ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో 2013 ఫలితాల సరళి పునరావృతమవు తుందా? మసకబారిన ఆమ్‌ఆద్మీ పార్టీ ఆప్ ప్రతిష్ఠ, మారిన రాజకీయ పరిస్థితులు కీలకంగా మారిన 30% స్వింగ్ ఓట్లు, స్పష్టంగా కనిపిస్తున్న ప్రభుత్వ వ్యతిరేకత… వెరసి ఈ సందేహానికి తావిస్తున్నాయి. 2015, 2020 లాంటి ఏకపక్ష వాతావరణం మాత్రం కనిపించడంలేదు. 2013 అంటే… అవసరమైన మెజారిటీ ఎవరికీ రాని పరిస్థితి! 32 స్థానాలతో బిజెపి అతిపెద్ద పార్టీగా అవతరించినా 8 మంది సభ్యుల కాంగ్రెస్ మద్దతుతో 28 స్థానాలు గెలిచిన ‘ఆప్’ సర్కార్ ఏర్పాటు చేసి, 49 రోజులు మనుగడ సాగించిన కాలమది. 70 స్థానాల అసెంబ్లీలో 36 స్థానాలు ఆపై ఎవరు తెచ్చుకుంటారు? అన్నది పెద్ద ప్రశ్న.. ఇప్పుడు.
దేశమంతా ఆసక్తిగా, ప్రత్యర్థి రాజకీయ పక్షాలు ఉత్కంఠగా చూస్తున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు ఫిబ్రవరి 5న జరుగనున్నాయి. పాలక ‘ఆప్’ కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి, విపక్షం కాంగ్రెస్.. మధ్య ముక్కోణపు పోటీ నెలకొంది. పేరుకు ముక్కోణమే అయినా ప్రధాన పోటీ ఆప్ బిజెపిల మధ్యే! చిట్టచివరి 2024 లోక్‌సభ ఎన్నికల్లో ‘ఇండియా కూటమి’ భాగస్వాములుగా కలిసి పోటీ చేసిన ఆప్ కాంగ్రెస్‌లు ఇప్పుడు విడివిడిగా తలపడుతున్నాయి. పైపెచ్చు, తృణమూల బెనర్జీ), సమాజ్‌వాదీ పార్టీ (అఖిలేశ్ యాదవ్) వంటి ‘ఇండియా కూటమి ఇతర పక్షాలు ‘ఆప్’కు బహిరంగ మద్దతు ప్రకటించాయి. ఒక రకంగా కాంగ్రెస్ ఒంటరిదైంది. షీలాదీక్షిత్ ముఖ్యమంత్రిగా మూడు పర్యాయాలు, పదిహేనేళ్లు నిరాఘాటంగా ఢిల్లీని ఏలిన కాంగ్రెస్.. ఇటు అసెంబ్లీ ఎన్నికలు గెలవక, అటు కనీసం ఒక లోక్‌సభ స్థానమైనా తన ఖాతాలో వేసుకోలేక చతికిలపడింది. 2014, 2019, 2024 మూడు లోక్‌సభ ఎన్నికల్లోనూ ఢిల్లీలోని మొత్తం ఏడు సీట్లూ గెలుస్తూ వస్తున్న బిజెపి 1998 తర్వాత ప్రతి అసెంబ్లీ ఎన్నికా ఓడిపోతోంది.
స్వింగ్ ఓట్లు కీలకం
ఒక పార్టీకి కట్టుబడకుండా ఎన్నికను, పరిస్థితిని బట్టి అటు ఇటు మారుతున్న దాదాపు 30 శాతం ‘స్వింగ్’ ఓట్లు ఢిల్లీ ఎన్నికల్లో అత్యంత కీలకమైనవి. అవి ప్రధానంగా లోక్‌సభ ఎన్నికల్లో బిజెపి, కాంగ్రెస్ పార్టీల వైపు, అసెంబ్లీ ఎన్నికలు వచ్చేసరికి ‘ఆప్’ వైపు మొగ్గుతున్నట్టు గత ఎన్నికల గణాంకాలు చెబుతున్నాయి. ఈ ట్రెండ్‌ను ‘బ్రేక్’ చేస్తామని, ఈసారి తప్పక తాము ఢిల్లీలో సర్కార్ ఏర్పాటు చేస్తామని బిజెపి ధీమా వ్యక్తం చేస్తోంది. బలంగా వీస్తున్న ప్రభుత్వ వ్యతిరేక పవనాలు, ‘ఆప్’కు అంటుకున్న అవినీతి మకిలి, ఆప్ కాంగ్రెస్ విడిగా పోటీ చేస్తుండటం… వంటివన్నీ తమకు కలిసి వచ్చే అంశాలని బిజెపి చెప్పుకుంటోంది. దాదాపు అన్ని సామాజిక వర్గాల్లోనూ ఉన్న స్వింగ్ ఓట్లను ఎప్పట్లాగే, ఏ మేరకు ‘ఆప్’ తన వైపు తిప్పుకోగలుగుతుంది అనే దాన్ని బట్టి వారి విజయావకాశాలు ఆధారపడి ఉంటాయి. ఢిల్లీ అంతటా స్వచ్ఛంద కార్యకర్తలతో విస్తరించి ఉన్న పార్టీ ఆప్! 2014 లోక్‌సభ ఎన్నికల తర్వాత 2015 అసెంబ్లీ, 2019 లోక్‌సభ ఎన్నికల తర్వాత 2020 అసెంబ్లీ ఎన్నికలను పరిశీలిస్తే సగటున 30 శాతం ఓటు స్వింగ్ బిజెపి కాంగ్రెస్‌ల నుంచి ‘ఆప్’ వైపుంది. 2015 అసెంబ్లీ తర్వాత 2019 లోక్‌సభ ఎన్నికలు, అలాగే 2020 అసెంబ్లీ ఎన్నికల తర్వాత 2024 లోక్‌సభ ఎన్నికలను పరిశీలించి చూస్తే బిజెపి కాంగ్రెస్ పార్టీల వైపుకు ‘ఆప్’ నుంచి స్పష్టమైన ఓటు స్వింగ్ కనిపిస్తోంది. అగ్రవర్ణాల మొత్తం ఓట్లలో 30 శాతం స్వింగ్ ఓటుంటే, 2020 నుంచి 2024 ఎన్నికల నాటికి అందులో 28 శాతం ఆప్ నుంచి బిజెపి వైపు మళ్లింది. అలాగే, ఒబిసిల్లో 2530 శాతం స్వింగ్ ఓటుండగా, అందులో 31శాతం బిజెపి వైపు మళ్లింది. దళితుల్లో 4550% స్వింగ్ ఓటుంటే అందులో 47%, ముస్లింలలో 5560% స్వింగ్ ఓటుంటే, అందులో 55% ఓట్లు ‘ఆప్’ నుంచి బిజెపి వైపు మొగ్గినట్టు ‘సిఎస్‌డిఎస్‌లోక్‌నీతి’ పోస్ట్‌పోల్ సర్వే డేటా చెప్పింది.
ఢిల్లీ మహానగరంలో ఆప్‌కు 2025 శాతం బేస్ ఓటుండగా బిజెపికి 3540 శాతం బేస్ ఓటుంది. సగటున 30% తన వైపుకు ఆకట్టుకోగలుగుతున్న ఓటు వల్ల స్పష్టమైన ఆధిక్యత లభించి ‘ఆప్’ గెలుస్తోంది. గత మూడేసి లోక్‌సభ, అసెంబ్లీల ఎన్నికల ఓటింగ్ సరళి, స్వింగ్ తీరును గమనిస్తే ఇది తేటతెల్లమవుతోంది. 2024 లోక్‌సభ ఎన్నికల గణాంకాల మీద సగటున ఒసిల్లో 29%, ఒబిసిల్లో 29%, దళితుల్లో 41% ముస్లింల్లో 41% ఓట్లను తన వైపుకు అదనంగా ఆకట్టుకొని, స్వింగ్ మొగ్గు సాధిస్తేనే రేపటి అసెంబ్లీ ఎన్నికల్లో ‘ఆప్’కు గెలుపు సాధ్యమవుతుంది. అంటే మొత్తమ్మీద 30% సగటు స్వింగ్ అన్నమాట!
ఏ ‘పరివర్తన్’ వైపు మొగ్గేరో..?
ఢిల్లీ పరిపాలనలో ‘పరివర్తన్’, ‘మార్పు’ తెచ్చితీరుతామని బిజెపి అగ్రనేత, ప్రధాని నరేంద్ర మోడీ బల్లగుద్ది చెబుతున్నారు. నీతివంతమైన పాలన అందిస్తామనే నినాదంతో రాజకీయాల్లోకి వచ్చిన అర్వింద్ కేజ్రీవాల్ పదేళ్ల పాలన పూర్తి అవినీతిమయమని ప్రత్యర్థులు ప్రచారం చేస్తున్నారు. ముఖ్యంగా ‘ఢిల్లీ మద్యం విధానం’ స్కామ్, ఢిల్లీ మాజీ సిఎం కేజ్రీవాల్ సిఎం అధికార నివాసంగా కట్టుకున్న ‘అద్దాల మేడ’పై విమర్శలు గుప్పిస్తున్నారు. ‘ఆప్’ అగ్రశ్రేణి నేతలైన కేజ్రీవాల్, మనీశ్ సిసోడియా, సంజయ్ సింగ్, సత్యేంద్ర జైన్‌లు అరెస్టుయి బెయిల్‌పై ఉండటాన్ని ప్రస్తావిస్తున్నారు. ఇదే కేజ్రీవాల్ పాతిక సంవత్సరాల కింద రాజకీయాల్లోకి రాక ముందు “పరివర్తన్’ పేరిట ఒక స్వచ్ఛంద సంస్థను నడుపుతూ ‘సమాచార హక్కు’ మాధ్యమంగా ఉద్యమించిన సంగతి తెలిసిందే! అప్పుడే ఆయనకు ప్రతిష్ఠాత్మక “రామన్ మెగ్‌సేసే” అవార్డు లభించింది. సుపరిపాలన, సంక్షేమ కార్యక్రమాలకు పెద్ద పీట వేసిన ‘ఆప్’ ఢిల్లీ ప్రభుత్వానికి కేంద్రం సహాయ నిరాకరణ చేస్తోందని ప్రచారం అందుకుంది.
లెఫ్టినెంట్ గవర్నర్ రూపంలో రాష్ట్ర ప్రభుత్వానికి అడ్డంకులు సృష్టిస్తూ రాజకీయం చేస్తోందన్నది బిజెపిపై వారిది ప్రధాన విమర్శ. ఆర్థిక అసమానతలున్న సమాజంలో విద్య, వైద్యం, ప్రభుత్వమే మెరుగ్గా నిర్వహిస్తూ, ఇతరత్రా పేదలకు సబ్సిడీలు ఇవ్వటం సర్కారు బాధ్యత అని ‘ఆప్’ వివరిస్తోంది. విద్యుత్, తాగునీటి సరఫరాలో తమ ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ ‘ఉచితాల’ కింద రాదంటూ… రేవడీ పే చర్చా’ చేపట్టి పేద, మధ్య తరగతి వర్గాలను ఆకట్టుకునే యత్నం చేస్తోంది. సగటున, ప్రతి ఇంటికి నెలకు రూ. 2464 మేర ప్రయోజనం కల్పిస్తున్నట్టు ప్రచారం చేపట్టింది. ‘ఆప్’ ప్రభుత్వపు పథకాలు నిలిచేవి కావు, కేవలం జనాకర్షక పథకాలు అంటూనే, తాము అధికారంలోకి వస్తే అవి రద్దు కావు, కొనసాగుతాయి అనటం ద్వారా బిజెపి, కాంగ్రెస్‌ల వాదనల్లోని డొల్లతనం ఇట్టే బట్టబయలవుతోంది. తాము అధికారంలోకి వస్తే నిరుద్యోగులకు నెలకు రూ. 8500/ ఇస్తామని, అది ఉచితంగా కాకుండా శిక్షణలో, కంపెనీలు పరిశ్రమల్లో పనితో ముడిపెడతామని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. ఎవరి ఓటు బ్యాంకు వారికి, అసెంబ్లీ లోక్‌సభ ఎన్నికల్ని బట్టి అనుకూలమైన స్వింగ్ వారికి ఉన్నందున… ఎన్నికల ప్రచారంలో ఆయా పార్టీలు చేస్తున్న ప్రచారాంశాలు, వాటి వివరణలు (న్యారెటివ్స్) ప్రాధాన్యత సంతరించుకుంటున్నాయి. ఒక రకంగా అవే మొగ్గును నిర్ణయిస్తాయేమో?
నిలువకుంటే… ఎదురీతే!
ఇన్నాళ్లు ‘ఆప్’, దాని ప్రారంభకుడు అర్వింద్ కేజ్రీవాల్ కున్న రాజకీయ ప్రత్యేకతలు ఎన్నికల రాజకీయాల్లో స్పష్టమైన ఆధిక్యతను ఇస్తూ వస్తున్నాయి. అందువల్లే ‘ఢిల్లీ మోడల్’ పరిపాలన వారికి వరుస మూడు (2013, 2015, 2020) విజయాలను, ప్రభుత్వాలను ఇవ్వగలిగింది. 2022 లో పంజాబ్ రాష్ట్రంలోని ‘ఆప్’ అధికారంలోకి రాగలిగింది. కాని ఇటీవలి కాలంలో ఆ ప్రత్యేకతకు గండిపడుతోంది. ‘లిక్కర్ స్కామ్’, అద్దాల మేడ అవినీతి’ కారణంగా ఆప్ ప్రతిష్ఠ కొంత మేర మసకబారింది. అయితే ఇది.. ప్రత్యర్థుల ప్రచారాలకు, కేంద్ర ప్రభుత్వ నిర్వహణలోని దర్యాప్తు సంస్థలకు, మీడియా కథనాలకు మాత్రమే పరిమితమైందా? లేక ఢిల్లీ ఓటర్లలోకీ వెళ్లిందా? అన్నది రేపటి ఎన్నికలతో గాని స్పష్టం కాదు. ప్రత్యర్థుల ప్రచారాలను ప్రజలు ఎంత మేర నమ్ముతున్నారు అన్నది తుది ఫలితాన్ని తేలుస్తుంది. ఇదివరకటి ఎన్నికల సరళి, లోక్‌సభ అసెంబ్లీ ఎన్నికల నడుమ మారుతున్న ‘స్వింగ్’ను బట్టి చూస్తే… ‘ఆప్’కు అనుకూల పరిస్థితులుండాలి. కాని ఇటీవలి హర్యానా, మహారాష్ట్ర ఎన్నికల్లో బిజెపి, దాని మిత్రపక్షాల “ఎన్నికల వ్యవహారదక్షత” ఇప్పుడు ఢిల్లీలో దూకుడు చూస్తే… సందేహాలు తప్పవు. గణాంకాలు మాత్రం ‘ఆప్’ వైపే ఉన్నాయి. 2013 ఎన్నికల నుంచి ‘ఆప్’ వరుసగా, నిరవధికంగా గెలుస్తున్న స్థానాలు 26 ఉన్నాయి. ఇప్పటి వరకు ఏ ఎన్నికలోనూ ఆప్ గెలవనిది ఒక సీటు మాత్రమే! 2008 (నియోజకవర్గాల పునర్విభజన తర్వాతి) నుంచి బిజెపి వరుసగా అన్ని ఎన్నికల్లో ఓడిపోతున్న స్థానాలు 23 ఉంటే, అలా కాంగ్రెస్ ఓడిపోతున్న స్థానాలు 25 ఉన్నాయి. గణాంకాలు గత చరిత్ర ఎంత ఘనంగా ఉన్నా… ‘ఆప్’ తన ప్రత్యేకతలు ప్రజాహృదయాల్లో నిలుపుకోకుంటే మాత్రం ‘ఎదురీత’ తప్పదు!
దిలీప్‌రెడ్డి