Thursday, February 13, 2025

తొలిరోజు 60లక్షల మంది పవిత్ర స్నానాలు

- Advertisement -
- Advertisement -

పొగమంచు దట్టంగా కమ్ముకుని ఉన్నది, చలి దుర్భరంగా ఉన్నది, నీళ్లు గడ్డ కట్టేలా ఉన్నాయి. ప్రపంచంలో అతిపెద్ద జనసందోహంతో కూడిన మహా కుంభమేళా సోమవారం మొదలైంది. మోక్షం కోసం, తమ పాపాలు పరిహారం అవుతాయన్న విశ్వాసంతోను లక్షలాది మంది ప్రజలు త్రివేణి సంగమంలో స్నానాలు ఆచరించారు. ఆధ్యాత్మికత, విశ్వాసం, సంస్కృతి, మతం, సంప్రదాయం, ఆధునిక సాంకేతికత & ప్రయాగ్‌రాజ్‌లో గంగ, యమున, సరస్వతి నదుల సంగమంలో కలగలసిపోయాయి. 12 సంవత్సరాల తరువాత జరుగుతున్న ఈ ఉత్సవంలో 45 రోజుల్లో 40 కోట్ల మందికిపైగా ప్రజలు పాల్గొంటారని ఆశిస్తున్నారు. ఈ ఉత్సవం కోసం ఖగోళ సంబంధిత ప్రస్తారణలు, కలయికలు 144 సంవత్సరాల తరువాత చోటు చేసుకుంటున్నందున ఇది విశ్వాసులకు మరింత శుభప్రదం అవుతుందని సాధువులు చెబుతున్నారు. పుష్య పౌర్ణమి సందర్భంగా శంఖారావాలు, భజనల నడుమ ఈ సుప్రసిద్ధ మేళా ప్రారంభం కాగా,సువిశాలమైన సంగమ్ ప్రాంతంలో ఉత్సుకత కొట్టవచ్చినట్లు కనిపిస్తోంది.

భక్తులు ఎక్కువగా బృందాలుగా ‘జై గంగా మయ్యా’ అని ఉచ్చరిస్తూ నీళ్ల దిశగా నడిచారు. ‘ఉదయం 9.30 గంటల వరకు రమారమి 60 లక్షల మంది యాత్రికులు పుణ్య స్నానాలు ఆచరించారు’ అని ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలియజేసింది. ‘భారతీయ విలువలను, సంస్కృతిని అనుసరించే కోట్లాది మంది ప్రజలకు అత్యంత ప్రత్యేక దినం! విశ్వాసం, అంకితభావం, సంస్కృతి పవిత్ర సంగమంగా అసంఖ్యాక ప్రజలను సంఘటితం చేస్తూ ప్రయాగ్‌రాజ్‌లో మహా కుంభమేళా 2025 మొదలవుతోంది. భారత నిరంతర ఆధ్యాత్మిక వారసత్వ సంపదకు, విశ్వాసం, సామరస్యానికి ప్రతీక మహా కుంభమేళా’ అని ప్రధాని నరేంద్ర మోడీ ‘ఎక్స్’ పోస్ట్‌లో పేర్కొన్నారు. హిమాలయాల్లోని తమ ఆవాసాల నుంచి నుదుటిపై వీబూదితో సాధువులు, దేశం అంతటి నుంచి మతావలంబీకులు, కేవలం ఆసక్తిపరులు అందరూ ఈ 45 రోజుల మహా కుంభమేళాకు వస్తున్నారు. వివిధ మఠాలకు చెందిన 13 అఖాడాల సాధువులు కూడా మహా కుంభమేళాలో పాల్గొంటున్నారు. ‘నేను బ్రెజిల్‌లో యోగా ఆచరిస్తున్నాను.

మోక్షం కోసం ఇక్కడికి వచ్చాను. ఇది ఎంతో ప్రత్యేకం, 144 ఏళ్లలో ఒకసారి వచ్చేది. ఇక్కడ ఉన్నందుకు నేను ఎంతో అదృష్టవంతుడిని. భారత్ ప్రపంచానికి ఆధ్యాత్మిక శిఖరం వంటిది. నాకు మోక్షం కోసం నాలుగు రోజులు ఉన్నాయి (నవ్వులు). నా జీవన లక్షం సనాతన ధర్మం, అది నా జీవితాన్ని మార్చివేసింది, నేను ప్రపంచాన్ని, నా కుటుంబాన్ని చూసే తీరును అది మార్చింది& జై శ్రీరామ్’ అని బ్రెజిల్ నుంచి వచ్చిన ఒక భక్తుడు చెప్పారు. ‘ఇక్కడ మీ భారతీయులు అందరితో కలసి ఇక్కడ ఉండడం నాకు ఎంతో ప్రత్యేకం. పవిత్ర ప్రదేశంలో ఇక్కడ పవిత్ర నదిలోకి దిగే అవకాశం వచ్చినందుకు ఎంతో కృతజ్ఞురాలిని’ అని స్పెయిన్ నుంచి వచ్చిన జూలీ చెప్పారు. యాత్రికులు బృందాలుగా స్నాన ఘట్టాలకు సాగుతుండగా ‘జై శ్రీరామ్’, ‘హర్ హర్ మహాదేవ్’, ‘జై గంగా మయ్యా’ నినాదాలు వినవస్తున్నాయి. ఉత్తర ప్రదేశ్ సిద్ధార్థ నగర్‌కు చెందిన కొందరు మహిళలు జానపద గీతాలు ఆలపించడంలో నిమగ్నమయ్యారు. దక్షిణ కొరియా నుంచి ఒక యూట్యూబర్ల బృందం, జపాన్ నుంచి ఒక బృందం మహా కుంభమేళాకు సంబంధించి వివిధ దృశ్యాలు చిత్రీకరిస్తున్నారు.

దేశవ్యాప్తంగా రాష్ట్రాల నుంచి బృందాలు కూడా ప్రయాగ్‌రాజ్‌లో వివిధ ఘాట్‌ల వద్ద కనిపిస్తున్నారు. భక్తుల కోసం చేసిన ఏర్పాట్లను హిమాచల్ ప్రదేశ్ హమీర్‌పూర్‌కు చెందిన కైలాష్ నారాయణ్ శుక్లా శ్లాఘిస్తూ, ‘యాత్రికుల కోసం మంచి ఏర్పాట్లు చేశారు. పవిత్ర స్నానం చేసేందుకు మాకు ఏ సమస్యలూ లేవు’ అని చెప్పారు. ‘సంస్కృతుల సంగమం ఉన్న చోట విశ్వాసం, సామరస్యాల సంగమం కూడా ఉంటుంది. మహా కుంభమేళా 2025 ‘భిన్నత్వంలో ఏకత్వం’ సందేశాన్ని ఇస్తోంది. మానవాళి సంక్షేమంతో పాటు సనాతన్‌తో సమ్మేళనాన్ని ప్రయాగ్‌రాజ్ చేకూరుస్తోంది’ అని ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ‘ఎక్స్’లో పేర్కొన్నారు. మహాకుంభ్ నగర్ ప్రపంచంలోనే అత్యంత పెద్ద తాత్కాలిక నగరం, ఇది ఏ సమయంలోనైనా 50 లక్షల మంది నుంచి కోటి మంది వరకు భక్తులకు వసతి కల్పిస్తుంది’ అని ఆదిత్యనాథ్ ఇంతకుముందు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News