హైదరాబాద్ నుంచి జిల్లాలకు తరలిన జనం
సంక్రాంతి రద్దీతో రోడ్లన్నీ కిటకిట ఒక్కరోజే ఐదు
లక్షల మందికి పైగా ఆంధ్రప్రదేశ్‌కు పయనం
రైళ్లు, బస్సులు, ప్రైవేట్ వాహనాల్లో ఎడతెగని రద్దీ
టోల్ ప్లాజాల వద్ద వాహనాల బారులు
బోసిపోయిన హైదరాబాద్ వీధులు
మన తెలంగాణ/హైదరాబాద్: సంక్రాంతి పండుగను సొంతూరిలో జరుపుకునేందుకు హైదరాబాద్ నుంచి తెలుగు రాష్ట్రాల ప్రజలు రికార్డు స్థాయిలో ప్రయాణికులు తరలివెళ్లారు. దీం తో ప్రధాన రహదారులన్నీ రద్దీగా మారాయి. బస్సులు, రైళ్లు కిక్కిరిసిపోయాయి. ఈ క్రమం లో హైదరాబాద్‌విజయవాడ 65వ జాతీయ రహదారిపై సంక్రాంతి వాహనాల రద్దీ కొనసాగుతోంది. పంతంగి, కొర్లపాడు టోల్ ప్లాజా వద్ద వాహనాలు బారులు తీరాయి. నెమ్మదిగా ముందుకు కదులుతున్నాయి. ట్రాఫిక్‌తో నిదానంగా వాహనాల ప్రయాణం సాగుతోంది. రవాణా అధికారుల అంచనా ప్రకారం ఒక్కరోజే 5 లక్షల మంది హైదరాబాద్ నుంచి విజయవాడ కు బయలుదేరారు.
ఆర్టీసీ బస్సులు, ప్రైవేటు బస్సులు, రైళ్లు, విమానాల ద్వారా దాదాపు 2లక్షల మంది, మరో 2లక్షల మంది తమ సొంత వాహనాలు, క్యాబ్‌ల్లో వెళ్లారు. విపరీతమైన రద్దీ నేపథ్యంలో చిల్లకల్లు, కీసర టోల్‌ప్లాజాల వద్ద భారీ సంఖ్యలో వాహనాలు బారులు తీరాయి. వరుస సెలవులు రావడంతో ఉద్యోగులు, పిల్లలు అందరూ పండుగ సంబురాలను సొంతూరులో జరుపుకోవడానికి పట్నం వాసులు పల్లె బాట పట్టారు. బారులు తీరిన బస్సులు కిక్కిరిసిన ప్రయాణికులతో బస్‌స్టేషన్లు, రైల్వే స్టేషన్లు జనంతో కిటకిటలాడాయి. మహాత్మాగాంధీ బస్‌స్టేషన్ (ఎంజీబీఎస్), జూబ్లీ బస్‌స్టేషన్(జేబీఎస్)లలో అడుగు తీస్తే అడుగుపెట్టలేని పరిస్థితి కనిపించింది. సికింద్రాబాద్, కాచిగూడ, నాంపల్లి రైల్వే స్టేషన్లు కూడా జనంతో కిక్కిరిసిపోయాయి. ఇక ప్రైవేటు వాహనాలు, సొంత వాహనాల్లో పల్లెలకు పోయే ప్రయాణికులతో నగర శివార్లలోని రోడ్లన్నీ రద్దీగా మారాయి. ఉప్పల్ క్రాస్ రోడ్స్, ఆరాంఘర్, ఎల్బీనగర్ క్రాస్ రోడ్స్, కెపిహెచ్‌బి, బోయిన్‌పల్లి, గచ్చిబౌలి ప్రాంతాల నుంచి టీజీఎ్‌సఆర్టీసీ ప్రత్యేక సర్వీసులను నడుపుతోంది. పెద్దఅంబర్‌పేట నుంచి చౌటుప్పల్ వరకు 32 కిలోమీటర్ల మార్గంలో ప్రయాణానికి మూడు గంటల సమయం పట్టిందని ఈ సందర్భంగా ఓ ప్రయాణికుడు వాపోయారు.
అబ్దుల్లాపూర్‌మెట్ వద్ద రోడ్డు ఇరుకుగా ఉండటంతో వాహనాలు నెమ్మదించాయి. ట్రాఫిక్ సాఫీగా సాగేలా పోలీసులు చర్యలు తీసుకున్నారు. చౌటుప్పల్, సూర్యాపేట పట్టణంలో ఎన్‌హెచ్-65పై ప్లైఓవర్లు నిర్మిస్తున్నందున ఆయా ప్రాంతాల్లో ట్రాఫిక్ భారీగా స్తంభించింది. గత ఏడాదితో పోల్చితే ఏపీ వైపు వెళ్లే వాహనాల సంఖ్య 30 శాతం పెరిగినట్లు పోలీసు అధికారులు పేర్కొన్నారు. వాహనాల రాకపోకలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా పకడ్బందీ ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. పం డుగ సందర్భంగా సికింద్రాబాద్ పరిసరాల నుంచి చర్లపల్లి టెర్మినల్‌కు వెళ్లి వచ్చేందుకు ఆర్టీసీ 146 సీటీ బస్సులను నడుపుతోంది. ఇక పండుగ కోసం రెండు నెలల ముందుగానే రైళ్లలో వెళ్లడానికి రిజర్వేషన్ కోసం ప్రయత్నిస్తే దొరకకపోవడంతో ప్రయాణికులకు అవస్థలు తప్పలేదు.
బోసిపోయిన హైదరాబాద్.. రోడ్లన్నీ నిర్మానుష్యం…
ఇదిలా ఉండగా, హైదరాబాద్ వాసులు సొంతూళ్లు బాట పట్టడంటో నగరం నిర్మా నుష్యంగా మారింది. నిత్యం రద్దీగా ఉండే మాదాపూర్ పరిసర ప్రాంతాలలో రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. సాధారణ రోజుల్లో హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలు తెలియనవి కాదు. అయితే, సంక్రాంతి పండుగ, వరుస సెలవుల నేపథ్యంలో ఈ మారు పూర్తిస్థాయిలో ప్రజలంతా తమ సొంతూళ్ల బాట పట్టారు. ఎల్లవేళలా రద్దీగా ఉండే నగరంగా పేరొందిన హైదరాబాద్ నగరం బోసిపోయింది. శుక్ర, శని వారాల్లో ఒక మోస్తరుగా జనసంచారం కనిపించినా ఆదివారం కావడంతో మిగిలిన వారు కూడా పల్లె బాట పట్టడంతో హైదరాబాద్ నగరం పూర్తిస్థాయిలో ఖాళీ అయ్యిందని చెబుతున్నారు. ఇక్కడ అనునిత్యం కనిపించే ట్రాఫిక్ కష్టాలు నేడు విజయవాడకు తరలివెళ్లే క్రమంలో ఆయా టోల్ ప్లాజాల వద్ద కనిపిస్తుండటం గమనార్హం.