Thursday, January 16, 2025

కాంగ్రెస్ ప్రభుత్వ పని తీరుపై అధిష్టానం ఫోకస్

- Advertisement -
- Advertisement -

ఢిల్లీలో సమీక్ష చేసిన కెసి వేణుగోపాల్
మంత్రులతో ముఖాముఖీ నిర్వహించిన ఏఐసిసి జనరల్ సెక్రటరీ
శాఖల వారీగా చేపట్టిన అభివృద్ధిని వివరించిన మంత్రులు
ఈనెలాఖరులోగా నామినేటేడ్ పదవులను భర్తీ చేయాలని నిర్ణయం
పిసిసి కార్యవర్గం ఏర్పాటుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన కెసి
కష్టపడే కార్యకర్తలకు గుర్తింపు ఇవ్వాలని ఆదేశం
జీహెచ్‌ఎంసీ, స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం కోసం కృషి చేయాలని సూచన
మంత్రివర్గ విస్తరణపై త్వరలోనే నిర్ణయం
ఈనెలాఖరులోగా బిసి కులగణనపై డెడికేషన్ కమిషన్ నివేదిక

మనతెలంగాణ/హైదరాబాద్:  ఈ నెలాఖరు లేదా ఫిబ్రవరి మొదటి లేదా రెండో వారంలో సూర్యాపేట లేదా ఖమ్మంలో భారీ ర్యాలీ నిర్వహించనున్నట్లు టిపిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. సంవిధాన్ బచావో (రాజ్యాంగం పరిరక్షణ) ర్యాలీలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పాల్గొననున్నట్టు ఆయన పేర్కొన్నారు. దీంతోపాటు ఈ నెలాఖరు కల్లా నామినేటేడ్ పదవులను భర్తీ చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు ఆయన చెప్పారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రభుత్వ పనితీరుపై ఢిల్లీలో ఏఐసిసి జనరల్ సెక్రటరీ కెసి వేణుగోపాల్ సమీక్ష జరిపారు. అనంతరం టిపిసిసి అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ మాట్లాడుతూ పిసిసి కార్యవర్గం ఏర్పాటు పూర్తి చేయాలని నిర్ణయం తీసుకున్నామని ఆయన తెలిపారు.

క్షేత్ర స్థాయిలో పనిచేసే నిజమైన కార్యకర్తలకే జిల్లా కాంగ్రెస్ కమిటీ (డిసిసి) అధ్యక్ష పదవులివ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు పిసిసి అధ్యక్షుడు పేర్కొన్నారు. డిసిసి అధ్యక్షులు ప్రతిపాదించి, సిఫార్సు చేసే వారికే ప్రాధాన్యతనిచ్చి, వచ్చే ఎన్నికల్లో టికెట్లు ఇవ్వాలని అధిష్టానం నిర్ణయించిం దని ఆయన తెలిపారు. ఈనెలాఖరులోగా డెడికేషన్ కమిషన్ బిసి కులగణనపై నివేదిక అందచేయనుందని ఆయన అన్నారు.

త్వరలో జరగనున్న జీహెచ్‌ఎంసీ, స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం దిశగా సమష్టిగా సన్నద్దం కావాలని కెసి వేణుగోపాల్ దిశానిర్దేశం చేసినట్టుగా ఆయన పేర్కొన్నారు. మంత్రివర్గ విస్తరణ, మార్పులు, చేర్పులు పై అధిష్టానం, ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకుంటుందని ఆయన చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం, పార్టీ పని తీరు భేషుగ్గా ఉందని పార్టీ ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్ ప్రశంసించారని మహేశ్ కుమార్ చెప్పారు. కష్టపడి పనిచేస్తూ ప్రజల్లో ఉన్న వారికే పార్టీ పదవులు వరిస్తాయని టిపిసిసి చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ చెప్పారు.

అమలు చేయని పథకాలపై ఆరా…

కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరుపై అధిష్టానం ఫోకస్ పెట్టింది. అందులో భాగంగా మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రభుత్వ పనితీరుపై ఢిల్లీలో ఏఐసిసి జనరల్ సెక్రటరీ కెసి వేణుగోపాల్ బుధవారం సమీక్ష జరిపారు. సంస్థాగత అంశాలతో పాటు శాఖల వారీగా కెసి వేణుగోపాల్ నివాసంలో ఈ కీలక సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, దామోదర రాజనర్సింహా, ఉత్తమ్‌కుమార్ రెడ్డి, కొండా సురేఖ, సీతక్క, జూపల్లి కృష్ణారావు, పిసిసి చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ తదితరులు హాజరయ్యారు. ఈ సమావేశంలో భాగవగా మంత్రివర్గ విస్తరణ, పిసిసి కార్యవర్గ ఏర్పాటు, నామినేటెడ్ పదవుల భర్తీ, స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి చర్చించారు.

దీంతోపాటు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఫిబ్రవరిలో తెలంగాణలో పర్యటించనున్నారు. ఈ మేరకు ఆయన పర్యటనకు సంబంధించి ఢిల్లీలో కెసివేణుగోపాల్ తో రాష్ట్ర మంత్రులు, ఇతర నేతలు చర్చించారు. దీంతోపాటు శాఖల వారీగా సమీక్షతో పాటు ప్రతి మంత్రితోనూ కెసి వేణుగోపాల్ ముఖాముఖి నిర్వహించి వారితో ఈ ఏడాది కాలంలో వారు చేపట్టిన అభివృద్ధి గురించి కెసి వేణుగోపాల్‌కు వారిని అడిగి తెలుసుకున్నట్టుగా సమాచారం. ఆరు గ్యారంటీల్లో అమలు చేసిన పథకాలు, ఇంకా అమలు చేయని పథకాల గురించి ఆయన ఆరా తీసినట్టుగా తెలిసింది.

పనితీరు ఆధారంగా కొంత మందిని

ఏడాదిలో కాంగ్రెస్ ప్రభుత్వ పని తీరుపై అధిష్టానం ఇప్పటికే సీక్రెట్ సర్వే నిర్వహించింది. ఇందులో పలువురు మంత్రుల పనితీరుపై అధిష్టానం అసంతృప్తితో ఉన్నట్లుగా తెలుస్తోంది. ముఖ్యంగా మంత్రివర్గ విస్తరణపై చాలా కాలంగా అధిష్టానం అన్ని కోణాల్లో లెక్కలు వేసుకుంటోంది. ఈ నేపథ్యంలో మంత్రుల పనితీరు ఆధారంగా కొంతమందిని తప్పిస్తారన్న ప్రచారం సైతం జోరుగా వినిపిస్తోంది. ఇటీవల రాష్ట్రంలో జరిగిన పీఏసీ సమావేశంలోనూ రాష్ట్ర నేతలకు కెసి వేణుగోపాల్ వార్నింగ్ ఇచ్చిన నేపథ్యంలో ఢిల్లీలో జరిగిన సమీక్ష ప్రాధాన్యత సంతరించుకుంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News