పథనంథిట్ట (కేరళ) : స్వామి అయ్యప్ప పవిత్ర ఆభరణాలు ‘తిరువాభరణం’ తీసుకువెళ్లే వార్షిక ఉత్సవ యాత్ర ఆదివారం పథనంథిట్టలోని పందలంలో ఒక ఆలయంలో నుంచి శబరిమలకు బయలుదేరింది. ఆ పవిత్ర ఆభరణాలను ఈ నెల 14న, ‘మకరవిళక్కు’ ఉత్సవం రోజు స్వామి అయ్యప్పకు అలంకరించనున్నారు. ట్రావన్‌కూర్ దేవస్వమ్ బోర్డ్ (టిడిబి) ప్రతినిధులతో పాటు అనేక మంది అయ్యప్ప భక్తులు కూడా ‘తిరువాభరణం ఘోషాయాత్ర’ వెంట శబరిమల ఆలయానికి సాగారు.
దశాబ్దాలుగా పాటిస్తున్న సంప్రదాయం ప్రకారం, పందలంలోని స్రాంబిక్కల్ ప్యాలెస్‌లోని ఖజానా నుంచి పక్రనే ఉన్న వలియకోయిక్కల్ సస్థ ఆలయానికి ఉదయం భక్తుల దర్శనార్థం తిరువాభరణాన్ని తరలించారు. టిడిబి అధికారులు ప్యాలెస్ అధికారుల నుంచి ఆభరణాలు స్వీకరించి సస్థ ఆలయానికి తీసుకువెళ్లారు. వాటిని తిలకించి, పూజలు చేసేందుకు అనేక మంది భక్తులు అక్కడికి చేరారు. ‘స్వామియే శరణం అయ్యప్ప’ ఉచ్చాటనల మధ్య సాంప్రదాయక తంతు, పూజలు నిర్వహించిన తదుపరి పవిత్ర ఆభరణాలను చెక్క పేటికలలో పెట్టి శబరిమలకు తీసుకువెళ్లారు.