తమిళనాడు తరహాలో సమిష్టిగా
అభివృద్ధికి కృషిచేద్దాం నాకు
భేషజాలు లేవు.. సలహాలిస్తే
స్వీకరిస్తా మెట్రో విస్తరణకు
కేంద్రం ఆమోద ముద్ర వేయాలి
అభివృద్ధిలో అమరావతితో కాదు..
న్యూయార్క్, టోక్యోతో
పోటీ పడదాం చట్టసభలలో
ప్రజాస్వామ్య స్ఫూర్తి కొరవడు
తోంది మేం ఒక్కర్ని కూడా
అసెంబ్లీ నుంచి సస్పెండ్
చేయలేదు వర్తమాన
రాజకీయాలకు విద్యాసాగర్‌రావు,
వైఎస్ఆర్ స్ఫూర్తి ‘ఉనిక’
పుస్తకావిష్కరణ సభలో
సిఎం రేవంత్ వ్యాఖ్యలు
హైడ్రా భేష్: విద్యాసాగర్‌రావు
ఇప్పుడు ఏదో ఒక పదవి కోసం పార్టీలు మారుతున్నారు. విద్యార్థి దశలో సిద్ధాంతపరమైన రాజకీయాలు అలవడితే ఒక పార్టీకి కట్టుబడి ఉంటారు. అలాంటి రాజకీయాలను పునరుద్ధరించాల్సిన అవసరం ఉంది. కాలక్రమేణ ప్రజాస్వామిక స్ఫూర్తిని కోల్పోతున్నాం. ప్రభుత్వ లోపాలను ఎత్తిచూపడం విపక్షం బాధ్యత.
మన తెలంగాణ/హైదరాబాద్ : తమిళనాడు తరహాలో రాజకీయంగా ఎన్ని వైరుధ్యాలు ఉన్నప్పటికీ రాష్ట్రానికి సంబంధించిన అంశాల్లో సమిష్టిగా కలిసి పనిచేద్దామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విపక్షాలకు పిలుపునిచ్చారు. రాష్ట్ర అభివృద్ధికి అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని విజ్ఞప్తి చేసారు. పార్టీలకు అతీతంగా అందరూ కలిసికట్టుగా నడవాల్సిన అవసరం ఉందని ఇందుకు తమిళనాడు రాష్ట్ర రాజకీయాలను మార్గదర్శకంగా తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. హైదరాబాద్‌లో ఆదివారం జరిగిన ఒక కార్యక్రమంలో మహారాష్ట్ర మాజీ గవర్నర్ చెన్నమనేని విద్యాసాగర్ రావు (సాగర్ జీ) ఆత్మకథ ‘ఉనిక’ పుస్తకాన్ని ముఖ్యమంత్రి ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ, కేంద్రం నుంచి రాష్ట్రానికి రావలసిన, కావలసిన నిధులను తెచ్చుకోవడంలో అన్ని పార్టీలు సహకరించాలని కోరారు. తనకు భేషజాలు లేవని, తెలంగాణ కోసం ఎవరినైనా కలుస్తా, అందరి సహకారం తీసుకుంటానని అన్నారు. తెలంగాణ అభివృద్ధిని ఇప్పుడు విస్మరిస్తే మరెప్పుడూ ముందుకుపోలేమని అన్నారు. దేశాన్ని 5 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థగా తయారు చేయడంలో తెలంగాణ వంతు సహకరించడానికి సిద్ధంగా ఉన్నామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి చెప్పానని, ఆ సాధన దిశగా తెలంగాణలో అభివృద్ధి పనులకు కేంద్రం సహకరించాల్సిన అవసరం ఉందని చెప్పారు. తెలంగాణకు పోర్టు లేని కారణంగా డ్రైపోర్టుకు అనుమతి ఇవ్వాలని, అలాగే సమీపంలోని బందరు రేవుకు కనెక్టివిటీ ఉండాలన్న విషయాన్ని కూడా ప్రధాని దృష్టికి తెచ్చామన్నారు.
కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీని అంశాన్ని కూడా ప్రధాని సహకారం కోరామని, ఇలాంటి విషయాల్లో తెలంగాణకు చెందిన కేంద్ర మంత్రులు, ఎంపీలు సహకరించాలని కోరారు.హైదరాబాద్‌ను విశ్వ నగరంగా తీర్చిదిద్దాలంటే మెట్రో రైలు, రీజినల్ రింగ్ రోడ్డు, రీజినల్ రింగ్ రైల్ వంటి ప్రాజెక్టులు అవసరమని అన్నారు. హైదరాబాద్ మెట్రో దేశంలోనే రెండో స్థానంలో ఉండగా, గడిచిన పదేళ్లలో ఎలాంటి ప్రగతి లేని కారణంగా 9 వ స్థానానికి పడిపోయిందని, కేంద్ర మంత్రిమండలి రాబోయే సమావేశంలో మెట్రో విస్తరణకు ఆమోదముద్ర పడేలా బీజేపీ నాయకులు చొరవ చూపాలని సీఎం రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి చేసారు.
తెలంగాణలో 60 శాతం ఆదాయం హైదరాబాద్ నగరం నుంచే వస్తోందని, హైదరాబాద్ దేశంలోని ఏ ఇతర నగరాలతో కాకుండా న్యూయార్క్, టోక్యో వంటి నగరాలతో పోటీ పడుదామని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. విద్యార్థుల్లో నైపుణ్యం పెంచడం కోసం రాష్ట్రంలో 75 ఐటీఐలను ఏటీసీలుగా మార్చడం, ఆనంద్ మహీంద్రా నేతృత్వంలో యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ఏర్పాటు, దాని ఆవశ్యకత, క్రీడల అభివృద్ధికి స్పోరట్స్ యూనివర్సిటీ, స్పోరట్స్ అకాడమీ వంటి పలు కీలక అంశాలను వేదిక నుంచి సీఎం రేవంత్‌రెడ్డి వివరించారు.
తెలంగాణ ఉద్యమంలో ఉస్మానియా, కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులు ముందుండి పోరాటాలు చేశారని సీఎం రేవంత్‌రెడ్డి గుర్తుచేస్తూ ప్రత్యేక రాష్ట్రంలో ఉన్నామంటే విద్యార్థులు రాజకీయాల్లో అత్యంత క్రియాశీలకంగా వ్యవహరించడమేనని అన్నారు. సిద్ధాంతాలకు కట్టుబడి ఉండే పార్టీలకు కట్టుబడుతారు. విద్యార్థి దశలో సిద్దాంతపరమైన రాజకీయాలు చేస్తే పార్టీకి కట్టుబడి ఉంటారని, అలాంటి రాజకీయాలను పునరుద్ధరించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం యూనివర్సిటీ లు ఉనికి కోల్పోయేలా ఉన్నాయని సీఎం రేవంత్‌రెడ్డి ఆందోళన వ్యక్తం చేసారు. యూనివర్సిటీల్లో విద్యార్థులు రాజకీయాల్లో ఉండటం అవసరం.. ముఖ్యమంత్రి కాగానే యూనివర్సిటీ లకు పూర్వవైభవం తీసుకురావడం కోసం నిర్ణయాలు తీసుకున్నానని అన్నారు. తెలంగాణ ఉద్యమంలో యూనివర్సిటీ విద్యార్థులు ముందుండి పోరాటాలు చేశారని అన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో ఉన్నామంటే విద్యార్థులు రాజకీయాల్లో అత్యంత క్రియాశీలకంగా వ్యవహరించడం వల్లనే అని అన్నారు. రాజకీయాల్లో సిద్దాంతపరమైన భావజాలం లేకపోవడం వల్లనే ఈనాడు పార్టీ ఫిరాయింపులు జరుగుతున్నాయని సీఎం రేవంత్‌రెడ్డి అభిప్రాయపడ్డారు.
ఏదో ఒక పదవి కోసం పార్టీలు మారుతున్నాయి..విద్యార్థి దశలో సిద్దాంతపరమైన రాజకీయాలు చేస్తే పార్టీ కి కట్టుబడి ఉంటారు..సిద్దాంతపరమైన విద్యార్థి రాజకీయాలను రాష్ట్రంలో పునరుద్దించాల్సిన అవసరం ఉందన్నారు. రాజకీయాల్లో రాణించాలని భావించే వారు ఉనిక పుస్తకాన్ని చదవాలి..
చట్టసభలలో ప్రజాస్వామ్య స్ఫూర్తి కొరవడుతోంది
చట్టసభల్లో ప్రభుత్వ వైఫల్యాలను ప్రతిపక్షం ఎత్తి చూపించాలని, కాలక్రమేణా ప్రజాస్వామ్య స్ఫూర్తిని కోల్పోతున్నామని, ప్రజాస్వామిక స్ఫూర్తిని ప్రదర్శించాలన్న ఉద్దేశంతోనే గత 13 నెలల్లో జరిగిన అసెంబ్లీ తీరుతెన్నులే ఉదహారణ అన్నారు.
నా 35 ఏళ్ల జీవితంలో నేను ఆదర్శంగా తీసుకున్న వారందరిని ఒకే వేదిక మీద కలిసే అవకాశం వచ్చిందన్నారు. మూడో తరంలో చెప్పుకోదగిన నాయకులు లేకుండా పోయారు.. అసెంబ్లీలో ముఖ్యమంత్రి తో పాటు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు వేలు చూపిస్తే స్పీకర్ మైక్ ఇవ్వాలన్నారు. ప్రభుత్వం అంటే ప్రతిపక్షం, పాలక పక్షం మొత్తం 119 మంది ఎమ్మెల్యేలు కలిస్తేనే ప్రభుత్వమని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ప్రభుత్వంలోని లోపాలను ఎత్తి చూపించడం ప్రతిపక్షం పాత్ర అని..కాల క్రమేణా ప్రజాస్వామ్య స్ఫూర్తి ని కోల్పోతున్నామని అన్నారు.
పాలక పక్షానికి, ప్రతిపక్షానికి మధ్య సభలో ప్రతిష్టంభన వచ్చినప్పుడు కమ్యూనిస్టులు, బీజేపీ పార్టీ లు సలహాలు, సూచనలు ఇచ్చేవి.. ఇప్పుడు మా ప్రభుత్వం ప్రజాస్వామ్య స్ఫూర్తి ని చూపిస్తోంది..13 నెలల్లో ఇప్పటి వరకు అసెంబ్లీ నుంచి ప్రతిపక్ష సభ్యులను మా ప్రభుత్వం బహిష్కరించలేదని సీఎం రేవంత్‌రెడ్డి గుర్తు చేసారు.
వర్తమాన రాజకీయాలకు సాగర్జీ, వైఎస్ స్ఫూర్తి
ఉత్తర తెలంగాణ ప్రాంతం సస్యశ్యామలం కావాలంటే గోదావరి జలాలు తీసుకురావాలని సాగర్ జీ (సిహెచ్ విద్యాసాగర్‌రావు) పాదయాత్ర చేశారని, అలాగే గోదావరి జలాల వినియోగం కోసం వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రాణహిత, చేవెళ్ల ప్రాజెక్టును తీసుకొచ్చారని అన్నారు.గోదావరి జలాల వినియోగంపై సాగర్ జీ సలహాలు, సూచనలు ఎంతో అవసరమని, మహారాష్ట్రలో మునుగుతున్న భూములకు సంబంధించిన ఆ రాష్ట్ర ముఖ్యమంత్రితో మాట్లాడమని గతంలో నేను సాగర్ జీని కోరిన విషయాన్ని సీఎం రేవంత్‌రెడ్డి గుర్తు చేసారు. సాగర్ జీ గవర్నర్‌గా మహారాష్ట్ర, తమిళనాడు రెండు రాష్ట్రాల్లో సమర్థవంతంగా పనిచేసి తెలంగాణ గౌరవాన్ని నిలబెట్టారని సీఎం రేవంత్‌రెడ్డి కొనియాడారు. రాజకీయాల్లో రాణించాలని భావించే వారు ఉనిక పుస్తకాన్ని చదవాలని అన్నారు.ఐదు దశాబ్దాల పాటు రాజకీయ జీవితం గడిపిన విద్యాసాగర్ రావు ఒక్క ఆరోపణ ఎదుర్కొక పోవడం అభినందనీయమని అన్నారు. తెలంగాణ సమాజానికి ఆదర్శంగా నిలబడే రాజకీయ వేత్త గా ఉన్నారు.. ఉస్మానియా యూనివర్సిటీ రాజకీయాల్లో జార్జి రెడ్డి, విద్యాసాగర్ రావు నమ్మిన సిద్ధాంతం కోసం గట్టిగా నిలబడ్డారని సీఎం రేవంత్‌రెడ్డి గుర్తు చేసారు.
హైడ్రా ప్రశంసానీయం : విద్యాసాగర్‌రావు కితాబు
హైడ్రాను అందరూ ప్రశంసిస్తున్నారని, హైదరాబాద్ నగరాని సందరంగా నిర్మించుకోవడానికి సీఎం రేవంత్‌రెడ్డి ముందుకు వెళ్లడం అభినందనీయమని సిహెచ్ విద్యాసాగర్‌రావు అన్నారు. మూసీ నదిని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందన్నారు.కోనేరు రంగారావు సిఫారసులను అమలు చేయడం వంటి పనులు చేస్తే ప్రజలు హర్షిస్తారని,అలాగే గిరిజనుల భూ హక్కులను కాపాడాలని ఇలాంటి ప్రజలు సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వానికి సహకరిస్తారని అన్నారు. పాలక, ప్రతిప్రతిపక్షాలు కొన్ని సందార్భాలలో అయినా కలిసి పని చేయాలని విద్యాసాగర్‌రావు సూచించారు.
గతంలో ఎన్టీఆర్ సీఎం గా ఉన్నప్పుడు ప్రపతిపక్షం పెట్టిన ప్రైవేట్ బిల్లు పాసు చేసిన సందర్భాలు ఉన్నాయని గుర్తు చేసారు.
ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, ఒడిసా గవర్నర్ కే. హరిబాబు, కేంద్ర మంత్రి బండి సంజయ్, రాష్ట్ర మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు , పొన్నం ప్రభాకర్, ఎంపీ కే. లక్ష్మణ్, మాజీ ఎంపీలు టీ. సుబ్బిరామిరెడ్డి, బి.వినోద్ కుమార్‌తో పాటు ఇతర సీనియర్ నాయకులు, సీనియర్ పాత్రికేయులు, మన తెలంగాణ పత్రిక ఎడిటర్ దేవులపల్లి అమర్ తదితరులు పాల్గొన్నారు.