చత్తీస్‌గఢ్‌లో ఎదురుకాల్పులు
నలుగురు మావోయిస్టుల మృతి
మన తెలంగాణ/చర్ల: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం, బీజాపూర్ జిల్లాలో పోలీసు బలగాలు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎన్‌కౌంటర్‌లో నలుగురు మావోలు మృతి చెందారు. ఈ ఘటన మద్దెడ్ ప్రాంతంలోని బందేపరా ప్రాంతంలో ఆదివారం చోటుచేసుకుంది. నిఘావర్గాల పక్కా సమాచారం మేరకు ఆదివారం ఉదయం సిఆర్‌పిఎఫ్, డిఆర్‌జి, పోలీస్ బలగాలు సంయుక్త ఆపరేషన్‌లో భాగంగా సెర్చ్ ఆపరేషన్ చేస్తున్నాయి.
ఈ క్రమంలో నేషనల్ పార్క్ ఏరియా కమిటీకి చెందిన మావోయిస్టులు తారసపడటంతో వారిమధ్య ఎదురు కాల్పులు చోటుచేసుకున్నాయి. కాల్పుల్లో మృతి చెందిన వారిలో కొందరు డివిసిఎం (డివిజనల్ కమిటీ మెంబర్) క్యాడర్‌కు చెందినవారు ఉన్నారు. ఛత్తీస్‌గఢ్‌లో ఈ కేడర్‌కు చెందిన నక్సలైట్లపై రూ.8 లక్షల రివార్డు ఉంది. ఘటనా స్థలం నుంచి భారీగా ఆటోమేటిక్ ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనను ఎస్‌పి జితేంద్ర ధృవీకరించారు.