కేరళ: రాష్ట్రంలోని శబరిమల అయ్యప్పస్వామి ఆలయాన్ని సందర్శించే యాత్రికులకు ఉచిత ప్రమాద బీమా ప్రకటించారు ఆలయ అధికారులు. రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన యాత్రికులకు రూ.5 లక్షల పరిహారం ఇవ్వనున్నట్లు వెల్లడించారు. యాత్రికుల నుంచి ఎలాంటి రుసుము వసూలు చేయడం లేదని టీడీబీ తెలిపింది. కాగా, ఆదివారం శబరిమల ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఈనెల 14న మకర జ్యోతి దర్శనం కోసం ఆధిక సంఖ్యలో భక్తులు ఆలయానికి తరలి వెళ్తున్నారు. దీంతో పంబ వరకు అయ్యప్ప భక్తుల క్యూ లైన్ చేరుకుంది.
భక్తుల రద్దీతో అయ్యప్ప దర్శనానికి 12 గంటలకు పైగా సమయం పడుతోందని ఆలయ అధికారులు చెబుతున్నారు. రద్దీ కారణంగా 4 వేల మందికి మాత్రమే స్పాట్ దర్శనం కల్పిస్తున్నారు. రేపటి నుంచి ఆన్‌లైన్ దర్శనాలు కుదించనున్నట్లు తెలుస్తోంది. రేపు 50 వేల మందికి, 14న 40 వేల మందికి, ఈనెల 15న 60 వేల మందికి ఆన్‌లైన్ దర్శన సదుపాయం కల్పించనున్నారు. భక్తులు భారీగా తరలివస్తుండటంతో అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.