అంతరాష్ట్ర ముఠా – గుట్టు రట్టు.. ఒకరి అరెస్టు
రెండు దేశవాళీ తుపాకులు, ఒక తపంచా
10 లైవ్ బుల్లెట్స్, మొబైల్ ఫోన్ స్వాధీనం
మన తెలంగాణ/హైదరాబాద్ : నగరంలో తుపాకుల విక్రయం కలకలం రేపింది. హైదరాబాద్‌లోని రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలో తుపాకులు విక్రయిస్తున్న అంతరాష్ట్ర ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. ఉత్తరప్రదేశ్ బల్లియా జిల్లాకు చెందిన హరేకృష్ణ యాదవ్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి వద్ద నుంచి రెండు దేశవాళీ తుపాకులు, ఒక తపంచా, 10 లైవ్ బుల్లెట్స్, మొబైల్ ఫోన్‌ను పోలీసులు స్వాధీనం చేసు కున్నారు. హైదరాబాద్‌లోని గ్యాంగ్‌కు విక్రయించేందుకు హరికృష్ణ ఈ పిస్టల్స్ తీసుకువచ్చినట్లు పోలీసులు గుర్తించారు.
హరేకృష్ణ యాదవ్ తుపాకులను బుల్లెట్స్‌తో సహా భారీ ధరకు విక్రయించేందుకు ప్రయత్నించాడని పోలీసుల విచారణలో తేలినట్లు సమాచారం. భోజ్‌పురిలో తుపాకులు కొనుగోలు చేసిన హరికృష్ణ హైదరాబాద్‌కు తీసుకువచ్చి అవసరమైన వారికి విక్రయించడానికి ప్రయత్నిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. భోజ్ పూర్‌లో తుపాకులు తయారు చేస్తున్న ముఠాను పట్టుకునేందుకు ప్రయత్నం చేస్తున్నాం. భోజ్‌పూర్‌లో తుపాకుల తయారీ కుటీర పరిశ్రమగా మారిపో యిందని అక్కడ తుపాకులను తయారు చేసి హైదరాబాద్‌కు తీసుకువచ్చి గుట్టుచప్పుడు కాకుండా విక్రయిస్తున్న ముఠాను పట్టుకునేందుకు ప్రత్యేక టీమ్‌ను ఏర్పాటు చేశామని రాచకొండ సిపి సుధీర్‌బాబు తెలిపారు.
నిందితుడు హరేకృష్ణ యాదవ్ ఇంటర్మీడియట్ వరకు విద్యనభ్యసించాడు. 2019లో హైదరాబాద్‌కు వచ్చి బిబి నగర్‌లో ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేశాడు. 2022లో స్వగ్రామానికి తిరిగి వెళ్లి వ్యవసాయంలో నిమగ్న మయ్యాడు. తన గ్రామం బీహార్ సరిహద్దులో ఉండటంతో అక్రమ ఆయుధ తయారీదారులతో సంబంధాలేర్పడ్డాయి. తన ఆర్థిక పరిస్థితిని మెరుగు పర్చుకునేందుకు హరేకృష్ణ యాదవ్ తక్కువ ధరకు ఆయుధాలు కొనుగోలు చేసి హైదరాబాద్‌లో అధిక ధరకు విక్రయించడానికి ప్రయత్నించాడు. బీహార్ రాష్ట్రంలోని భోజ్‌పూర్ జిల్లాకు చెందిన సంపత్ యాదవ్ వద్ద నుండి ఆయుధాలు కొనుగోలు చేశాడు. విశ్వసనీయ సమాచారంతో భువనగిరి ఎస్వోటీ, జవహరనగర్ పోలీసులు సంయుక్తంగా నిందితుడిని అరెస్టు చేశారు. ఈ కేసులో కీలక నిందితుడు సంపత్ యాదవ్ కోసం ప్రత్యేక టీమ్ దృష్టి సారించింది.
హైదరాబాద్‌లో తుపాకుల విక్రయానికి అడ్డుకట్ట వేసే విధంగా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా ప్రస్తుతం పట్టుబడ్డ ముఠాతో పాటు మరింకేమైనా ముఠాలు ఉన్నాయా? అన్నదానిపై సైతం పోలీసులు దృష్టి సారించారు. కాగా గత ఏడాది హైదరాబాద్‌లో నకిలీ గన్ లైసెన్స్‌లతో సొంతంగా తుపాకులు తయారుచేస్తూ అమ్ముతున్న మూఠాను పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి 34 నకిలీ లైసెన్సులు, 33 తుపాకీలు, 140 రౌండ్స్ బులెట్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. నిందితులు ఇతర రాష్ట్రాల నుంచి తుపాకులు తీసుకొచ్చి ఇక్కడ నకిలీ లైసెన్సుతో అమ్మకాలు చేస్తున్నట్లుగా గుర్తించారు.