Wednesday, January 15, 2025

భోగి మంటలు వెలిగించి… బసవన్నకు తినిపించి

- Advertisement -
- Advertisement -

కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి నివాసంలో సంక్రాంతి
సంబురాల్లో పాల్గొన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ
ప్రత్యేక పూజల అనంతరం కళా ప్రదర్శనల వీక్షణ
అతిథులుగా పలు రాష్ట్రాల గవర్నర్లు, చిరంజీవి
వివిధ రంగాల ప్రముఖులు హాజరు

మన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ వ్యాప్తంగా భోగి పండుగ సంబురాలు అంబరాన్నంటాయి. పల్లె, పట్నం అనే తేడా లేకుండా ప్రతి ఇంటి ముందు భోగి మంటలు వేసి సంక్రాంతి పండుగను సోమవారం జరుపుకున్నారు. గ్రామ గ్రామాన సంప్రదాయ రీతిలో భోగి మంటలు వేసుకుని పిల్లలు, పెద్దలంతా తెల్లవారుజామున లేచి ఒకదగ్గర చేరి ఎంతో ఉత్సాహంగా భోగి మంటల వద్ద చలికాచుకున్నారు. ఇంట్లో ఉన్న పనికిరాని పాత సామాన్లను భోగి మంటల్లో వేశారు. భాగ్యనగరం హైదరాబాద్‌లోనూ భోగి వేడుకలు ప్రతి కాలనీలోనూ, గేటెడ్ కమ్యూనిటీల్లోనూ, అపార్టుమెంట్ల వద్ద ఉత్సాహపూరిత వాతావరణంలో కోలాహలంగా జరిగాయి.

అందరూ ఒకచోట చేరి భోగి మంటలు వద్ద ఉల్లాసంగా గడిపారు. పండుగ రోజు వస్త్ర, బం గారు, ఇతర దుకాణాలు కిటకిటలాడాయి. ఇక ఇళ్ల ముందు కూడా భోగి మంటలు వేసి సందడి చేశారు. మూడు రోజుల పండుగలో భాగంగా తొలి రోజు భోగి పండుగను ఘనంగా జరుపుకున్నారు. పల్లెల్లో తమ ఇళ్ల భోగి మంటల కాంతులు విరజిమ్మాయి. పండుగ వాతావరణం కనిపించింది. భోగి మంటల చుట్టూ తిరుగుతూ, ఆడుతూ పాడుతూ, నృత్యాలు వేశారు. మరో వైపు ఎవరికి వారు తమ ఇండ్ల ముందు రంగు రంగుల ముగ్గులు వేస్తూ సందడి చేశారు. భోగి పండుగను బంధువులు, మిత్రులు, స్నేహితులతో ఇళ్లలో ఆనందోత్సాహాల మధ్య జరుపుకున్నారు.

భోగి, సంక్రాంతి శుభాకాంక్షలు
తెలిపిన గవర్నర్
రాష్ట్ర ప్రజలకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ భోగి, సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. భోగి, సంక్రాంతి పండుగలు సమృద్ధి, ఆనందాన్ని సూచించే పంట పండుగలని, అవి అందరికీ ఆనందం, శ్రేయస్సు, మంచి ఆరోగ్యాన్ని తీసుకురావాలని ఆయన ఆకాంక్షించారు. ఈ పండుగలు మన సాంస్కృతిక వారసత్వంలో గొప్ప ప్రాముఖ్యతను కలిగి ఉన్నాయని పేర్కొన్నారు. సంక్రాంతి వేడుకలు సమాజంలోని అన్ని వర్గాల మధ్య ఐక్యత, సామరస్యాన్ని పెంపొందించే మన పురాతన, అద్భుతమైన సంప్రదాయం యొక్క సారాంశాన్ని ప్రతిబింబిస్తాయని తెలిపారు. ఈ ఆనందకరమైన సందర్భంగా అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని గవర్నర్ తన సందేశంలో పేర్కొన్నారు.

భోగి, సంక్రాంతి శుభాకాంక్షలు
తెలిపిన మంత్రులు
పలువురు మంత్రులు, నాయకులు భోగి పండుగ, సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. మంత్రి పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి భోగి వేడుకల్లో పాల్గొన్నారు. ఖమ్మం జిల్లా కుసుమంచి మండలంలో ఆయన సంక్రాంతి వేడుకలను ఘనంగా ప్రారంభించారు. పార్టీ అభిమానులతో ఆయన ఘనంగా వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా లంబాడీలు నిర్వహించిన నృత్యం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. రాష్ట్ర మంత్రులు సీతక్క, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు తదితరులు భోగి పండుగ, సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎసి కల్వకుంట్ల కవిత భోగీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. కెబిఆర్ పార్క్ వద్ద తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో వైభవంగా భోగి వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకలకు ఎంఎల్‌సి కవిత ముఖ్య అతిథిగా హాజరై భోగి మంటలను వెలిగించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున మహిళలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంఎల్‌సి కవిత మాట్లాడుతూ హైదరాబాద్ నడిబొడ్డున పల్లె వాతావరణం సృష్టించి భోగి వేడుకలు నిర్వహించడం అభినందనీయమన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News