తెలంగాణలో ఆప్ లిక్కర్ పార్ట్నర్ను ఓడించాం..
ఇప్పుడు ఢిల్లీలో కేజ్రీవాల్‌ను చిత్తు చేస్తాం
తెలంగాణలో రైతులకు రూ.2లక్షల రుణమాఫీ చేశాం
ఢిల్లీ ప్రజలకు రెండు గ్యారంటీలు ఇస్తున్నాం
అధికారంలోకి రాగానే 300 యూనిట్ల వరకు ఉచిత
విద్యుత్, రూ.500లకే గ్యాస్ సిలిండర్ ఇస్తాం
తెలంగాణ స్ఫూర్తితో ఢిల్లీలో హామీల అమలు ఢిల్లీ
అసెంబ్లీ ఎన్నికల గ్యారంటీ పోస్టర్ ఆవిష్కరణలో
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
మనతెలంగాణ/హైదరాబాద్: కేజ్రీవాల్ లిక్కర్ పార్టనర్ బిఆర్ఎస్ను తెలంగాణలో ఓడించామని సిఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ఇప్పుడు ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్‌ను ఓడిస్తామని సిఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన గ్యారెంటీలను అమలు చేస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. గురువారం ఢిల్లీలో రెండోరోజూ సిఎం రేవంత్‌రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల గ్యారంటీ పోస్టర్లను సిఎం రేవంత్ రెడ్డి విడుదల చేశారు.
ఈ కార్యక్రమంలో ఢిల్లీ పిసిసి అధ్యక్షుడు దేవేంద్ర యాదవ్, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ ఎంపిలు మల్లు రవి, రఘువీర్ రెడ్డి, సురేష్ షెట్కార్, షబ్బీర్ అలీ, సంపత్, ఢిల్లీ కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిఎం రేవంత్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ అవినీతిని అడ్డుకుంటే చాలు ఆ నిధులు పేదలకు పంచవచ్చని, తెలంగాణలో అదే చేశామన్నారు. కెసిఆర్ తెలంగాణను దోచుకున్నారని సిఎం రేవంత్ మండిపడ్డారు. పెట్టబడుల కోసం దావోస్ వెళ్తున్నామని, వచ్చాక ఎన్ని నిధులు తీసుకొచ్చామో చెబుతామని సిఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలో రైతులకు రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేశామని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణలో విజయవంతంగా ఎన్నికల హామీలు అమలు చేస్తున్నామని సిఎం రేవంత్ ఉద్ఘాటించారు.
తెలంగాణలో 55 వేల మందికి ఉద్యోగాలు ఇచ్చాం
రాష్ట్రంలో 55 వేల మందికి ఉద్యోగాలు ఇచ్చామని సిఎం రేవంత్‌రెడ్డి గుర్తుచేశారు. తెలంగాణలో మహిళల కోసం ఉచిత ప్రయాణం అమలు చేశామన్నారు. ఇప్పటి వరకు 120 కోట్ల జీరో టికెట్లతో మహిళలు ప్రయాణం చేశారని సిఎం రేవంత్ పేర్కొన్నారు. ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు అవకాశం ఇవ్వాలని ఆయన కోరారు. రాష్ట్రంలో తమ ప్రభుత్వం నిబద్ధతతో పనిచేస్తోందని సిఎం రేవంత్ తెలిపారు. ఢిల్లీ ప్రజలకు రెండు గ్యారంటీ హామీలు ఇస్తున్నామని ఆయన తెలిపారు. ఢిల్లీలో 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, రూ.500లకే గ్యాస్ సిలిండర్ అందిస్తామని హామీ ఇస్తున్నామని సిఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ ఏర్పాటు కోసం సోనియా గాంధీ ఎంతో కృషి చేశారని ఆయన పేర్కొన్నారు.
తెలుగు రాష్ట్రాల్లో పార్టీకి చాలా నష్టం జరిగినా సరే హామీ నిలబెట్టుకున్నారు తప్ప వెనుకడుగు వేయలేదని ఆయన ఉద్ఘాటించారు. షీలా దీక్షిత్ సిఎంగా ఉన్నప్పుడు మాత్రమే ఢిల్లీలో అభివృద్ధి జరిగింది తప్ప ఆ తర్వాత పరిస్థితి ఎలాంటి దుస్థితికి చేరుకుందో చూడాలన్నారు. ఢిల్లీలో అడుగు పెట్టాలంటే భయపడే పరిస్థితి ఏర్పడిందన్నారు. ఇటు సిఎంగా కేజ్రీవాల్, అటు పిఎంగా ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఢిల్లీకి చేసింది ఏమీ లేదని సిఎం రేవంత్ విమర్శించారు. అబద్ధాలు ఆడటంలో ప్రధాని మోడీ, ఢిల్లీ మాజీ సిఎం కేజ్రీవాల్ ఒక్కటేనని ఆయన ఎద్దేవా చేశారు.
ఇద్దరూ కలిసి ఢిల్లీని నాశనం చేశారని, ఇద్దరూ వేర్వేరు కాదని, ఇద్దరూ ఒక్కటేనని ఆయన విమర్శించారు. ఢిల్లీని బాగుచేయాలంటే కాంగ్రెస్ అధికారంలోకి రావాల్సిందేనన్నారు. వాతావరణ కాలుష్యమే కాదు, రాజకీయ కాలుష్యాన్ని కూడా ఈ ఇద్దరూ కలిసి పెంచారని ఆయన మండిపడ్డారు. తెలంగాణలో అమలు చేస్తున్న మాదిరిగానే ఢిల్లీలో కాంగ్రెస్‌ను గెలిపిస్తే ఇచ్చిన హామీలు అమలు చేస్తామని సిఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు.