తిరిగొచ్చే వారి కోసం నెలాఖరు వరకు ప్రత్యేక రైళ్లు, బస్సు సర్వీసులు
మన తెలంగాణ / హైదరాబాద్ : సంక్రాంతి పండుగకు సొంతూళ్లకు వెళ్ళిన జనం తిరిగి నగర బాటపట్టారు. సొంతూళ్ల నుండి పట్నం బాట పట్టిన వారి కోసం దక్షిణ ప్రత్యేక రైళ్లు, ప్రత్యేక బస్సు సర్వీసులను ఆయా సంస్థలు ఈ నెలాఖరు వరకు నడుపుతున్నాయి. ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసం హైదరాబాద్ నగరానికి వచ్చి స్థిరపడిన వాళ్లు సంక్రాంతి పండుగ సందర్భంగా సొంతూళ్లకు వెళ్లిన విషయం తెలిసిందే. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచే గాకుండా వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన వారంతా పల్లెల్లో బంధుమిత్రుల మధ్య సంక్రాంతి పండుగను జరుపుకోవడానికి తమ సొంతూళ్లకు వెళ్లిపోవడంతో నగరంలో జనసంచారం బాగా తగ్గిపోయింది.
రెండు రోజులు ప్రశాంతంగా కనిపించిన నగర రోడ్లపై మళ్ళీ జనసంచారం క్రమంగా పెరుగుతోంది. సొంతూళ్లకు వెళ్లిన వారంతా తిరుగుపయనమవ్వడంతో వారి కోసం ఆర్‌టిసి, రైల్వే సంస్థలు ప్రత్యేక సర్వీసులను నడిపిస్తున్నాయి. పండుగకు సొంతూళ్లకు వెళ్లేందుకు రెగ్యులర్ సర్వీసులతో పాటు భారీ సంఖ్యలో ప్రత్యేక సర్వీసులను నడిపిన ఆయా సంస్థలు పండుగ అయిపోవడంతో తిరుగు పయనమవుతున్న వారి కోసం ప్రత్యేక సర్వీసులను ఈ నెలాఖరు వరకు నడుపనున్నట్లు వెల్లడించాయి. సంక్రాంతి సీజన్‌లో దక్షిణ మధ్య రైల్వే జోన్ పరిధిలో 188 ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. ఇప్పటికే సుమారు 100కు పైగా ప్రత్యేక రైళ్లను నడిపించినట్లు దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది. వీటితో పాటు దక్షిణ మధ్య రైల్వే జోన్ మీదుగా మరో 178 ప్రత్యేక రైళ్లు వెళతాయి. వీటితో పాటు రెగ్యులర్‌గా నడిచే సర్వీసులు యథావిధిగా ప్రయాణికులను చేరవేస్తుంటాయని దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది.
భారీ సంఖ్యలో ప్రయాణికులు సొంతూళ్లకు తరలివెళ్లడంతో తిరిగి వచ్చేందుకు సైతం ప్రత్యేక రైళ్లను అందుబాటులో ఉంచినట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. బుధవారం నుంచే ప్రత్యేక రైళ్లను అందుబాటులో ఉంచామని ఈ నెలాఖరు వరకు ప్రత్యేక రైళ్లు అందుబాటులో ఉంటాయని రైల్వే అధికారులు చెప్పారు. దైవ దర్శనాలకు వెళ్లే వారు సైతం ఈ ప్రత్యేక రైళ్లను వినియోగించుకోవాలని రైల్వే అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రత్యేక రైళ్లతో పాటు, సాధారణ రైళ్లకు అదనపు బోగీలను కూడా ఏర్పాటు చేశామని వెల్లడించారు.
ప్రయాణికుల కోసం టిజిఎస్ ఆర్‌టిసి 6,432 ప్రత్యేక బస్సులను నడిపిస్తున్నట్లు ప్రకటించింది. తిరిగి వచ్చే ప్రయాణికులతో మహబూబ్‌నగర్, కరీంనగర్, వరంగల్, మెదక్ తదితర ప్రాంతాల నుంచి రద్దీ పెరుగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి ఈ నెల 17, 18, 19, 20వ తేదీల్లో రద్దీ ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. అందుకు అనుగుణంగా రెగ్యులర్ సర్వీసులతో పాటు అదనపు సర్వీసులను కూడా అందుబాటులో ఉంచినట్లు వెల్లడించారు. ఎపి రాష్ట్రం నుంచి హైదరాబాద్‌కు రిజర్వేషన్‌లు ఈ నెల 17వ తేదీ నుంచి మొదలైనట్లు టిజిఎస్ ఆర్‌టిసి తెలిపింది. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా ఆర్‌టిసి బస్సులను అందుబాటులో ఉంచుతామని రంగారెడ్డి రీజనల్ మేనేజర్ శ్రీలత తెలిపారు.