ఈసారి రూ.50 నుంచి రూ.60 వేల కోట్ల పెట్టుబడులే లక్షంగా ముందుకు
సింగపూర్‌కు బయలుదేరి వెళ్లిన సిఎం రేవంత్ రెడ్డి బృందం
మనతెలంగాణ/హైదరాబాద్: భారీ పెట్టుబడులే లక్ష్యంగా సిఎం రేవంత్‌రెడ్డి విదేశీ పర్యటన కొనసాగనుంది. గతేడాది దావోస్ పర్యటన సందర్భంగా రాష్ట్రానికి రూ.40 వేల కోట్ల పెట్టుబడులను ప్రభుత్వం సమీకరించింది. ఈసారి దానికి రెట్టింపుగా రూ.50 నుంచి రూ.60 వేల కోట్ల పెట్టుబడులను రాష్ట్రానికి తీసుకొచ్చేలా ప్రభుత్వం పక్కా ప్రణాళికలతో విదేశీ పర్యటనకు బయలుదేరి వెళ్లింది. అందులో భాగంగా నేడు (గురువారం రాత్రి) సిఎం రేవంత్‌రెడ్డి, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబుతో కలిసి ఈ పర్యటనకు బయలుదేరి వెళ్లారు. ఢిల్లీ నుంచి గురువారం రాత్రి 10 గంటలకు బయల్దేరిన ముఖ్యమంత్రి ముందుగా శుక్రవారం సింగపూర్‌కు చేరుకుంటారు. 17, 18, 19 తేదీల్లో సింగపూర్‌లో మూడు రోజులు సిఎం రేవంత్‌రెడ్డి పర్యటిస్తారు.
రాష్ట్రంలో పెట్టుబడులకు సంబంధించి వివిధ కంపెనీల ప్రతినిధులతో ఆయన సంప్రదింపులు జరుపుతారు. ఈ సందర్భంగా ప్రపంచంలో పేరొందిన సింగపూర్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్‌ను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సందర్శిస్తారు. నైపుణ్య అభివృద్ధికి ఆ యూనివర్సిటీ ఎంచుకున్న కోర్సులు, అనుసరిస్తున్న విధానాలను అధ్యయనం చేస్తారు. రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేసిన తెలంగాణ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి సహకారం అందించేందుకు సింగపూర్ ఐటీఈతో ఒప్పందం చేసుకుంటారు. సింగపూర్‌లో రివర్ ఫ్రంట్ ను సందర్శిస్తారు. ప్రపంచ స్థాయిలో మూసీ పునరుజ్జీవనం చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తున్న నేపథ్యంలో అక్కడి రివర్ ఫ్రంట్ ఏరియా అభివృద్ధి చేసిన తీరుతెన్నులను పరిశీలిస్తారు.
20 నుంచి 22వ తేదీ వరకు వరల్డ్ ఎకనామిక్ ఫోరం వార్షిక సదస్సులో….
సింగపూర్ పర్యటన అనంతరం ముఖ్యమంత్రి బృందం 20వ తేదీ ఉదయం దావోస్‌కు చేరుకుంటుంది. 20వ తేదీ నుంచి 22వ తేదీ వరకు వరల్డ్ ఎకనామిక్ ఫోరం వార్షిక సదస్సు 2025లో పాల్గొంటారు. పెట్టుబడుల గమ్యస్థానంగా తెలంగాణను ప్రపంచానికి పరిచయం చేసేందుకు దావోస్ పర్యటనను రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యంగా భావిస్తోంది. గతేడాది దావోస్ పర్యటన సందర్భంగా రాష్ట్రానికి రూ.40 వేల కోట్ల పెట్టుబడులను ప్రభుత్వం సమీకరించింది. ఈ సారి అంతకు మించిన పెట్టుబడులే లక్ష్యంగా తమ పర్యటన కొనసాగుతుందని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఇటీవలే అధికారులతో సమీక్షలో వెల్లడించారు.
రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు, రాష్ట్రంలో చేపడుతున్న వివిధ అభివృద్ధి ప్రాజెక్టులతో అంతర్జాతీయ దిగ్గజ కంపెనీలు పెట్టుబడులకు ఆసక్తి ప్రదర్శిస్తాయని అధికారులు కూడా ఆశాభావం వ్యక్తం చేశారు. ఇప్పటికే గ్లోబల్ కెపాబులిటీ సెంటర్లకు హైదరాబాద్ అడ్డాగా మారింది. ఐటీ, ఏఐ, ఫార్మా, మాన్యుఫాక్చరింగ్ రంగాలకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సహకాలతో పాటు ఇటీవల ప్రకటించిన పునరుత్పాదక ఇంధన ఉత్పత్తి విధానం (క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీ)పై ప్రముఖ కంపెనీలు ఆసక్తి ప్రదర్శిస్తున్నాయి. హైదరాబాద్ లో ఫ్యూచర్ సిటీ అభివృద్ధి, వరల్డ్ క్లాస్ సిటీగా గ్రేటర్ సిటిలో ఎలివేటేడ్ కారిడార్లు, రేడియల్ రోడ్లు, మెట్రో విస్తరణ, మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టులు దేశవ్యాప్తంగా అందరినీ ఆకర్షిస్తున్నాయి. ఈ నేపథ్యంలో విదేశీ పెట్టుబడులను భారీగా ఆకర్శించే విధంగా సిఎం రేవంత్‌రెడ్డి తమ బృందాన్ని సమాయత్తం చేశారు.
తొలి ఏడాదిలో చేపట్టిన విదేశీ పర్యటనలన్నీ విజయవంతం
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తొలి ఏడాదిలో చేపట్టిన విదేశీ పర్యటనలన్నీ విజయవంతమయ్యాయి. గతేడాది దావోస్ పర్యటనతో పాటు అమెరికా, దక్షిణ కొరియా పర్యటనలతో రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు వచ్చాయి. దేశంలో అద్భుతమైన ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతున్న తెలంగాణకు భారీగా పెట్టుబడులు సమీకరించే లక్ష్యంతో సిఎం నేతృత్వంలోని రాష్ట్ర ప్రతినిధి బృందం ఈ విదేశీ పర్యటనకు బయలుదేరింది. దీంతోపాటు పర్యటన క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీ, ఫ్యూచర్ సిటీపై ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి బృందం ఫోకస్ పెట్టింది. అందులో భాగంగానే ముఖ్యమంత్రి బృందం విదేశీ పర్యటన నేపథ్యంలో సింగపూర్‌లో 3 రోజులు, దావోస్‌లో 3 రోజులు పర్యటించనుంది.