రూ.11,500 కోట్ల ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని కేంద్రం నిర్ణయం
నేడు శుభవార్త అందించనున్న కేంద్రం
విధివిధానాలను ప్రకటించనున్న కేంద్ర ఉక్కుశాఖ మంత్రి కుమారస్వామి
మన తెలంగాణ / అమరావతి : విశాఖ స్టీల్ ప్లాంట్‌కు ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చేందుకు కేంద్రప్రభుత్వం సిద్ధమైంది. ఆర్థికంగా నష్టాల్లో ఉన్న రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ (వైజాగ్ స్టీల్ ప్లాంట్) పరిరక్షణకు నడుంబిగించింది. ప్రస్తుతం విశాఖ స్టీల్ ప్లాంట్ ఆర్థికంగా, నిర్వహణ పరంగా నష్టాలను ఎదుర్కొంటోంది. దీనిని అధిగమించేందుకు భారీగా సాయం అందించాలని నిర్ణయించింది. గురువారం జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో స్టీల్ ప్లాంట్ అంశంపై చర్చ జరిగింది. ఆర్థిక వ్యవహారాల కేబినెట్ ప్రతిపాదనకు మంత్రివర్గం ఆమోదం తెలిపినట్లు సమాచారం. రూ.11,500 కోట్ల ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని కేంద్రం నిర్ణయించినట్లు తెలుస్తోంది. ప్రత్యేక ప్యాకేజీ ద్వారా స్టీల్ ప్లాంట్‌ను నడిపేందుకు సిద్ధమైనట్టు సమాచారం. దీనికి సంబంధించిన విధి విధానాలను కేంద్ర ఉక్కుశాఖ మంత్రి కుమారస్వామి శుక్రవారం వెల్లడించే అవకాశమున్నట్లు తెలుస్తోంది.
ఇటీవల ఎపి సీఎం చంద్రబాబు నాయుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలిసినప్పుడు విశాఖ స్టీల్ ప్లాంట్‌కు ఆర్థిక ప్యాకేజీ అందించాలని కోరిన విషయం తెలిసిందే. స్టీల్ ప్లాంట్ ప్రైవేటు పరం కాదని గతంలోనే కేంద్ర మంత్రి కుమారస్వామి వెల్లడించారు. స్టీల్ ప్లాంట్ పరిరక్షణ మార్గాలపై పలుమార్లు మంత్రిత్వశాఖ చర్చలు జరిపింది. కేంద్ర ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ కు రూ. రూ.11,500 కోట్లు నిర్వహణ మూలధనం కింద సమకూర్చేందుకు నిర్ణయించింది. ఈ మేరకు శుక్రవారం అధికారిక ప్రకటన చేయనున్నారు. ఇంత పెద్ద మొత్తంలో నిధులు కేటాయిస్తే ప్రైవేటీకరణపై పూర్తి స్థాయిలో వెనుకడుగు వేసినట్లే అనుకోవచ్చని భావిస్తున్నారు.
ఉత్పత్తి మెరుగుపడిన తర్వాత సెయిల్ లో విలీనం చేసే అంశంపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ చేయాలని నిర్ణయించారు. అప్పట్లో ప్రభుత్వం రాజకీయం చేసింది. కేంద్రం వద్ద పట్టుబట్టలేదు. ఫలితంగా ప్రైవేటీకరణ ప్రక్రియ వేగంగా సాగింది. అయితే ప్రభుత్వం మారే సరికి పూర్తిగా ప్రాధాన్యాలు మారిపోయాయి. టీడీపీ ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేటీకరణకు అంగీకరించే అవకాశం లేకుండా పోయింది. దాంతో కేంద్రం ప్లాంట్ ను నిలబెట్టే చర్యలపై దృష్టి పెట్టింది. అందులో భాగంగా నిర్వహణ మూలధనం ఇస్తున్నారు. స్టీల్ ప్లాంట్ కు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేదు. వంద శాతం కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన రాష్ట్రీయ ఇస్పాత్ నిగం లిమిటెడ్ లో స్టీల్ ప్లాంట్ భాగం.అయితే తెలుగు ప్రజలకు విశాఖ స్టీల్ ప్లాంట్ ఓ సెంటిమెంట్. అందుకే టీడీపీ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేటీకరణ వద్దని అంటోంది. కేంద్రంలో కీలక పాత్ర పోషిస్తూండటంతో ప్రైవేటీకరణ జరగనివ్వబోమన్న మాటకు కట్టుబడి చర్యలు తీసుకుంటున్నారు.
కొన్ని నెలలుగా కార్మికుల ఆందోళన : నష్టాల్లో ఉన్న విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరించాలని కేంద్రం గతంలో నిర్ణయం తీసుకుంది. కనీస సామర్థ్యంతో పనిచేస్తుండడమే నష్టాలు పెరిగిపోవడానికి కారణమని కేంద్రం అంచనాకు వచ్చింది. దీంతో ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్మికులు కొన్ని నెలలుగా ఆందోళన చేస్తున్నారు. ఇతర ఉక్కు పరిశ్రమల మాదిరిగా సొంతంగా గనులు లేకపోవడమే విశాఖ స్టీల్‌ప్లాంట్ నష్టాలకు కారణమని కార్మిక సంఘాలు పేర్కొంటున్నాయి.
సెయిల్‌లో విలీనం చేయాలన్న డిమాండ్‌ను కూడా కార్మిక సంఘాలు చేస్తున్నాయి. సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో ఎన్డీయే కూటమి అధికారంలోకి రావడంతో కార్మికుల ఆశలు చిగురించాయి. విశాఖ ఉక్కు పరిరక్షణకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని వివిధ సందర్భాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు కేంద్రం సిద్ధం కావడంతో ప్రత్యేక ప్యాకేజీ విధివిధానాలు ఎలా ఉంటాయన్న అంశంపై కార్మిక వర్గాల్లో ఆసక్తి నెలకొంది.
విశాఖ ఉక్కుకు కొత్త ఊపిరి : విశాఖపట్నం స్టీల్ ప్లాంటును ఆర్థికంగా ఆదుకోవడానికి కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించినట్లు తెలుస్తోంది. రూ.11,500 కోట్లతో కొత్త రివైవల్ ప్యాకేజీ ఇవ్వనున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే నిధుల రూపంలో కాకుండా టెక్నాలజీ రూపంలో అందిస్తారని చెబుతున్నారు. ప్రస్తుతం విశాఖ ప్లాంటులో మూడు బ్లాస్ట్ ఫర్నేసుల ద్వారా స్టీల్ తయారుచేస్తున్నారు.
ఆర్థిక ఇబ్బందులతో ముడి పదార్థాలు సమకూర్చుకోలేక ప్రస్తుతం రెండు బ్లాస్ట్ ఫర్నేసులనే నడుపుతున్నారు. వీటి స్థానంలో కొత్తగా మూడు ‘ఎలక్ట్రిక్ ఆర్క్ ఫర్నేసులు’ ఏర్పాటు చేస్తారని అంటున్నారు. ఈ కొత్త ఫర్నేసులకు ఒక్కొక్క దానికి రూ.2,500 కోట్ల నుంచి రూ.3 వేల కోట్లు ఖర్చవుతుంది. మూడింటికీ రూ.7,500 కోట్లు అవసరమని అంచనా. వీటి ద్వారా నాణ్యమైన ఉక్కు ఉత్పత్తి చేస్తారు. లాంగ్ ప్రొడక్టులు, భవన నిర్మాణాలు, మౌలిక వసతుల రంగంలో అధికంగా ఉపయోగించే స్టీల్‌ను తయారుచేసి విదేశాలకు ఎగుమతి చేయాలనేది ప్రణాళిక. ఈ ఎలక్ట్రిక్ ఆర్క్ ఫర్నేస్‌లకు అవసరమైన టెక్నాలజీని అందించేందుకు జపాన్ కంపెనీలు ఆసక్తి చూపుతున్నాయి.
ఇందులో ప్రధానంగా వినిపిస్తున్న పేరు ‘పోస్కో’. ఈ సంస్థ నాలుగేళ్ల క్రితమే విశాఖ ఉక్కుతో జాయింట్ వెంచర్ కోసం ఆసక్తి చూపిన సంగతి తెలిసిందే. ప్లాంటులో 1,500 ఎకరాలు కేటాయిస్తే స్టీల్ ఉత్పత్తి చేసి, లాభాల్లో వాటా ఇస్తామని అప్పట్లో ప్రతిపాదించింది. అయితే ఈ ప్రతిపాదనను కార్మిక వర్గాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. విశాఖ స్టీల్‌ను ప్రైవేటుపరం చేయడానికి కుట్ర చేస్తున్నారంటూ ఆందోళనలు చేపట్టాయి. దాంతో ఆ ఆలోచన పక్కనపెట్టారు. ఇప్పుడు కేంద్రం విశాఖ ఉక్కులో ప్రైవేటు భాగస్వామ్యం పెంచి, పనితీరు మెరుగుపరచాలని, నష్టాలు తగ్గించి, లాభాల బాటలో నడపాలని యోచిస్తోంది. దీనికి కొత్త టెక్నాలజీ ఉపయోగించాలని భావిస్తోంది.
ఎలక్ట్రిక్ ఆర్క్ ఫర్నేసులతో లాభం ఏమిటి? : ప్రస్తుతం కోకింగ్ కోల్, ముడి ఇనుము ఉపయోగించి బ్లాస్ట్ ఫర్నేస్‌ల ద్వారా స్టీల్ తయారు చేస్తున్నారు. ఆర్క్ ఫర్నేస్‌లకైతే పిగ్ ఐరన్, ఇనుము తుక్కు ఉపయోగిస్తారు. కొత్త టెక్నాలజీ వల్ల కార్బన్ వ్యర్థాలు తక్కువగా వస్తాయి. పర్యావరణ హితంగా ఉంటాయి. విశాఖ ప్లాంటులో రెండు ఆర్క్ ఫర్నేస్‌లు ఇప్పటికే ఉన్నాయి. కాకపోతే వాటి సామర్థ్యం చాలా తక్కువ. ప్లాంటు అప్పులు తీర్చి, కొత్త రుణాలు తీసుకోవడానికి సుమారు రూ.20 వేల కోట్లు అవసరం. కేంద్రం ఆ దిశగా చర్యలు చేపట్టకుండా కొత్త టెక్నాలజీ, పర్యావరణ హితమంటూ చేస్తున్న ప్రతిపాదనలను ఉద్యోగ, కార్మిక వర్గాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. రివైవల్ ప్యాకేజీ పేరిట పోస్కోను తీసుకువచ్చి తమ నెత్తిన రుద్దే ప్రయత్నం చేస్తున్నారని, ఇది సరైన నిర్ణయం కాదని ముక్తకంఠంతో చెబుతున్నాయి.