న్యూఢిల్లీ : ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణంతో సంబంధం ఉన్న మనీ లాండరింగ్ కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) జాతీయ కన్వీనర్ అర్వింద్ కేజ్రీవాల్‌ను విచారించేందుకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇడి)కి కేంద్రం అనుమతి ఇచ్చింది. ఈ కేసులో కేజ్రీవాల్ విచారణకు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ (ఎల్‌జి) వికె సక్సేనా అనుమతి ఇచ్చిన నేపథ్యంలో కేంద్ర హోమ్ మంత్రిత్వశాఖ (ఎంహెచ్‌ఎ) ఈ నిర్ణయం తీసుకున్నది. ప్రజా ప్రతినిధులను విచారించే ముందు ఇడి ముందస్తు అనుమతి తీసుకోవాలని సుప్రీం కోర్టు నిరుడు నవంబర్‌లో తన ఆదేశాల్లో స్పష్టం చేసింది.
ఈ కుంభకోణంలో 56 ఏళ్ల కేజ్రీవాల్ ప్రధాన కుట్రదారుగా ఉన్నారని, కనుక ఆయనను విచారించుకోవచ్చునని సూచిస్తూ ఆ తదుపరి నెలలో ఇడికి లెఫ్టినెంట్ గవర్నర్ సక్సేనా లేఖ రాశారు. కాగా, అంతకు ముందు కేజ్రీవాల్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయిస్తూ తనపైన, ఇతరులపైన ఇడి చార్జిషీట్ దాఖలు చేయడాన్ని సవాల్ చేశారు. ప్రాసిక్యూషన్ ఫిర్యాదు దాఖలు చేయడానికి ముందు ఎటువంటి ముందస్తు అనుమతీ తీసుకోలేదని, కనుక ఇడి చార్జిషీట్ చట్టవిరుద్ధం అని ఆయన వాదించారు.
ఈ నేపథ్యంలోనే కేంద్రం తాజాగా ఈ కేసులో విచారణకు ఇడిని అనుమతిస్తూ ఆదేశాలు జారీ చేసింది. సెప్టెంబర్‌లో సుప్రీం కోర్టు కేజ్రీవాల్‌కు బెయిల్ మంజూరు చేసింది. ఫిబ్రవరి 5న నిర్వహించనున్న ఢిల్లీ శాసనసభ ఎన్నికలకు ముందు ఈ పరిణామం చోటు చేసుకుంది. ప్రస్తుతం బెయిల్‌పై విడుదలైన కేజ్రీవాల్ న్యూఢిల్లీ స్థానం నుంచి శాసనసభకు పోటీ చేస్తున్నారు. కాగా, ఇదే కేసులో కేజ్రీవాల్ నిరుడు మార్చి 21న అరెస్టు అయ్యారు. ఆ తరువాత జూన్ 26న సిబిఐ కూడా ఆయనను అరెస్టు చేసింది.