హైదరాబాద్: నగర శివారులోని నార్సింగిలో జరిగిన డబుల్ మర్డర్ కేసులో ట్విస్ట్ నెలకొంది. మంగళవారం అనంత పద్మనాభ స్వామి దేవాలయం గుట్టపై ఓ మహిళా, యువకుడు దారుణంగా హత్యకు గురయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి.. క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్ తో వెళ్లి పరిశీలించారు. అనంతరం మృతదేహాలను పోస్ట్ మార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. ఘటనాస్థలంలో మద్యం సీసాలను పోలీసులు గుర్తించారు. ఈ డబుల్ మర్డర్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన నార్సింగ్ పోలీసులు కీలక వివరాలు సేకరించినట్లు తెలస్తోంది. మృతులను మధ్యప్రదేశ్‌కు చెందిన అంకిత్ సాకేత్‌గా, ఛత్తీస్‌గఢ్‌కు చెందిన బిందుగా గుర్తించారు.
నానక్‌రామమ్‌గూడలో అంకిత్.. ఎల్బీనగర్‌లో బిందు నివాసం ఉంటున్న ఇద్దరి మధ్య వివాహేతర సంబంధం ఉందని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. బిందుకు ముగ్గురు పిల్లలు ఉన్నట్టు తెలుస్తోంది. ఈ నెల 8న బిందును ఎల్బీనగర్ నుంచి తీసుకొచ్చిన అంకిత్.. నానక్‌రామ్‌గూడలోని తన స్నేహితుల రూమ్‌లో ఉంచినట్లు పోలీసులు విచారణలో గుర్తించారు. ఆ తర్వాత గచ్చిబౌలిలో అకింత్ అదృశ్యమైనట్టు కేసు నమోదు కాగా, వనస్థలిపురంలో బిందుపై మిస్సింగ్ కేసు నమోదైంది. ఈ క్రమంలోనే నిన్న నార్సింగిలో ఇద్దరినీ దుండగులు హత్య చేశారు. ఈ మర్డర్ కేసులో అంకిత్, బిందు కుటుంబసభ్యులను పోలీసుల అనుమానిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ కేసుపై విచారణ కొనసాగుతోంది.