ఫెమా నిబంధనల ఉల్లంఘనలు,
ఆర్‌బిఐ అనుమతి లేకుండా
నిధుల బదిలీపై ప్రశ్నలు
ఇప్పటికే ఐఎఎస్ అధికారి అరవింద్ కుమార్,
బిఎల్‌ఎన్ రెడ్డిని ప్రశ్నించిన ఇడి
ఆ ఇద్దరి స్టేట్‌మెంట్స్ ఆధారంగా
కెటిఆర్‌ను ప్రశ్నించిన ఇడి అధికారులు
మనతెలంగాణ/హైదరాబాద్ : ఫార్ములా -ఈ రేస్ కేసులో బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ఇడి విచారణ గురువారం సాయంత్రం 5.45 గంటలకు ముగిసింది. సుమారు 7 గంటల పాటు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు కెటిఆర్‌ను ప్రశ్నించారు. ఫార్ములా ఈ కేసులో ఎసిబి నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్ ఆధారంగా ఇసిఐఆర్‌ను ఈడీ నమోదు చేసింది. ఫార్ములా -ఈ రేస్‌లో నిబంధనల ఉల్లంఘనపై ఎసిబి దర్యాప్తు చేస్తుండగా, ఇందులో ఆర్‌బిఐ అనుమతి లేకుండా విదేశీ సంస్థకు నిధుల చెల్లింపుపై ఇడి మరో కేసు నమోదు చేసింది. ఈ క్రమంలో మొదటిసారి కెటిఆర్‌ను ఇడి ప్రశ్నించింది. ఉదయం 10.40 గంటలకు ప్రారంభమైన విచారణ సాయంత్రం 5.45 గంటలకు వరకు సాగింది. కెటిఆర్ సోమవారం ఉదయం గచ్చిబౌలిలోని తన నివాసం నుంచి బయలుదేరి నేరుగా ఇడి కార్యాలయానికి చేరుకున్నారు.
ఈ నేపథ్యంలో బషీర్‌బాగ్‌లోని ఇడి కార్యాలయం ముందు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సుమారు 200 మంది పోలీసులు అక్కడ మోహరించారు. బాష్పవాయువు, వాటర్ కెనాన్ల వాహనాలు తెప్పించారు. వాస్తవానికి కెటిఆర్ ఈ నెల 7న హాజరు కావాల్సి ఉన్నా, తాను రాలేనని చెప్పడంతో 16న విచారణకు హాజరు కావాలని ఇడి అధికారులు మరోసారి నోటీసులు జారీ చేశారు.
నిబంధనలు ఎందుకు పాటించలేదు : కెటిఆర్‌పై ఇడి ప్రశ్నల వర్షం
ఈ కార్ రేసు నిర్వాహణకు సంబంధించి రూ.55 కోట్లు బదిలీ చేసే సమయంలో నిబంధనలు ఎందుకు పాటించలేదనే అంశంపై కెటిఆర్‌ను ఇడి అధికారులు ప్రశ్నించినట్లు తెలిసింది. ఈ కేసులో విదేశీ సంస్థకు నిధుల చెల్లింపుల్లో ఫెమా నిబంధనల ఉల్లంఘనలు జరిగాయనే కోణంలో ఇడి అధికారులు ప్రశ్నించినట్లు సమాచారం. రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బిఐ) అనుమతి లేకుండా విదేశీ సంస్థకు రూపాయల్లో కాకుండా బ్రిటన్ పౌండ్స్ రూపంలో చెల్లింపుపై, అలాగే కేబినెట్, ఆర్థిక శాఖ అనుమతి లేకుండా నిధులు ఎలా మళ్లిస్తారు అని ప్రశ్నించినట్లు తెలిసింది. బదిలీ అయిన రూ.55 కోట్లు ఎఫ్‌ఇఒ కంపెనీ నుంచి ఇతర అకౌంట్లకు ఏమన్నా బదిలీ అయ్యిందా అనే కోణంలో ప్రశ్నించినట్లు తెలుస్తోంది.
హెచ్‌ఎండిఎ పాలకమండలి అనుమతి లేకుండా ప్రైవేటు సంస్థకు పెద్ద మొత్తంలో నిధులు ఎలా చెల్లిస్తారు… ఈ రేసు నిర్వహణతో రూ.700 కోట్ల లాభం వచ్చిందని చెబుతున్నారని.. దానికి సబంధించిన లెక్కలు ఉన్నాయా.. రేసుకు సంబంధించిన ప్రకటనలతో ప్రభుత్వ సంస్థలకు ఏం లాభాలు వచ్చాయని, టికెట్లు అమ్మడం ద్వారా వచ్చిన ఆదాయం ఎంత అంటూ కెటిఆర్‌ను ఇడి అధికారులు అడిగినట్లు సమాచారం. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, హెచ్‌ఎండిఎ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్‌ఎన్ రెడ్డిని ఇడి ప్రశ్నించింది.
ఒక్కొక్కరిని తొమ్మిది గంటల పాటు విచారించిన ఇడి అధికారులు.. ఫార్ములా ఈ రేసుకు సంబంధించి ఒప్పందాలు, లావాదేవీలు, ఆర్‌బిఐ అనుమతులు లేకుండా ఏవిధంగా లావాదేవీలు జరిపారు అనే అంశాలపై పూర్తి స్థాయి వివరాలను సేకరించడంతో పాటు స్టేట్‌మెంట్‌ను రికార్డు చేశారు. ఆ ఇద్దరి స్టేట్‌మెంట్స్ ఆధారంగా కెటిఆర్‌ను ఇడి అధికారులు ప్రశ్నించినట్లు తెలిసింది.
ఇడి కార్యాలయం వద్ద ఉద్రిక్తత
కెటిఆర్ ఇడి విచారణ నేపథ్యంలో బిఆర్‌ఎస్ శ్రేణులు భారీగా ఇడి కార్యాలయానికి తరలివచ్చారు. ఈ క్రమంలో ఇడి కార్యాలయం వద్ద సోమవారం ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. ఉదయం కెటిఆర్ వాహనం రాగానే ఒక్కసారిగా ఇడి కార్యాలయం వైపు బిఆర్‌ఎస్ నేతలు, కార్యకర్తలు దూసుకొచ్చారు.దీంతో ఆ ప్రాంతంలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. కెటిఆర్ వాహనం ఇడి కార్యాలయానికి వచ్చిన వెంటనే వందల మంది కార్యకర్తలు కారు చుట్టుముట్టారు. కెటిఆర్‌కు మద్దతుగా నినాదాలు చేశారు.
దీంతో వారందరినీ అతి కష్టం మీద అక్కడి నుంచి తరలించిన తర్వాతనే కెటిఆర్ కారును పోలీసులు లోపలికి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో ఇడి కార్యాలయం వద్ద స్వల్ప తోపులాట చోటు చేసుకుంది. పోలీసులకు బిఆర్‌ఎస్ నేతలకు మధ్య వాగ్వాదం జరిగింది. అనుమతి లేకుండా లోపలికి వచ్చారంటూ పలువురు బిఆర్‌ఎస్ నేతలను అదుపులోకి తీసుకుని పోలీసులు వారిని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. సుమారు వంద మంది కార్యకర్తలు ఇడి కార్యాలయం నుంచి వివిధ పోలీస్‌స్టేషన్‌లకు తరలించారు.
ఇడి కార్యాలయం వద్ద ఆంక్షలు…
కెటిఆర్ ఇడి విచారణ నేపథ్యంలో సోమవారం మధ్యాహ్నం వరకు ఇడి కార్యాలయం వద్ద పోలీసులు ఆంక్షలు విధించారు. ఇడి కార్యాలయం ముందు ఉన్న రోడ్డుపై వాహనాలను అనుమతించలేదు. ఇడి కార్యాలయం వైపు వచ్చే వాహనాలను పోలీసులు దారి మళ్లించారు. గన్‌పార్క్ వద్ద బారికేడ్లను ఏర్పాటు చేసి వాహనాలను మరో మార్గంలోకి మళ్లించారు. కేవలం ఆయ్‌కార్ భవన్ మీదుగా వచ్చే వాహనాలను మాత్రమే పోలీసులు అనుమతిచ్చారు.