Monday, January 13, 2025

విద్యాధిక నిరుద్యోగ యువతకు నెలకు రూ. 8500

- Advertisement -
- Advertisement -

ఢిల్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ వాగ్దానం
ఇది ఉచితం కాదని, ఆర్థిక సహాయమని వివరణ

న్యూఢిల్లీ : ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల అనంతరం తాము అధికారంలోకి వచ్చిన పక్షంలో విద్యాధిక నిరుద్యోగ యువజనులకు ఒక ఏడాది పాటు ప్రతి నెల రూ. 8500 అందజేస్తామని కాంగ్రెస్ ఆదివారం వాగ్దానం చేసింది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రారంభించిన మూడవ పథకం ఇది. ‘యువ ఉడాన్ యోజన’ కింద ఆర్థిక సహాయం అందజేయనున్నామని, ఇది ఉచితం కాదని ఎఐసిసి ప్రధాన కార్యదర్శి సచిన్ పైలట్ విలేకరుల గోష్ఠిలో స్పష్టం చేశారు. ‘ఒక కంపెనీ, ఫ్యాక్టరీ లేదా సంస్థలో తమ నైపుణ్యం ప్రదర్శించే యువజనులకు మేము ఆర్థిక సహాయం అందజేస్తాం.

వారు ఆ సంస్థల ద్వారా డబ్బు అందుకుంటారు. ఇంటి దగ్గర కూర్చుని ఎవరైనా డబ్బు అందుకునే పథకం కాదు ఇది’అని పైలట్ వివరించారు. ‘ఈ సహాయం కేవలం ఆర్థికం కాదు. తాము శిక్షణ పొందిన రంగాల్లో వారు కుదురుకునేందుకు మేము ప్రయత్నిస్తాం& దాని వల్ల వారు తమ నైపుణ్యాన్ని మెరుగుపరచుకోవచ్చు’ అని పైలట్ పేర్కొన్నారు. ఎఐసిసి ఢిల్లీ ఇన్‌చార్జి ఖాజీ నిజాముద్దీన్, ఢిల్లీ కాంగ్రెస్ అధ్యక్షుడు దేవేందర్ యాదవ్, కాంగ్రెస్ విద్యార్థి విభాగం ఎన్‌ఎస్‌యుఐ అధ్యక్షుడు వరుణ్ చౌదరి కూడా విలేకరుల గోష్ఠికి హాజరయ్యారు. ఈ పథకానికి సంబంధించిన పోస్టర్‌ను కూడా ఆ నేతలు విలేకరుల గోష్ఠిలో ఆవిష్కరించారు. కాంగ్రెస్ మహిళల కోసం నెలకు రూ. 2500 ఆర్థిక సహాయం వాగ్దానం చేస్తూ ఈ నెల 6న ‘ప్యారీ దీదీ యోజన’ను, రూ. 25 లక్షల వరకు ఉచిత ఆరోగ్య బీమా సౌకర్యాన్ని వాగ్దానం చేస్తూ 8న ‘జీవన్ రక్షా యోజన’ను ప్రకటించిన విషయం విదితమే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News