Thursday, January 16, 2025

సాగర ప్రాంత ప్రధాన శక్తిగా భారత్

- Advertisement -
- Advertisement -

సాగర ప్రాంత ప్రధాన శక్తిగా భారత్
దేశానికి విశ్వసనీయ, బాధ్యతాయుత భాగస్వామిగా గుర్తింపు
ఇండో పసిఫిక్ ప్రాంత భద్రతకు సదా భారత్ మద్దతు
ముంబయిలో ప్రధాని మోడీ ప్రకటన
మూడు యుద్ధ నౌకల జల ప్రవేశం
ముంబయి : భారత్ సాగర ప్రాంత ప్రధాన శక్తిగా మారుతోందని, ప్రపంచంలో విశ్వసనీయ, బాధ్యతాయుత భాగస్వామిగా గుర్తింపు పొందుతోందని ప్రధాని నరేంద్ర మోడీ బుధవారం ప్రకటించారు. ముంబయిలో మూడు నౌకాదళ యుద్ధనౌకలను మూడింటిని జలప్రవేశం చేయించిన అనంతరం మోడీ ప్రసంగిస్తూ, సార్వకాలిక, భద్రమైన, సమ్మిళిత, సౌభాగ్య ఇండో పసిఫిక్ ప్రాంతాన్ని భారత్ ఎల్లప్పుడూ సమర్థిస్తున్నదని తెలియజేశారు. బుధవారం ప్రప్రథమంగా ఒక డిస్ట్రాయర్‌ను, ఒక ఫ్రిగేట్‌ను, ఒక జలాంతర్గామిని కలసికట్టుగా జల ప్రవేశం చేయించినట్లు ప్రధాని వెల్లడించారు.

ఆ మూడూ ‘భారత్ తయారీ’ అని ఆయన తెలిపారు. ‘ఆత్మనిర్భర్ భారత్’ పథకం దేశాన్ని సుదృఢంగా, స్వయంపోషకంగా చేసిందని ప్రధాని చెప్పారు. ‘మాదకద్రవ్యాలు, ఆయుధాలు, ఉగ్రవాదం నుంచి సముద్రానికి భద్రత చేకూర్చడంలో మనం ప్రపంచ భాగస్వాములం కావాలి, సముద్ర ప్రాంతాన్ని సురక్షితం, సౌభాగ్యప్రదం చేయాలి. భారత్ ప్రధాన సాగరప్రాంత శక్తిగా మారుతోంది, విశ్వసనీయ, బాధ్యతాయుత భాగస్వామిగా గుర్తింపు పొందుతోంది’ అని ఆయన పేర్కొన్నారు. హిందూ మహాసముద్ర ప్రాంతంలో భారత్ ‘మొదటి స్పందనశక్తి’గా ఆవిర్భవించిందని ప్రధాని చెప్పారు.

‘భూప్రాంత జలాలను, నౌకారవాణా స్వాతంత్య్రాన్ని పరిరక్షించడం, వర్తక సరఫరా మార్గాలను. సాగర మార్గాలను సురక్షితం చేయడం ప్రధానం’ అని ఆయన పేర్కొన్నారు. భారత్ అభివృద్ధి కోసమే కృషి చేస్తున్నదని, విస్తరణవాదం కోసం కాదని కూడా మోడీ స్పష్టం చేశారు. గడచిన పది సంవత్సరాల్లో నౌకాదళంలోకి 33 నౌకలు, ఏడు జలాంతర్గాములను ప్రవేశపెట్టినట్లు ఆయన తెలియజేశారు. భారత రక్షణ ఉత్పత్తి విలువ లక్షా 25 వేల కోట్ల రూపాయలు దాటినట్లు, రక్షణ పరికరాలను వంద పైచిలుకు దేశాలకు ఎగుమతి చేసినట్లు ప్రధాని మోడీ వెల్లడించారు. బుధవారం ఉదయం ప్రధాని మోడీ సమక్షంలో భారత నౌకాదళ యుద్ధ నౌకలు ఐఎన్‌ఎస్ సూరత్, ఐఎన్‌ఎస్ నీలగిరి, ఐఎన్‌ఎస్ వాఘ్‌షీర్‌లను ముంబయి నేవల్ డాక్‌యార్డ్ వద్ద జలప్రవేశం చేయించారు. ప్రాజెక్ట్ 17ఎ స్టెల్త్ ఫ్రిగేట్ తరగతిలో లీడ్ నౌక అయిన ఐఎన్‌ఎస్ నీలగిరి శివాలిక తరగతి ఫ్రిగేట్ల కన్నా గణనీయంగా ఆధునికమైంది. ప్రాజెక్ట్ 15బి స్టెల్త్ డిస్ట్రాయర్ తరగతిలో నాలుగవ, ఆఖరి నౌక అయిన ఐఎన్‌ఎస్ సూరత్ కోల్‌కతా తరగతి డిస్ట్రాయర్లకు అనుబంధ నౌక. ఐఎన్‌ఎస్ వాఘ్‌షీర్ స్కార్పీన్ తరగతి ప్రాజెక్ట్ 75 కింద ఆరవ, ఆఖరి జలాంతర్గామి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News