న్యూఢిల్లీ : ఇటీవల లోక్‌సభ ఎన్నికల ఫలితాలపై మెటా సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. దీంతో పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఆయనపై చర్యలకు సిద్ధమైంది. ఈ నేపథ్యం లోనే మెటా స్పందిస్తూ , భారత ప్రభుత్వానికి క్షమాపణలు తెలియజేసింది. అనుకోకుండా జరిగిన పొరపాటును క్షమించాలని కోరింది. జుకర్‌బర్గ్ వ్యాఖ్యలను ఖండిస్తూ కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ చేసిన పోస్ట్‌కు మెటా ఇండియా వైస్ ప్రెసిడెంట్ (పబ్లిక్‌పాలసీ ) శివానంద్ టుక్‌రాల్ స్పందించారు. “ 2024లో జరిగిన ఎన్నికల్లో అధికారంలో ఉన్న పార్టీలు మళ్లీ విజయం సాధించలేదంటూ మార్క్ చేసిన వాదన చాలా దేశాల్లో నిజమే కానీ భారత్‌లో మాత్రం కాదు.
అనుకోకుండా జరిగిన ఈ పొరపాటుకు క్షమాపణలు తెలియజేస్తున్నాం. మెటాకు భారత్ అతి ముఖ్యమైన భాగస్వామి. ఈ దేశ సృజనాత్మక భవిష్యత్తులో మేమూ కీలక పాత్ర పోషించేందుకు ఎదురు చూస్తున్నాం ” అని రాసుకొచ్చారు. జనవరి 10న జుకర్‌బర్గ్ ఓ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా గత ఏడాది జరిగిన ఎన్నికల అంశాన్ని ప్రస్తావించారు. “2024 అతిపెద్ద ఎన్నికల ఏడాదిగా నిలిచింది. భారత్ సహా అనేక దేశాల్లో ఎన్నికలు జరిగాయి. అందులో ప్రతి చోటా అధికారంలో ఉన్న ప్రభుత్వాలు ఓడిపోయాయి. అది ద్రవ్యోల్బణం వల్ల కావచ్చు. లేదా కొవిడ్‌ను ఎదుర్కోవడానికి తీసుకొచ్చిన ఆర్థిక విధానాల వల్ల కావొచ్చు. ప్రపంచ వ్యాప్తంగా ఈ ప్రభావం కనిపించింది” అని మెటా అధినేత వ్యాఖ్యానించారు. ఇది పెను వివాదానికి దారి తీసింది. జుకర్‌బర్గ్ వాదనను కేంద్ర మంత్రి అశ్వినీవైష్ణవ్ తీవ్రంగా ఖండించారు.
“ ప్రపంచం లోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్‌లో 2024లో నిర్వహించిన ఎన్నికల్లో 64 కోట్ల మంది ఓటర్లు పాల్గొన్నారు. ప్రధాని నరేంద్రమోడీ నేతృత్వం లోని ప్రభుత్వంపై విశ్వాసం ఉందని తేల్చి చెప్పారు. కొవిడ్ 19 తరువాత భారత్ సహా అధికారంలో ఉన్న అనేక ప్రభుత్వాలు ఓడిపోయాయని జుకర్‌బర్గ్ చెప్పడంలో వాస్తవం లేదు. 80 కోట్ల మందికి ఉచిత ఆహారం మొదలు 220 కోట్ల వ్యాక్సిన్లు అందించడంతోపాటు కొవిడ్ సమయంలో ప్రపంచ దేశాలకు భారత్ సాయం చేయడం వంటి నిర్ణయాలు మోడీ మూడోసారి విజయానికి నిదర్శనంగా నిలిచాయి” అని అశ్వినీ వైష్ణవ్ పేర్కొన్నారు. స్వయంగా జుకర్‌బర్గ్ నుంచి ఇలాంటి అసత్య సమాచారం రావడం తీవ్ర నిరాశకు గురి చేసిందన్న కేంద్రమంత్రి వాస్తవాలు , విశ్వసనీయతను కాపాడుకుందామంటూ మెటాను ట్యాగ్ చేశారు. ఈ నేపథ్యం లోనే మెటా స్పందిస్తూ భారత్‌కు క్షమాపణలు తెలియజేసింది.