ఏర్పాట్లు చేసిన అధికారులు
నేడు రాత్రి ఢిల్లీ నుంచి సింగపూర్‌కు ముఖ్యమంత్రి
మూడు రోజుల పాటు అక్కడే…
20వ తేదీన సింగపూర్‌కు సిఎం పయనం
24వ తేదీ ఉదయం తిరిగి హైదరాబాద్ రాక
మనతెలంగాణ/హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనకు సంబంధించిన షెడ్యూల్ ఖరారు అయ్యింది. దీని కోసం అధికారుల అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. అయితే, సిఎం రేవంత్ విదేశీ పర్యటన వివరాలు ఇలా ఉన్నాయి. నేడు (గురువారం) రాత్రి 10.50 గంటలకు ఢిల్లీలోని అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బయలుదేరి 17వ తేదీ ఉదయం 6 గంటలకు సింగపూర్‌లోని చాంగీ ఎయిర్ పోర్టుకు సిఎం రేవంత్ చేరుకుంటారు. సింగపూర్‌లో సిఎం రేవంత్ మూడు రోజుల పాటు పర్యటించనున్నారు. అక్కడ జరిగే బిజినెస్ మీట్‌లో సిఎం పాల్గొంటారు. పలువురు పారిశ్రామిక వేత్తలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ అవుతారు.
అనంతరం తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేయబోయే స్పోర్ట్ యూనివర్శిటీకి సంబంధించి సింగపూర్‌లో ఉన్న స్పోర్ట్ యూనివర్శిటీని సిఎం సందర్శిస్తారు. ఆ యూనివర్శిటీకి సంబంధించి పలు విషయాలను ఆయన తెలుసుకోనున్నారు. అలాగే షాపింగ్ మాల్స్, స్టేడియాల నిర్మాణాలను సిఎం పరిశీలించనున్నారు. అనంతరం ఈ నెల 20వ తేదీ తెల్లవారుజామున సింగపూర్ నుంచి బయలుదేరి, జూరిచ్‌కు ముఖ్యమంత్రి చేరుకుంటారు.
అక్కడ మూడు రోజుల పాటు దావోస్‌లో జరిగే సదస్సులో తెలంగాణ తరుపున రేవంత్ రెడ్డి పాల్గొంటారు. జూరిచ్ పర్యటన తర్వాత 23వ తేదీన రాత్రి దుబాయ్‌కి సిఎం రేవంత్ వెళతారు. దుబాయ్‌లో ఒక రోజు పర్యటన అనంతరం ఈ నెల 24వ తేదీన ఉదయం 8.25 గంటలకు హైదరాబాద్‌లోని శంషాబాద్ విమానాశ్రయానికి సిఎం తిరిగి రానున్నారు. ఈ కార్యక్రమంలో సిఎం పాల్గొని తెలంగాణకు పెద్దఎత్తున పెట్టుబడులు తీసుకువచ్చే ప్రయత్నం ముఖ్యమంత్రి చేయనున్నారు.