేకపోవడం, పలుకుబడిగల ఇతరులు కలుస్తుంటే కళ్లప్పగించి చూడడం, హైదరాబాద్ వచ్చిన కొత్తలో సచివాలయానికి వెళ్తుంటే గేటు దగ్గర నిలిపివేయడం, రేడియో స్టేషన్‌కు వెళ్తే లోనికి పోవడానికి అనుమతి లభించకపోవడం, పలువురు ముఖ్యమంత్రులు, వారివారి పద్ధతులలో ఇతరులను కలవడం లేదా కలవకపోవడం, గవర్నర్‌ను కలవడానికి వచ్చేవారి విషయంలో, సమయపాలనకు పక్కా ప్రణాళిక వుండడం, ఎవరైనా ఎక్కడికైనా వెళ్లినప్పుడు ఒకరు మరొకరికి ఇవ్వాల్సిన గౌరవ మర్యాదలు లాంటి అనేకం, నిజజీవితంలో ప్రత్యక్షంగా అనుభంలోకి వచ్చినప్పుడల్లా, మహాభాగవతంలోని కొన్నిఘట్టాలు సందర్భోచితంగా గుర్తుకొచ్చాయి, ఇప్పటికీ వస్తున్నాయి.
సనకసనందనాదులు శ్రీహరిని కలవడానికి వైకుంఠధామానికి ఐదేళ్ల బాలురలాగా వెళ్లారనీ, జయ, విజయులు అనే అక్కడ వున్న ద్వారపాలకులు, తమ ఉద్యోగ బాధ్యత నిర్వహణలో భాగంగా వారిని అడ్డుకుని, భూలోకంలో జన్మించమని వారిచ్చిన శాపానికి గురయ్యారనీ పోతన్న (వేదవ్యాస) మహాభాగవతంలో చదివాం. బయట ఈ గొడవ విన్న శ్రీహరి, శ్రీమహాలక్ష్మి సమేతంగా అక్కడికి వచ్చాడు. సనకసనందనాదులకు, వారు కోరుకున్న దర్శనం ఇచ్చారు. తన ద్వారపాలకులను క్షమించమనీ, వీళ్లు భూమ్మీద పుట్టి, కొంతకాలం ఉండి, అచిరకాలంలోనే తన దగ్గరకు తిరిగి వచ్చేవిధంగా అనుమతించమనీ శ్రీహరి అనగానే వారు ఒప్పుకున్నారు. ఈ కథలో సందేశం వుంది. అవి: ఒకరిని కలవాలనుకున్నప్పుడు వెళ్లే విధానం, విధి నిర్వహణ, కాలయాపన జరక్కుండా ఉండేటట్లు కలవడానికి వచ్చినవారిని బయటనే చూసి పంపించడం సెక్యూరిటీ సిబ్బంది బాధ్యతలు.
ప్రభుత్వాల సుపరిపాలనకు ఒక గీటురాయి ఎన్నికైన ప్రజాప్రతినిధులు, ప్రజలకు సాధ్యమైనంత వరకు నిరంతరం అందుబాటు (Availability), చేరువ (Accessibi lity) లో వుండి, సమస్యల్ని సులభంగా చెప్పుకునే అవకాశాన్ని కల్పించగలగడమే.
మర్యాదపూర్వకంగా కలవాలనుకునేవారికి, తమ తమ సంస్థల కార్యకలాపాలను వివరించాలనుకునేవారికి, తమకు తోచిన సలహాలు (స్వీకరించడం, స్వీకరించకపోవడం వారి ఇష్టం) ఇవ్వదల్చుకున్నవారికి, ఇలా దేనికైనా ఎవరైనా కావచ్చు. అలా వచ్చేవారిని కూడా తప్పక కలవాలి. ఒకప్పుడు, సత్రయాగాన్ని చూడడానికి బ్రహ్మ, యోగులు, సర్వ దేవతలు, మునీంద్రులు, అగ్నిహోత్రుడు, రుషులు, ప్రజాపతులు వచ్చారట. దక్షుడు రాకను గమనించిన సభాసదులందరూ మర్యాద పూర్వకంగా లేచి నిల్చున్నారు. బ్రహ్మ, మహేశ్వరులు మాత్రం లేవలేదు. దక్షుడు తండ్రైన బ్రహ్మకు నమస్కరించి, తనను చూసికూడా ఆసనం మీద నుండి దిగని అల్లుడైన శివుడిని శపించినప్పుడు, నందికేశ్వరుడు, దక్షుడిని శపించాడు. ప్రతిగా, భృగు మహార్షి శివుడిని శపించాడు. శివుడు అక్కడి నుండి వెళ్లిపోయాడు. దక్షుడికి, ఈశ్వరుడికీ పరస్పర విరోధం పెరిగింది. నలుగురు ప్రముఖులున్న చోట, ఎవరెవరితో ఎలా మెసలుకోవాల్నో, కోపతాపాలను ఎలా అదుపులో వుంచుకోవాల్నో అనే సందేశం ఇక్కడున్నది.
ఆదరణ, నిరాదరణ (రాజకీయ నాయకుల హక్కు, అలవాటు) ఉత్తానపాదుడి వ్యవహార శైలి ద్వారా తెలుస్తుంది. ప్రియభార్య కొడుకు ఉత్తముడిని ముద్దుచేస్తూ, దగ్గరకు వచ్చిన మరో భార్య కుమారుడు ధ్రువుడిని పట్టించుకోక పోవడంతో, తండ్రి ప్రేమ కొరకు, ధ్రువుడు ఏకాగ్ర చిత్తంతో శ్రీహరి కటాక్షం కోసం తపస్సు చేశాడు. ప్రత్యక్షమైన శ్రీహరి ‘ధ్రువక్షితి’ (ధ్రువపదం)ని, ఆ తరువాత సప్తర్షి మండలంకన్న పైనున్న విష్ణు పదాన్ని ప్రసాదించాడు. రాజ్యానికి తిరిగొచ్చి తల్లుల ప్రేమ, తండ్రి ప్రేమ పొందాడు. నిర్లక్ష్యం చేయబడ్డ వ్యక్తి పట్టుదలతో ఎలా ఉన్నత స్థాయికి చేరుకోగలరో ధ్రువోపాఖ్యానం ద్వారా తెలుసుకోవచ్చు. ఇష్టమున్న వారిని ఆదరించడం, లేనివారిని నిరాదరణకు గురిచేయడం తప్పని చెప్పే మహాభాగవత కథ ఇది.
‘పెద్దలపట్ల చూపాల్సిన కనీస గౌరవ మర్యాదలు’ కనుమరుగవుతున్న నేపథ్యంలో, అలా జరిగితే తలెత్తే ఇబ్బందులు, పరిష్కార మార్గాలు తెలియచేసే ఆసక్తికర ఘట్టం మహాభాగవతంలో వున్నది. ఇంద్రుడు ముక్కోటి దేవతలతో కొలువుతీరి, అప్సరసలు పాడుతు, ఆడుతుండగా, దేవతాగణానికి గురువైన బృహస్పతి అక్కడికి వచ్చినప్పటికీ, ఇంద్రుడు తన సింహాసనం మీదనుండి లేవలేదు. ఆయనకు స్వాగతం చెప్పలేదు. కనీసం కూర్చోమని కూడా అనలేదు. బృహస్పతికి కోపం వచ్చి, వెనుతిరిగి వెళ్లిపోయాడు. తరువాత ఇంద్రుడు చింతించినా ఫలితం కలగలేదు. బృహస్పతి ఆధ్యాత్మ మాయద్వారా అదృశ్యుడై పోయాడు. సలహా ఇవ్వడానికి గురువులేని అవకాశం చూసుకుని, రాక్షసులు, శుక్రాచార్యుడి ప్రోద్బలంతో దేవతలమీద యుద్ధానికి పోయారు.
భయంతో బ్రహ్మ దగ్గరకు వెళ్లిన దేవతలను, బృహస్పతి పట్ల వారు ప్రవర్తించిన తీరుకు మందలించి, ప్రస్తుతానికి అధిక బలాఢ్యుడైన ‘విశ్వరూపుడిని’ ఆరాధించి, రాక్షసులను గెలవమని సలహా ఇచ్చాడు. దేవతలు విశ్వరూపుడి దగ్గరకు వెళ్లారు. పౌరోహిత్యం చెయ్యమని అర్థించారు. విశ్వరూపుడు గురుభావాన్ని స్వీకరించాడు. కొంతకాలం దేవతలకు బృహస్పతి స్థానంలో ఆచార్యుడిగా వున్నాడు.
శత్రువుల బారినుండి రక్షించే శ్రీమన్నారాయణ కవచాన్ని, దేవేంద్రుడికి విశ్వరూపుడు బోధించాడు. ఇంద్రుడు దాన్ని ధ్యానం చేసి రాక్షసులను జయించాడు. బృహస్పతిని అవమానించకపోతే, దేవతలు ఇంత ఇబ్బందిపడేవారు కాదుకదా! అధికార పీఠంపై వున్న వర్తమాన రాజకీయ నాయకులలో, ప్రస్ఫుటంగా బహిర్గతమవుతున్న నిరంకుశ ధోరణులు, ప్రశ్నించే వారిని అణచివేతకు గురిచేసే సందర్భాలు, తమ విధానాలను విమర్శించే వారి విషయంలో అనుసరిస్తున్న కక్షపూరిత చర్యలు, తప్పని తెలుసుకోవాలంటే, మహాభాగవతంలోని ప్రహ్లాద చరిత్ర, నృసింహావతారం, హిరణ్యకశిపుడి సంహారం ఘట్టం చదవాల్సిందే. రాక్షసరాజు హిరణ్యకశిపుడుకీ, లీలావతికీ జన్మించిన ప్రహ్లాదుడు పుట్టుకతోనే విష్ణుభక్తుడు. ప్రశ్నించే మనస్తత్వం అలవర్చుకున్న చిన్నవాడు. ఒకవిధంగా చెప్పాలంటే నిర్భయంగా కన్న తండ్రిని కూడా ఎదిరించే వ్యక్తిత్వం. తండ్రి మాటను గౌరవిస్తూ, రాక్షస గురువులు చెప్పినవన్నీ నేర్చుకున్నప్పటికీ విష్ణుభక్తి మాత్రం మానలేదు.
హిరణ్యకశిపుడి మార్గానికి రాని కొడుకు ప్రహ్లాదుడుని రాక్షసులు చిత్రహింసలు పెట్టారు. అయినా ప్రహ్లాదుడిలో మార్పు రాలేదు. పైగా రహస్యంగా విష్ణుతత్త్వాన్ని వారికి బోధించాడు. తండ్రీ, కొడుకులకు మధ్య శ్రీహరి విషయంలో సంవాదం జరిగింది. స్తంభాన్ని చీల్చుకుంటూ ఆవిర్భవించిన నరసింహదేవుడుకి హిరణ్యకశిపుడు లొంగిపోయాడు. చనిపోయాడు. ఎన్నిచేసినా చిట్టచివరకు ‘నియంతృత్వం పైన విజయం నిర్భయత్త్వానిదే’ అనే జ్ఞానోదయం ఈ కథలో బోధపడుతుంది. అధికారంలో ఒకప్పుడున్న, ఇప్పుడున్న, భవిష్యత్‌లో వుండబోయే వారంతా ‘హిరణ్యకశిపులు’ కావచ్చు, కాకపోవచ్చు, కావాల్సిన అవసరం కూడా లేదు. కాని, తమ చర్యల ద్వారా ‘ప్రహ్లాదులు’ ఆవిర్భవించకుండా జాగ్రత్త పడాల్సిన అవసరం మాత్రం తప్పనిసరి.
క్షీరసాగర మథనం పూర్వరంగంలో దానవులతో స్నేహంచేసి, (అవసరం వచ్చినప్పుడు మోసం చేసి), అమృతం సాధించాలని విష్ణుమూర్తి దేవతలకు ఇచ్చిన సలహా, ఆపత్కాలంలో, అవకాశవాద పరిస్థితులలో, ఒక్కోసారి అవసరార్థం, వర్తమాన రాజకీయ నాయకులు అవలంబిస్తున్న, ‘శత్రువులతో కపట స్నేహం’తో పోల్చవచ్చు. దేవతలు రాక్షసులకు స్నేహహస్తం సాచి, బలిచక్రవర్తిని మంచి చేసుకున్నారు. దేవ-దానవుల మధ్య ద్వేషభావం వద్దనుకున్నారు. ఇరుపక్షాలకూ బలిచక్రవర్తే రాజన్నాడు ఇంద్రుడు. జనతా పార్టీ కూటమి, నేషనల్ ఫ్రంట్, యునైటెడ్ ఫ్రంట్, ఎన్‌డిఎ, యుపిఎ, ఐఎన్‌డిఐఎ (ఇండియా) లాంటి కలయికలు కొద్దో గొప్పో ఆ కోవకు చెందినవే. దేవదానవులు ఎవరనేది వేరే సంగతి.
ఐకమత్యంగా సముద్ర మథనానికి వెళ్లి, ఉమ్మడిగా మథించసాగారు. హాలాహలమనే విషం, కామధేనువు, ఉచ్చైశ్రవమనే గుర్రం, ఐరావతం అనే ఏనుగు, కల్పవృక్షం, అప్సరసలు, చంద్రుడు, లక్ష్మీదేవి, వారుణి అనే కన్య, చివరగా ధన్వంతరి అనే దివ్యపురుషుడు ఉద్భవించారు. అతడి చేతిలో అమృత కలశం వున్నది. అంతవరకూ ఏవస్తువు విషయంలోనూ పేచీ రాలేదు. ధన్వంతరి చేతిలోని అమృత కలశాన్ని చూడగానే, దాన్ని పొందడానికి దేవదానవుల మధ్య కలహం బయల్దేరింది. విష్ణుమూర్తి మోహినీ రూపాన్ని ధరించి, దానవులు లాక్కున్న అమృత కలశాన్ని తీసుకుని, చాకచక్యంగా దేవతలను ఒక పంక్తిలోను, దానవులను వేరేపంక్తిలోను కూర్చోబెట్టి, రాక్షసులను వంచిస్తూ అమృతాన్ని దేవతలకు పోసింది. దేవదానవుల స్నేహం, శత్రుత్వంగా మారింది మళ్లీ. నేటి రాజకీయ కూటములు కూలిపోయినట్లే, అప్పట్లో జరిగింది. రాజకీయ కూటముల ప్రయత్నాలు ఫలించే పూర్వరంగంలో ఎదురయ్యే పరిస్థితులను ఇవి అద్దం పడుతున్నాయని చెప్పవచ్చు. కూటములు కట్టిన తరువాత ఫలితం అనుకూలంగా వచ్చేంతవరకు సహజీవనం చేసిన రాజకీయ పార్టీలు, అప్పటివరకూ ఏపదవి ఇచ్చినా అంగీకరించే నాయకులు, ఆ తరువాత పదవుల (ప్రధాని, లేదా ముఖ్యమంత్రి లాంటి) కోసం కుమ్ములాడుకున్నట్లే, దేవదానవుల విషయంలో జరిగింది.
ఎన్నికలలో ఆడినమాట (చేసిన వాగ్దానాలు) తప్పడం అనేది, ఒక అర్హతగా చలామణి అవుతున్న నేపథ్యంలో, వామనావతార ఘట్టం అవశ్య పఠనీయం. ‘మూడు అడుగులు’ వామనుడికి దానం ఇవ్వడానికి సిద్ధపడ్డ బలి చక్రవర్తిని గురువు శుక్రాచార్యుడు వారిస్తూ, రాజుకు ఉపద్రవం వస్తుందని, వామనుడు ముల్లోకాలు ఆక్రమిస్తాడని, బలి సమస్త సంపదలు పోతాయని, ఇచ్చిన మాట తప్పమని వాదిస్తాడు. తనకెలాంటి దుర్గతి ప్రాప్తించినా సరే, ఆడిన మాట తప్పనని స్పష్టం చేశాడు. తన మాట విననందుకు ‘పదభ్రష్టుడివి అవుతావు’ అని గురువు శుక్రాచార్యుడు శపించాడు. అయినా అన్నమాటకు కట్టుబడి కీర్తిని పొందాడు. ‘శుక్రాచార్యుడు’ లాంటివారు ఇస్తున్న సలహాలతో ఇచ్చిన వాగ్దానాలను అమలు పరచని రాజకీయ అధినేతలకు ఇదొక హెచ్చరిక. ధర్మరాజు రాజసూయ యాగం ద్వారా ఆహ్వానితులను గౌరవించే పద్ధతి తెలుసుకోవచ్చు. కురుకుల వృద్ధులు, గురూత్తములు, దుర్యోధనాదులు, బ్రాహ్మణులు, అనేకమంది రాజులు ఆహ్వానితుల్లో వున్నారు. కేవలం ‘పిలవడం కోసమే పిలిచినట్లు కాకుండా’ కార్యక్రమంలో వారిని ఉచిత రీతిలో భాగస్వాములను చేశాడు. తన సోదరులు భీముడిని, అర్జునుడిని, నకులుడిని, సహదేవుడిని, భార్య ద్రౌపదీ దేవిని నియమించినట్లే, కురు సార్వభౌముడైన దుర్యోధనుడిని, కర్ణుడిని, వారితో సమానంగా అతిథి మర్యాదలకు నియమించాడు ధర్మరాజు.
శాస్త్రోక్తంగా రాజసూయ యాగం జరిగింది. పరమాత్ముడైన శ్రీకృష్ణుడు అగ్రపూజార్హుడని సహదేవుడు అనగానే, అక్కడే వున్న శిశుపాలుడు సహించలేకపోయాడు (వర్తమాన రాజకీయ నాయకుల్లో ఈర్ష్యలు, అసూయలు గుర్తుచేసే విధంగా). అనరాని మాటలతో దూషించాడు. ఆగ్రహంతో ఊగిపోయాడు. శిశుపాలుడు ఎంతగా నిందిస్తున్నా మొదట్లో మౌనంగా వున్న శ్రీకృష్ణుడు తిట్ల పురాణం తారస్థాయికి చేరుకోవడంతో తన సుదర్శన చక్రంతో శిశుపాలుడి శిరస్సును ఖండించాడు. ఇటీవల కాలంలో ప్రత్యర్థులను పార్లమెంటరీ నిబంధనలకు విరుద్ధంగా, వ్యక్తిగత విమర్శలు చేస్తూ, అసభ్యపదజాలం వాడుతూ, అగౌరవకరమైన వ్యాఖ్యలు గుప్పిస్త్తున్న రాజకీయ నాయకులకు (ఏ ఒక్క పార్టీకి చెందిన వారో కాదు) భాగవతంలోని ఈ అంశం ఒక పాఠం.
చివరగా కుచేలోపాఖ్యానం, స్నేహధర్మాన్ని వివరిస్తుంది. ఈ కాలం కొందరు రాజకీయ నాయకుల్లాగా, సహాయం చేసినవారిని మరచిపోవడం కాకుండా, తన దగ్గరికి వచ్చిన బాల్యస్నేహితుడిని చూడగానే, తాను కూర్చున్న హంసతూలికా తల్పం దిగి, ప్రేమగా ఎదురు వెళ్లి, గట్టిగా కౌగలించుకున్నాడు. గురుకులంనాటి సంగతులు ముచ్చటించుకున్నారు. తెచ్చిన అటుకులను శ్రీకృష్ణుడికి ఇవ్వడానికి కుచేలుడు సంకోచిస్తుంటే స్వయంగా తీసుకుని పిడికెడు తిన్నాడు. ఈ రోజుల్లో అధికారంలో వున్న వారిదగ్గరికి, ఆస్తులు అంతస్తులు పెంచుకున్న వారిదగ్గరికి, గతంలో ఎంత పరిచయం వున్నప్పటికీ, ఎంత సహాయం చేసినప్పటికీ, వెళ్లాలంటే మొదలు సెక్యూరిటీ గోడలు చీల్చుకుని పోవాలి. ఫోన్లల్లో దొరకడం అసంభవం. ‘జయవిజయుల, శ్రీహరిల’ కాలం కాదిది. ఎవర్ని కలవాలన్నా వారి వ్యక్తిగత, అంతరంగిక సిబ్బంది మీద ఆధారపడి వుంటుంది. ఇంకా అదృష్టవశాత్తు ప్రభుత్వ కార్యాలయాలకు చేరని, ఇటీవల కాలంలోని మరో జాడ్యం, ‘బౌన్సర్ల’ బెడద. ఈ వ్యవస్థకు చట్టబద్ధత ఉన్నదో, లేదో కాని, చట్టాన్ని చేతులో తీసుకునే అధికారం (పోనీ దక్షత, నేర్పు, కండ బలం) వున్నట్లు అనుమానం మాత్రం కలుగుతున్నది. ‘మౌనమే నీ భాష, ఓ మూగ మనసా’!!!
వనం జ్వాలా నరసింహారావు