Thursday, January 16, 2025

‘కాళేశ్వరం – మంథని – రామగిరి’ని ఆధ్యాత్మిక, వారసత్వ పర్యాటకంగా గుర్తించండి

- Advertisement -
- Advertisement -

కాళేశ్వర ముక్తేశ్వర దేవాలయాభివృద్ధికి సహకరించండి
రామగిరికోటను టూరిజం హబ్‌గా మార్చాలి
కేంద్ర మంత్రి గజేంద్రసింగ్ షేకావత్‌కు మంత్రి శ్రీధర్ బాబు విజ్ఞప్తి

మన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణలో ‘కాళేశ్వరం – మంథని – రామగిరి’ని ఆధ్యాత్మిక, వారసత్వ పర్యాటక సర్య్కూట్ గా గుర్తించాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు కేంద్ర సాంస్కృతిక, పర్యాటక మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌ను కోరారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా మంత్రి శ్రీధర్ బాబు బుధవారం ఆయనను కలిసి మంథని నియోజకవర్గ పరిధిలోని కాళేశ్వర ముక్తేశ్వర దేవాలయం, రామగిరి కోటను టూరిజం హబ్ గా అభివృద్ధి చేసేందుకు చొరవ చూపాలని వినతి పత్రం అందజేశారు. ‘దక్షిణ కాశీగా పేరుగాంచిన కాళేశ్వరంలో గోదావరి నది ఒడ్డున వెలిసిన కాళేశ్వర ముక్తేశ్వర దేవాలయానికి వేయ్యేళ్లకు పైగా చరిత్ర ఉందని అన్నారు.

దేశంలో ఎక్కడా కనిపించని విధంగా గర్భ గుడిలో రెండు శివలింగాలు పూజలందుకుంటున్నాయని మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు. ఒకటి ముక్తేశ్వరునిది (శివుడు), మరొకటి కాళేశ్వరునిది (యముడు)గా ఆయన పేర్కొన్నారు. ఏటా లక్షలాది మంది భక్తులు ఈ ఆలయాన్ని దర్శించుకుంటున్నారని, ఈ ఏడాది మేలో సరస్వతి పుష్కరాలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని శ్రీధర్‌బాబు కేంద్రమంత్రికి వివరించారు. ఈ పుష్కరాలకు 30 లక్షల నుంచి 40 లక్షల మంది విచ్చేసి ఇక్కడ పవిత్ర స్నానాలను ఆచరించేందుకు వస్తారని అంచనా వేస్తున్నామని తెలిపారు. ఇక్కడే 2027లోనూ గోదావరి పుష్కరాలు జరగనున్నాయని పేర్కొన్నారు. అప్పుడు కోటి మందికి పైగా వచ్చే అవకాశం ఉందని తెలిపారు. సోమ్ నాథ్, కేదార్ నాథ్, మహాకాళేశ్వర్, అయోధ్య, కాశీల మాదిరిగా ఎంతో ప్రత్యేకత కలిగిన ఈ ఆలయాన్ని కూడా ప్రపంచ స్థాయి ఆధ్యాత్మిక, ఎకో టూరిజం హబ్‌గా అభివృద్ధి చేయవచ్చునని కేంద్రమంత్రికి సూచించారు.

ఇప్పటికే ఇందుకు సంబంధించి సమగ్ర ప్రణాళికను రూపొందించామని, దీని అమలుకు కేంద్రం సహకరించాలని విజ్ఞప్తి చేశారు. భక్తుల సౌకర్యార్థం పుష్కరాలు మొదలయ్యే నాటికి ఈ అభివృద్ధి పనులను పూర్తి చేసేలా చొరవ చూపాలని కోరారు. ‘రామగిరి కోటకు సుమారు 1200 ఏళ్ల చరిత్ర ఉందని, రామాయణంలోనూ దీని గురించిన ప్రస్తావన ఉందని చెప్పారు. రాముడి ఆలయాలు, జలపాతాలు, ఎన్నో ఔషధ మొక్కలు ఇక్కడున్నాయని తెలిపారు. ఒక ప్రపంచస్థాయి పర్యాటక కేంద్రానికి కావాల్సిన అన్ని ఆకర్షణలు ఇక్కడున్నాయని తెలిపారు. ఈ కోటను సందర్శించేందుకు ఎక్కడెక్కడి నుంచో పర్యాటకులు వస్తున్నారని అన్నారు. స్వదేశీ దర్శన్ 2.0 లేదా ఇతర పథకాల కింద ఈ కోటను మెగా టూరిజం హబ్ గా అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News