ప్రతి యుద్ధానికి అనాథలు ఉంటారు. ప్రతి సంఘర్షణ దాని మచ్చలను అమాయకులపై వదిలేస్తుంది. ఈ మాట ప్రపంచంలో గతంలో జరిగినా, వర్తమానంలో జరుగుతున్నా, భవిష్యత్‌లో జరగబోయే యుద్ధాలు మిగిల్చే కన్నీటి గాథల గురించే. యుద్ధాలు మిగిల్చే విషాదంలో అత్యంత భయానకమైన జీవితాలు అనాథలదే. అహంకారపూరితమైన ఆధిపత్య కోసం, సంఘర్షణల కారణంగా జరుగుతున్న యుద్ధ భూమిలోని పోరు కోట్లమంది అనాథలను మిగిల్చిపోతుంది. ఈ కన్నీటి ఆవేదనకు ముగింపు ఎక్కడో తెలియక బిక్కుబిక్కుమంటున్న అనాథ పిల్లలు కారుస్తున్న కోట్ల క్యూసెక్కుల కన్నీరుకు కారకులెవ్వరో…అన్ని దేశాలకు తెలిసినా వారికి అడ్డుకట్ట వేసి శాంతి మార్గం వైపు నడిపించేందుకు ఆయా దేశాలు ఇప్పటికీ సమాయత్తం కాకపోవడం ప్రపంచ మానవ సమాజంలో ఓ విషాద పరిణామం. గత రెండు మూడు సంవత్సరాల నుండి పలు దేశాలు, వర్గాల మధ్య జరుగుతున్న యుద్ధాలు సంఘర్షణలో లక్షలాది మంది పిల్లలు అనాథలుగా మారుతున్నారు. గాజా -ఇజ్రాయెల్, రష్యా- ఉక్రెయిన్, ఆర్మేనియా – అజర్ బైజాన్, అఫ్ఘానిస్తాన్, ఇథియోపియాలోని టిగ్రే ప్రాంతాల్లోని వర్గాల మధ్య యుద్ధాలు, ఘర్షణల కారణంగా యుద్ధ అనాథల సంఖ్య గణనీయంగా పెరుగుతున్నది. యూనిసెఫ్ లెక్కల ప్రకారం యుద్ధాలు మిగిల్చిన విషాదం కారణంగా 140 మిలియన్లకు పైగా అనాథలుండగా, అత్యధికంగా ఆసియా ఖండంలోనే 61 మిలియన్ల మంది అనాథలు ఉన్నారు. 18 శతాబ్దం నుండి 20వ శతాబ్దం ప్రారంభంలో జరిగిన యుద్ధాల్లో బాధితుల సంఖ్య 2001 వరకు క్రమంగా పెరిగింది. మొదటి, రెండవ ప్రపంచ యుద్ధ సమయాల్లో అధికారిక అంచనాల ప్రకారం పోలాండ్‌లో 30 లక్షల మంది, యుగోస్లేవియాలో 2 లక్షల మంది పిల్లలు అనాథలు అయినట్లు లెక్కలు తేలాయి. ప్రపంచ యుద్ధాలలో 1990 నాటికి అనాథ బాధితుల సంఖ్య 146 మిలియన్లులుండగా, 1995 నాటికి 151 మిలియన్లు, 2000 నాటికి 155 మిలియన్లకు బాధితులు చేరుకోవడం విషాదకరమైన పరిణామం. సేవ్ ది చిల్డ్రన్ లెక్కల ప్రకారం ప్రపంచంలో ఆరు మంది పిల్లల్లో ఒక్కరు యుద్ధాలు, వర్గాల సంఘర్షణ జోన్‌లో నివసిస్తున్నారు. ప్రపంచంలో పది దేశాలు అఫ్ఘానిస్తాన్, కాంగో, సిరియా, యెమెన్, సోమాలియా, మాలి, నైజీరియా, కామెరూన్, సూడాన్, సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ దేశాల్లో నివసిస్తున్న పిల్లలు ఈ ఘర్షణల కారణంగా అత్యంత ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉన్నారని అంతర్జాతీయ బాలల హక్కుల సంస్ధ గతంలో ప్రకటించింది. సూడాన్‌లో ప్రతి వంద మంది చిన్నారుల్లో 10 మంది అనాథాశ్రమాల్లో మగ్గిపోతున్నారు.
ఇటీవల రష్యా సుమారు 14 వేల ఉక్రెయిన్ కుటుంబాల పిల్లలను విడదీసి తమ యుద్ధ క్యాంపులకు తరలించుకుపోయినట్లు తెలుస్తుంది. ప్రపంచంలో ప్రతి దేశంలో ఏదో రూపంలో జరిగిన యుద్ధాలు, ఘర్షణల ఫలితంగా తల్లిదండ్రులును కోల్పోయిన పిల్లలు అనాథలుగా, జీవచ్ఛావాలుగా బతుకీడుస్తున్నారు. ప్రపంచంలోని యుద్ధ అనాథల సంక్షేమానికి ఎస్‌ఒఎస్ ఎన్ఫాంట్స్ ఎన్ డెట్రాసెస్’ అనే ఫ్రెంచ్ సంస్ధ నడుం బిగించింది. ప్రతి సంవత్సరం యుద్ధ అనాథల దినోత్సవాన్ని (వరల్డ్ డే ఆఫ్ వార్ ఆర్ఫాన్స్) నిర్వహిస్తుంది. యుద్ధాల సమయంలో అనాథలైన పిల్లల గురించి అవగాహన కల్పించడం, పిల్లల మానవ హక్కులను పరిరక్షించేలా కార్యక్రమాలు రూపొందించడంతో పాటు బలహీన వ్యక్తులకు మద్దతు, రక్షణ అవసరాన్ని చాటిచెప్పేలా చేయడం, వారి అవసరాలను తీర్చి ఉత్తములుగా ఎలా తీర్చిదిద్దాలనే సంకల్పంతో ఈ సంస్థ పనిచేస్తుంది. మిగిలిన పిల్లలలాగే యుద్ధంలో అనాథలైన పిల్లలు కూడా తమ హక్కుల కోసం, స్వేచ్ఛగా జీవించాల్సిన భరోసాని, తమ హృదయాల్లో పడిన గాయాలు తొలగేలా సమాజ జీవనంలో వారిని ఉన్నతంగా ఎదిగేలా చేయాల్సిన బాధ్యత ప్రపంచంలోని అన్ని దేశాలకు ఉంది. సమష్టిగా ప్రపంచ దేశాలు చేతులు కలిపి వారిని ఆదుకోవాల్సిన అవసరం ఉంది. యుద్ధ అనాథలు అనారోగ్యం బారినపడటంతో పాటు లైంగిక దోపిడీకి, మానవ అక్రమ రవాణాకు గురవుతున్నారు. భిక్షాటన ముఠాలు వారిని ఆదాయ వనరులుగా మార్చుకుంటున్నారు. కొన్ని దేశాలు ఈ బాలలను బాల సైనికులుగా మార్చి యుద్ధ భూమి లో బలి పశువులను చేస్తున్నారు. ప్రపంచ యుద్ధ అనాథల దినోత్సవం అంటే జ్ఞాపకార్ధం కోసమో, స్మరించుకొనే రోజే కాదు. ఇది అనాథల కోసం అండగా నిలిచే చర్యలకు, సహాయాలకు నడుం కట్టించే పిలుపు. యుద్ధంలో తమ తల్లి దండ్రులను కోల్పోయిన పిల్లవాడి అక్రందనను, హృదయ గాయాలను మాన్పించే సమష్టి సమాజం కోసం పయనించాల్సిన సందర్భాన్ని ఎలుగెత్తి చాటే ఓ ఓదార్పు. సంఘర్షణకు గురైన అమాయక బాధితులకు ఓ వెలుగునిచ్చే ప్రయాణం కోసం అడుగులు వేయాల్సిన మానవీయ కోణం. కోట్ల మంది యుద్ధ అనాథ బాలల ఉజ్వల భవిష్యత్ కోసం అవగాహన పెంచడానికి ప్రపంచ యుద్ధ అనాథల దినోత్సవం వారి జీవితాల్లో ప్రేమను పంచే ఓ కాంతిరేఖ. ‘ప్రపంచంలో చాలా మంది చిన్నరొట్టె ముక్క కోసం చనిపోతున్నారు, కానీ చిన్నప్రేమ కోసం ఇంకా చాలా మంది చనిపోతున్నారు’ అన్న మదర్ థెరిస్సా వాక్కులు ఒక్కసారి గుర్తుచేసుకోవాల్సిన సందర్భం ఇది.
అడపా దుర్గ 90007 25566