అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తిరుపతిలోని మోహన్‌బాబు యూనివర్సిటీ వద్ద బుధవారం ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. సినీ నటుడు మంచు మనోజ్ యూనివర్సిటీ లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు. మా తాత, నాయనమ్మ సమాధులను చూసేందుకు వచ్చానని, అనుమతి కావాలని పోలీసులను మనోజ్ అడిగారు. కోర్టు ఆర్డర్ నేపథ్యంలో యూనివర్సిటీలోకి ఎవరు వెళ్లేందుకు అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేశారు. చిన్నప్పటి నుంచి తాత, నాయనమ్మ సమాధులను చూడాటానికి ఇక్కడికి వస్తున్నానని మనోజ్ తెలిపారు. గొడవ చేయాలని ఉద్దేశం తనకు లేదని, తనని ఎలా అడ్డుకుంటారని మంచు మనోజ్ ప్రశ్నించారు.
అనవసరంగా రాద్ధాంతం చేయడం సరికాదని, అనుమతి ఇస్తే సమాధుల వద్దకు వెళ్లి దండం పెట్టుకుంటానని వివరణ ఇచ్చారు. పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో మనోజ్ తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. పోలీసులతో చర్చలు జరిపిన అనంతరం అవ్వతాతల సమాధుల దగ్గరకు వెళ్లి మనోజ్ దంపతులు నివాళులర్పించారు. ఈ క్రమంలో మంచు విష్ణు, మనోజ్ బౌన్సర్ల మధ్య తోపులాట జరిగింది. పోలీసులు పరిస్థితిని అదుపు చేయడంతో శాంతియుత వాతావరణం ఏర్పడింది. కాలేజీ ముందు ఉన్న దుకాణదారులు తమను తీవ్ర ఇబ్బందికి గురి చేస్తున్నారని మండిపడ్డారు.