కరీంనగర్: హుజూరాబాద్ బిఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డిపై మరోసారి కేసు నమోదు అయ్యింది. ఆదివారం జిల్లా కలెక్టరేట్ లో జరిగిన సమీక్షా సమావేశంలో జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పై దురుసుగా ప్రవర్తించారు పాడి కౌశిక్ రెడ్డి. దీంతో ఆయనపై పలు సెక్షన్ల కింద మూడు కేసులు నమోదయ్యాయి. ఏం జరిగిందంటే.. సమావేశంలో పాల్గొన్న సంజయ్ కుమార్.. మైక్ తీసుకుని మాట్లాడుతుండగా.. కౌశిక్ రెడ్డి అయనతో గొడవకు దిగారు. “ముందు నీవు ఏ పార్టీనో చెప్పాలని, ఆ తర్వాతనే మాట్లాడాలి” అంటూ దురుసుగా ప్రవర్తించారు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. కాశిక్ రెడ్డికి ఎంత సర్ది చెప్పినా వినకపోవడంతో పోలీసులు వచ్చి బయటకు లాక్కెళ్లారు.
కౌశిక్ రెడ్డి వాగ్వాదంతో సమావేశం రసాభాసగా మారింది. సమావేశం అనంతరం ఎమ్మెల్యే సంజయ్‌తో దురుసుగా ప్రవర్తించారని.. ఆయన పీఏ, కరీంనగర్ వన్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.దీంతోపాటు సమావేశంలో గందరగోళం సృష్టించడంతోపాటు పక్కదారి పట్టించారని కౌశిక్ రెడ్డిపై ఆర్డీవో మహేశ్వర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన పట్ల దురుసుగా ప్రవర్తించారని గ్రంథాలయ ఛైర్మన్ మల్లేశం కూడా బిఆర్ఎస్ ఎమ్మెల్యేపై ఫిర్యాదు చేశారు. దీంతో పాడి కౌశిక్ రెడ్డిపై పోలీసులు మూడు కేసులు నమోదు చేశారు.